ట్రంప్‌ అనర్హత కేసుపై సత్వరమే విచారణ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అర్హులో కాదో సత్వరమే తేల్చాల్సిన అవసరం ఉందని ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Published : 07 Jan 2024 05:03 IST

అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వెల్లడి
ఫిబ్రవరి ఆరంభంలో వాదనలు మొదలు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అర్హులో కాదో సత్వరమే తేల్చాల్సిన అవసరం ఉందని ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా అధ్యక్ష ఎన్నికల ప్రాథమిక ప్రక్రియ ప్రారంభం కానున్నందున...బ్యాలట్‌ పత్రాల్లో ట్రంప్‌ పేరు ఉంటుందా లేదా అనే విషయమై ఓటర్లకు స్పష్టతనివ్వాల్సి ఉంటుందని న్యాయమూర్తులు తెలిపారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్‌ అనర్హుడంటూ ఇటీవల కొలరాడో రాష్ట్ర సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపేందుకు అమెరికా సుప్రీంకోర్టు అంగీకరించింది. ఫిబ్రవరి ఆరంభం నుంచి ఇరుపక్షాల వాదనలను వింటామని శుక్రవారం వెల్లడించింది. తనకు వ్యతిరేకంగా వచ్చిన 2020 ఎన్నికల ఫలితాలను మార్చివేసే ప్రయత్నాల్లో భాగంగా అప్పటి అధ్యక్షుడు ట్రంప్‌...ప్రజలను తిరుగుబాటుకు పురిగొల్పారని ఇటీవల కొలరాడో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అటువంటి వ్యక్తి అధికారిక పదవులు చేపట్టడానికి అనర్హుడంటూ అమెరికా రాజ్యాంగ సవరణ 14లోని నిబంధనలను కోర్టు ఉటంకించింది. రిపబ్లికన్‌ పార్టీ ప్రైమరీ బ్యాలట్‌ పోరు నుంచి ట్రంప్‌ పేరును తొలగించాలని ఆదేశించింది. ఈ తీర్పు ఆధారంగా మైన్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి షెన్నా బెలోస్‌ కూడా ప్రైమరీ బ్యాలట్‌లో ట్రంప్‌ పేరును చేర్చబోమని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉండడంతో ట్రంప్‌ మద్దతుదారులు కొలరాడో సుప్రీంకోర్టు తీర్పును ఫెడరల్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు.

అమెరికా సుప్రీంకోర్టులో మొత్తం తొమ్మిది మంది న్యాయమూర్తులు ఉండగా...వీరిలో ముగ్గురు ట్రంప్‌ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నియమితులైన వారే. అయినప్పటికీ 2020 ఎన్నికలకు సంబంధించిన వివాదాలు, యూఎస్‌ క్యాపిటల్‌ భవనంపై దాడి, ఆదాయపు పన్ను మదింపు కేసుల్లో ఆ న్యాయమూర్తులు... ట్రంప్‌నకు వ్యతిరేకంగానే తీర్పులను వెలువరించారు. అదే సమయంలో గర్భవిచ్ఛితి, తుపాకీ హక్కులు తదితర అంశాల్లో రిపబ్లికన్‌ పార్టీ వైఖరికి అనుగుణంగానే వారు తీర్పులిచ్చారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ క్లారెన్స్‌ థామస్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి వైదొలగాల్సిందిగా డెమోక్రటిక్‌ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. జస్టిస్‌ క్లారెన్స్‌ థామస్‌ భార్య...ట్రంప్‌ గట్టి మద్దతుదారుల్లో ఒకరు కావడమే కారణం. అయితే, డెమోక్రాట్ల ఒత్తిడికి జస్టిస్‌ థామస్‌ తలవంచకపోవచ్చని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని