China: పెళ్లిపై ఆసక్తి చూపని చైనా యువత.. కారణాలివే!

గృహ హింసపై చైనా యువత ఆందోళన చెందుతోంది. దీంతో పెళ్లి చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. 

Updated : 03 Jul 2023 15:13 IST

బీజింగ్‌: గృహ హింస (Domestic violence)పై చైనా యువత (China youth) ఆందోళన చెందుతోంది. ఈ మధ్య కాలంలో  దేశంలో గృహిణులపై జరుగుతున్న హత్యలు, భౌతిక దాడుల వల్ల వివాహ బంధంపై అనుమానం వ్యక్తం చేస్తోంది అక్కడి యువత. దీంతో పెళ్లి (Marriage) చేసుకునేందుకు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.

ఇటీవల కాలంలో చైనాలోని షాన్‌డాగ్‌ (Shandong) తూర్పు ప్రావిన్స్‌లో ఓ వ్యక్తి తన భార్యను అతి కిరాతంగా హత్య చేశాడు. ఆమెపై పదేపదే కారును ఎక్కించి ప్రాణాలు తీశాడు. కుటుంబ కలహాల కారణంగానే భర్త హత్య చేశాడని పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. దీనిని ఇప్పటి వరకు 300 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. గతంలోనూ ఇటువంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. గ్వాంగ్‌డాంగ్ (Guangdong) లోని దక్షిణ ప్రావిన్స్‌లో ఒక మహిళ చాలా ఏళ్లు గృహ హింస అనుభవించింది. చివరకు భర్త చేతిలో ప్రాణాలు కోల్పోయింది. ఆ వ్యక్తి భార్యతో పాటు కోడలును కూడా కత్తితో పొడిచి చంపేశాడు. చెంగ్డూలోని ఒక నగరంలో భర్త పెడుతున్న ఇబ్బందులను ఓ మహిళ సోషల్ మీడియాలో పంచుకుంది. రెండేళ్లలో ఆమెపై భర్త 16 సార్లు హత్యాయత్నం చేశాడని.. దాంతో వేధింపులు తాళలేక విడాకులు తీసుకున్నట్లు పేర్కొంది. ఈ పరిణామాల దృష్ట్యా యువత పెళ్లిపై ఆసక్తి చూపకపోవడం ఒక కారణమని స్థానిక మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.

ఇదిలా ఉండగా.. జనాభా రేటు తగ్గుదలతో  చైనా ఆందోళన చెందుతోంది. చైనా పౌర సంబంధాల వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2021తో పోలిస్తే.. 2022లో వివాహం చేసుకునే వారి సంఖ్య 10.5 శాతం తగ్గిపోయిందని వెల్లడించింది. దీంతో చైనా.. పెళ్లిళ్లు చేసుకునేవారికి, పిల్లలు కనేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలను కూడా ప్రకటించింది. జనాభా వృద్ధి రేటును పెంచేందుకు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా యువత మాత్రం విహహం చేసుకునేందుకు విముఖత చూపుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని