Joe Biden: ఐస్‌క్రీమ్‌ ప్రదేశాల గురించి నన్ను అడగండి..: బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden)కు ఐస్‌ క్రీమ్‌ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మరోసారి ఆయన ఐస్‌క్రీమ్‌పై తన ఇష్టాన్ని చాటుకొన్నారు. 

Updated : 17 Aug 2023 12:51 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden)కు ఐస్‌క్రీమ్‌ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఆయన హిమక్రీముపై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టుకొన్నారు. బుధవారం శ్వేతసౌధంలో జరిగిన ద్రవ్యోల్బణం తగ్గింపు చట్టం (IRA) తొలి వార్షికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. ‘నేను పిల్లలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వైట్‌హౌస్‌ సమీపంలోని అద్భుతమైన ఐస్‌క్రీమ్‌ దుకాణాలు నాకు తెలుసు. మీలో ఎవరికైనా కావాలంటే నాతో మాట్లాడండి. నేను మీకు సాయం చేస్తాను’ అని సరదాగా వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఐస్‌క్రీమ్‌ ప్రియుడు. ఆయన గతేడాది మిడ్‌టర్మ్‌ ఎన్నికల ప్రచార సమయంలో కూడా ఐస్‌క్రీం ఆరగిస్తూ దర్శనమిచ్చారు. జోబైడెన్‌ కోసమే ఓ ఐస్‌క్రీం దుకాణంలో ప్రత్యేకమైన ఫ్లేవర్‌ను తయారు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. 

త్వరలో హవాయికి వెళ్తా : బైడెన్‌

అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వచ్చే వారం హవాయిలోని కార్చిచ్చు కబళించిన ప్రదేశాలకు వెళ్లనున్నారని బుధవారం శ్వేతసౌధం ప్రకటించింది. శతాబ్దాల చరిత్ర కలిగిన అమెరికా (USA)లోని హవాయి (Hawaii) దీవుల్లో స్వర్గధామంగా పిలిచే లహైనా రిసార్టు నగరం కార్చిచ్చు కారణంగా బూడిద గుట్టగా మారిపోయింది. ఈ ప్రకృతి విపత్తు ఇప్పటి వరకు 100 మందికిపైగా బలి తీసుకుంది. ఈ విపత్తుపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ (Joe Biden) స్పందించారు. త్వరలోనే తన భార్య జిల్‌ బైడెన్‌ (Jill Biden)తో కలిసి అక్కడికి వెళతానన్నారు. ఆయన ఈ పర్యటనలో బాధితులు, సహాయ సిబ్బందిని కలవనున్నట్లు వైట్ హౌస్‌ బుధవారం తెలిపింది.

దీనిపై జోబైడెన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది చాలా బాధాకరమైన విపత్తు. అక్కడ సాధారణ పరిస్థితి తీసుకురావడం కష్టం. హవాయి ప్రజలకు అవసరమైన సాయం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభుత్వం నుంచి అత్యవసర సాయం పంపుతున్నాం’ అని ఆయన తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని