Dubai Rains: దుబాయ్‌లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్‌ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్‌లైన్స్‌

Dubai Rains: దుబాయ్‌ నగరంలో మరోసారి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు విమానాలు రద్దయ్యాయి. ఈ ఎడారి దేశానికి వెళ్లే ప్రయాణికులకు భారత ఎయిర్‌లైన్స్‌ అడ్వైజరీ జారీ చేశాయి.

Published : 02 May 2024 15:45 IST

దుబాయ్‌: తీవ్ర ఎండలతో ఎప్పుడూ ఉక్కిరిబిక్కిరయ్యే ఎడారి దేశం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE)లో ఇటీవల అనూహ్య వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత నెలలో ఈ ఎడారి దేశాన్ని కుంభవృష్టి వణికించగా.. తాజాగా మరోసారి ఇక్కడ వర్షాలు (Rains) కురుస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు (Flight Services) రద్దయ్యాయి.

బుధవారం రాత్రి నుంచి యూఏఈ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. దుబాయ్‌ (Dubai), అబుదాబీ సహా పలు నగరాల్లో ఈదురుగాలులు, ఉరుములు-మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఫలితంగా దుబాయ్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో పలు విమానాలు రద్దయ్యాయి. కొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. శుక్రవారం వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

వడగళ్లతో దెబ్బతిన్న రెక్కలు.. విమానానికి తప్పిన ప్రమాదం

ఈ క్రమంలోనే భారత్‌కు చెందిన పలు విమానయాన సంస్థలు (Airlines) తమ ప్రయాణికులకు ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేశాయి. ‘‘దుబాయ్‌, షార్జా, అబుదాబీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా మా విమాన సేవలకు ఆటంకం కలుగుతోంది. ఎయిర్‌పోర్టులకు బయల్దేరేముందు మీ విమాన స్టేటస్‌ను చెక్‌ చేసుకోండి’’ అని ఇండిగో వెల్లడించింది. అటు విస్తారా, స్పైస్‌జెట్‌ కూడా ఇలాంటి సూచనలు చేశాయి. మే 5 వరకు విమానాలు ఆలస్యం లేదా రద్దయ్యే అవకాశముందని, ఎప్పటికప్పుడు అప్‌డేట్‌లను అందిస్తామని పేర్కొన్నాయి.

ఏప్రిల్‌ 14-15 తేదీల్లో యూఈఏని భారీ వర్షాలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దుబాయ్‌ నగరంలో ఏడాదిన్నరలో నమోదయ్యే వర్షపాతం.. కొన్ని గంటల్లోనే కురిసింది. 1949 తర్వాత గత నెలలోనే ఇక్కడ రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే, అప్పటితో పోలిస్తే తాజా వర్షాల ప్రభావం తక్కువే అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని