అర్జెంటీనా నూతనాధ్యక్షుడిగా జేవియర్‌ మిలి

అర్జెంటీనాలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాకర్షక నేత జేవియర్‌ మిలి ఘనవిజయం సాధించారు. మొత్తం 99.4 శాతం ఓట్లు పోలవ్వగా మిలి 55.7 శాతం ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, ఆర్థికమంత్రి సెర్గియో మాసా 44.3 శాతం ఓట్లు పొందారు.

Published : 21 Nov 2023 05:12 IST

55.7 శాతం ఓట్లు సొంతం
40 ఏళ్ల తరువాత అత్యంత భారీ మెజారిటీ ఇదే

బ్యూనస్‌ ఎయిర్స్‌, దిల్లీ: అర్జెంటీనాలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ప్రజాకర్షక నేత జేవియర్‌ మిలి ఘనవిజయం సాధించారు. మొత్తం 99.4 శాతం ఓట్లు పోలవ్వగా మిలి 55.7 శాతం ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, ఆర్థికమంత్రి సెర్గియో మాసా 44.3 శాతం ఓట్లు పొందారు. ఈ మేరకు అర్జెంటీనా ఎన్నికల సంఘం తెలిపింది. 1983 తరువాత ఇంత భారీ మెజారిటీతో అధ్యక్ష అభ్యర్థి గెలుపొందడం ఇదే తొలిసారి. తాను అధికారంలోకి వస్తే దేశంలో సమూల మార్పులు తీసుకొస్తానని, ఎగబాకుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేస్తానని మిలి ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రజలు విశ్వసించడంతో ఆయన తిరుగులేని విజయం పొందారు.

ఫలితాల అనంతరం బ్యూనస్‌ ఎయిర్స్‌లో వాహనచోదకులు హారన్‌లు మోగించి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. మరికొందరు జాతీయ పతాకాలు, పసుపురంగు గాడ్స్‌డెన్‌ జెండాలను చేతబూని పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి సంబరాలు చేసుకున్నారు.

అర్జెంటీనా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జేవియర్‌ మిలికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్‌-అర్జెంటీనాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఆయనతో కలిసి పనిచేసేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తన అభినందన సందేశంలో మోదీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని