Mud Floods: పట్టణాన్ని ముంచెత్తిన బురద..! పరుగులు తీసిన జనం

ఇటలీని బార్డోనెషియా పట్టణాన్ని బురద ప్రవాహం ముంచెత్తింది. దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి.

Published : 17 Aug 2023 15:32 IST

రోమ్‌: ప్రకృతి విపత్తులతో ప్రపంచ దేశాలు అల్లాడుతున్నాయి. అటు అమెరికాలోని హవాయి దీవులు, కెనడాల్లో కార్చిచ్చు.. ఇటు చైనా, జర్మనీల్లో భారీ వర్షాలు.. ఇలా విపత్కర వాతావరణ పరిస్థితుల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ఇటలీ (Italy)లోనూ ఆకస్మిక వరదలు (Flash Floods) ఊహించని నష్టాన్ని మిగిల్చాయి. స్థానికంగా ఓ పట్టణంలో ఎటు చూసినా బురద మేటలే (Mud) దర్శనమిచ్చాయి! వీధుల్లో బురద ప్రవాహం, వరదలకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ఇటలీలో భారీ వర్షాలు కురవడంతో.. మెర్డోవిన్‌ నది ఉప్పొంగి ప్రవహించింది. దీనికి తోడు సమీప పర్వత ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో తీరప్రాంత పట్టణమైన బార్డోనెషియాలో ఒక్కసారిగా మెరుపు వరద ప్రవేశించింది. ఒక్కసారిగా పెద్దఎత్తున బురద ప్రవాహం వీధులను ముంచెత్తింది. దీంతో అప్రమత్తమైన పౌరులు రోడ్ల వెంబడి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

ఎయిర్‌పోర్టులోకి వరద.. మోకాలిలోతు నీటిలో విమానాలు

వరదల ధాటికి పట్టణంలో చెట్లు కూలిపోవడంతోపాటు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు, కార్యాలయాలు చెత్తాచెదారం, బురదతో నిండిపోయాయి. వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగి విపత్తులో చిక్కుకుపోయిన పౌరులను కాపాడారు. అయితే, మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు స్థానిక గవర్నర్‌ వెల్లడించారు. ప్రాణనష్టాన్ని నివారించినట్లు చెప్పారు. మరోవైపు.. పట్టణ మున్సిపల్‌ సిబ్బంది బురదను తొలగించే పనిలో నిమగ్నమైనట్లు వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని