Viral Video: హెలికాప్టర్‌ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. వీడియో వైరల్‌

సామాజిక మాధ్యమాల్లో పాపులారిటీ కోసం ఓ ఇన్‌ఫ్లూయెన్సర్‌ ఏకంగా లక్ష డాలర్లు నగదును హెలికాఫ్టర్‌ నుంచి జారవిడిచాడు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఫ్టస్‌ రియల్‌ మనీ రెయిన్‌’ పేరుతో ఇన్‌స్టాలో షేర్ చేశాడు. 

Published : 26 Oct 2023 16:32 IST

ప్రాగ్‌: పాపులారిటీ కోసం ఇటీవలి కాలంలో చాలా మంది వింత చర్యలకు పాల్పడుతూ.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. కొద్ది నెలల క్రితం హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ వ్యక్తి కారు డిక్కీలో కూర్చుని రోడ్లపై కరెన్సీ నోట్లు విరజిమ్మిన ఘటన కలకలం రేపింది. తాజాగా చెక్‌ రిపబ్లిక్‌ (Czech Republic)కు చెందిన ఓ టీవీ వ్యాఖ్యాత, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కూడా ఇదే తరహాలో కరెన్సీ నోట్లను హెలికాప్టర్‌ నుంచి జారవిడిచాడు. కామిల్‌ బర్తోషెక్‌ అనే ఇన్‌ఫ్లూయెన్సర్‌ ‘వన్‌మాన్‌షో: ది మూవీ’ అనే సినిమాలో నటించాడు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. యూజర్ల కోసం ఓ కాంటెస్ట్‌ నిర్వహించాడు. వన్‌మాన్‌షో సినిమా చూసి అందులో ఉన్న పజిల్‌ను పరిష్కరించిన మొదటి వ్యక్తికి లక్ష డాలర్లు  నగదు బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. 

ఇందుకోసం యూజర్లు తమ పేర్లను ప్రత్యేక వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించాడు. కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు చాలా మంది రిజిస్టర్‌ చేసుకున్నప్పటికీ.. ఒక్కరు కూడా పజిల్‌ను పరిష్కరించలేకపోయారు. దీంతో బహుమతిగా ఇవ్వాలనుకున్న నగదు మొత్తాన్ని రిజిస్టర్‌ చేసుకున్న యూజర్లకు ఇవ్వాలనుకున్నాడు. ఇందుకోసం యూజర్లకు సీక్రెట్‌ కోడ్‌తో మెయిల్‌ పంపాడు. అందులో హెలికాఫ్టర్‌ నుంచి నగదు జారవిడిచే ప్రాంతం వివరాలు పొందుపరిచాడు. కామిల్‌ పంపిన మెయిల్‌లో ఉన్న కోడ్‌ను ఛేదించిన యూజర్లు నగదు జారవిడిచే ప్రాంతానికి చేరుకున్నారు. 

మెయిల్‌లో చెప్పినట్లుగానే కామిల్‌ ఆదివారం ఉదయం ఆరు గంటలకు నింబుర్క్‌ జిల్లా లైసా నాడ్‌ లాబెమ్‌ అనే నగరంలోని ఓ ఖాళీ ప్రదేశంలో నగదు జారవిడిచాడు. దీనికి సంబంధించిన వీడియోను ‘ఫస్ట్‌ రియల్‌ మనీ రెయిన్‌’ పేరుతో తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేశాడు. ఒక పెద్ద కంటెయినర్‌లో డబ్బు ఉంచి.. హెలికాప్టర్‌ సాయంతో దాన్ని గాల్లోకి తీసుకెళ్లి ఖాళీ ప్రదేశంలో లక్ష డాలర్ల నగదు జారవిడిచాడు. కంటెయినర్‌ నుంచి నగదు కింద పడుతుంటే కింద ఉన్న వారు బ్యాగుల్లో నగదు వేసుకుంటూ కనిపించారు. సుమారు నాలుగు వేల మంది యూజర్లు ఈ నగదు సేకరించారని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని కామిల్‌ తెలిపాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని