శరణార్థి శిబిరంపై దాడులేంటి?

శరణార్థుల శిబిరంపై, అంబులెన్సుల వాహన శ్రేణిపై ఇజ్రాయెల్‌ దాడులు చేయడాన్ని అమెరికా ప్రశ్నించింది. దీనివెనుక ఆలోచన ఏమిటో వివరణ ఇవ్వాలంది.

Published : 05 Nov 2023 04:51 IST

ఇజ్రాయెల్‌ను ప్రశ్నించిన అమెరికా
అరబ్‌ దేశాల విదేశాంగ మంత్రులతో బ్లింకెన్‌ భేటీ

టెల్‌అవీవ్‌: శరణార్థుల శిబిరంపై, అంబులెన్సుల వాహన శ్రేణిపై ఇజ్రాయెల్‌ దాడులు చేయడాన్ని అమెరికా ప్రశ్నించింది. దీనివెనుక ఆలోచన ఏమిటో వివరణ ఇవ్వాలంది. సాధారణ పౌరుల ప్రాణాలకు నష్టం వాటిల్లని రీతిలో తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. అంతర్జాతీయ సమాజం నుంచి వస్తోన్న వ్యతిరేకతనూ లెక్కచేయకుండా ఇజ్రాయెల్‌ చేస్తోన్న దాడులపై అమెరికా ఆగ్రహంగా ఉంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ శనివారం జోర్డాన్‌లో అరబ్‌ దేశాల విదేశాంగ మంత్రులతో సమావేశమయ్యారు. ఇజ్రాయెల్‌ నుంచి సానుకూల స్పందన లేని నేపథ్యంలో యుద్ధానికి ఎలా తెరదించాలనే అంశంపై చర్చలు జరిపారు. యుద్ధానికి అడ్డుకట్ట వేసేందుకు తక్షణం తగిన చర్య చేపట్టాలని జోర్డాన్‌ ఈ సందర్భంగా కోరింది. పరిస్థితిని మెరుగుపరిచే చర్యల్ని చేపట్టకపోతే విధ్వంసకర పరిణామాలు తప్పవని బ్లింకెన్‌ హెచ్చరించారు. సైనిక కార్యకలాపాలను ఇజ్రాయెల్‌ నిలిపివేయాలని పిలుపునిచ్చారు. ‘పిల్లల ముందే తండ్రిని చంపేయడం వంటి క్రూర ఘటనలు దిగ్భ్రాంతికరం. గాజాలో పాలస్తీనా పిల్లల మృతదేహాల చిత్రాలు చూసినప్పుడు వారిలో నాకు మా పిల్లలు కనిపించారు. హృదయం ద్రవించిపోయింది’ అని పేర్కొన్నారు. ఆదివారం ఆయన తుర్కియే వెళ్తారు.


బంకర్లలో దాక్కొంటున్న నస్రల్లా: ఇజ్రాయెల్‌

జెరూసలెం: హెజ్‌బొల్లా అధినేత హసన్‌ నస్రల్లా మాటలు విసుగుపుట్టించేలా ఉన్నాయని ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఎద్దేవా చేసింది. ఆయన బంకర్లలో దాక్కుంటున్నాడని చురకలు అంటించింది. ఇజ్రాయెల్‌-హమాస్‌ ఘర్షణలో తలదూరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని అమెరికా చేస్తున్న హెచ్చరికలను తాము పట్టించుకోబోమంటూ నస్రల్లా తెగేసి చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి ఇజ్రాయెల్‌ బదులిచ్చింది. కేవలం సరిహద్దు దాడులకే తాము పరిమితం కాబోమని, దేనికైనా సిద్ధమని నస్రల్లా.. అమెరికాను హెచ్చరించారు. అమెరికా తలచుకుంటే గాజాపై ఇజ్రాయెల్‌ దాడుల్ని అడ్డుకోగలదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.


సరిపడా ఆయుధాలున్నాయ్‌.. ఎన్ని నెలలైనా పోరాడుతాం

గాజాపై ఇజ్రాయెల్‌ కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేలా తాము ఒత్తిడి తీసుకురాగలమని హమాస్‌ పేర్కొంది. సరిపడా ఆయుధాలు తమవద్ద ఉన్నాయని, ఎన్ని నెలలైనా యుద్ధం చేస్తామని స్పష్టంచేసింది. ‘‘మా వద్ద ఆయుధాలు, క్షిపణులు, ఆహారం, ఔషధ నిల్వలు ఉన్నాయి. గాజా సిటీ భూగర్భ ప్రాంతాల్లో మేం కొన్ని నెలలపాటు ఉండగలం’’ అని హమాస్‌ నేతలు చెబుతున్నారు. హమాస్‌ వద్ద 40వేల మంది ఫైటర్లు ఉన్నట్లు కొన్ని కథనాలు వెల్లడించాయి. వీరంతా గాజాలో 80 మీటర్ల లోతు సొరంగాల్లో ఉన్నారని తెలుస్తోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని