అంతమెరుగని యుద్ధం!

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధానికి అంతముందా.. 1948లో ఇజ్రాయెల్‌ ఆవిర్భవించాక జరుగుతున్న ఈ అతి సుదీర్ఘ, ప్రాణాంతక యుద్ధం తర్వాత పరిస్థితులేమిటి.. అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ఆదివారంతో యుద్ధం 100 రోజులు పూర్తి చేసుకుంది.

Updated : 15 Jan 2024 04:55 IST

ముగిసినా ఇజ్రాయెల్‌, పాలస్తీనాలకు కష్టకాలమే
నాయకత్వంపై యూదుల తీవ్ర అసంతృప్తి
గాజాలో ప్రజల నివాసమూ అసాధ్యమే..
పశ్చిమాసియాలో రగులుతున్న సెగలు
ఎవరికీ సర్దిచెప్పలేకపోతున్న ప్రపంచం
100 రోజుల యుద్ధంలో వేలమంది బలి

జెరూసలెం: ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధానికి అంతముందా.. 1948లో ఇజ్రాయెల్‌ ఆవిర్భవించాక జరుగుతున్న ఈ అతి సుదీర్ఘ, ప్రాణాంతక యుద్ధం తర్వాత పరిస్థితులేమిటి.. అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ఆదివారంతో యుద్ధం 100 రోజులు పూర్తి చేసుకుంది. కానీ ఈ యుద్ధానికి ముగింపు కనుచూపు మేరలో కనిపించడం లేదు. అక్టోబరు 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్‌ చరిత్రలో ఎన్నడూ లేనంతగా దాడి చేసింది. 1200 మంది ఇజ్రాయెలీలను హతమార్చింది. 250 మందిని అపహరించింది. ఆ తర్వాత వారిలో దాదాపు సగం మందిని విడిచిపెట్టింది. హమాస్‌ దాడి చేసిన రోజు నుంచి మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇజ్రాయెల్‌ దాడులతో గాజాలో రోజూ పదుల సంఖ్యలో జనం మరణిస్తున్నారు. వందల మంది గాయపడుతున్నారు. దాదాపు 23,000 మంది పాలస్తీనీయులు మరణించారు. 60,000 మంది గాయపడ్డారు. అటు ఇజ్రాయెల్‌ సైన్యానికీ గతంలో ఎన్నడూ లేనంత ప్రాణ నష్టం జరుగుతోంది. 200 మంది వరకూ సైనికులు మృతి చెందారు.

హమాస్‌ అంతం అసాధ్యమా?

హమాస్‌ను పూర్తిగా అంతమొదించడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్‌ ప్రకటించి తొలుత వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడింది. తర్వాత భూతల పోరుకు తెరతీసింది. యుద్ధంతో గాజా విధ్వంసమైంది. భవనాలన్నీ నేలమట్టమయ్యాయి. కానీ హమాస్‌ను ఓడించింది లేదు. ఇంకా 100 మందిదాకా ఇజ్రాయెల్‌ బందీలు మిలిటెంట్ల చెరలోనే ఉన్నారు. వారు స్థావరాలను మారుస్తూ ఇజ్రాయెల్‌కు చిక్కడం లేదు. దీనిని బట్టి 2024 ఏడాదంతా యుద్ధం కొనసాగే అవకాశమే కనిపిస్తోంది.

ఇజ్రాయెల్‌ మునుపటిలా లేదు

ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7వ తేదీన హమాస్‌ జరిపిన దాడితో అక్కడి నేతలపై ప్రజల నమ్మకం ముక్కలైంది. సైన్యం చేపట్టిన చర్యలకు మద్దతుగా జనం ర్యాలీలు చేస్తున్నా వారంతా భయబ్రాంతుల్లోనే ఉన్నారు. అక్టోబరు 7 నాటి ఘటనలు వారిలో ప్రతి రోజూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. బందీలను విడిపించాలని ఇజ్రాయెల్‌ అంతటా వీధుల్లో పోస్టర్లు కనిపిస్తున్నాయి. చాలా మంది బందీల ఫొటోలతో ఉన్న టీషర్టులు ధరించి తిరుగుతున్నారు. బందీలను వెనక్కి తీసుకురావాలని వారంతా నేతలను డిమాండు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌ న్యూస్‌ ఛానళ్లు 24 గంటలూ యుద్ధ వార్తలే ప్రసారం చేస్తున్నాయి. అక్టోబరు 7 నాటి విషాదకర ఘట్టాలను, ఇజ్రాయెల్‌ సైనికుల వీరోచిత గాథలను చూపుతున్నాయి. బందీలు, వారి కుటుంబ సభ్యుల ఆవేదనను కళ్లకు కడుతున్నాయి. సైనికుల అంత్యక్రియల దృశ్యాలను ప్రసారం చేస్తున్నాయి. గాజాలో వేల మంది మరణాలపైనా, విధ్వంసంపైనా ఇజ్రాయెల్‌లోనూ రవ్వంత సానుభూతీ ఉంది. యుద్ధం తర్వాత గాజా పరిస్థితిపై ఆందోళనా ఉంది. యుద్ధం తర్వాత వైదొలుగుతామని చాలా మంది సైనికాధికారులు అంటున్నారు. హమాస్‌ దాడిని అడ్డుకోవడంలో విఫలమైనందుకే వారు క్షమాపణలూ చెబుతున్నారు. అయితే ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు మాత్రం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ప్రజల్లో ఆయనకు ఆదరణ భారీగా తగ్గుతున్నప్పటికీ క్షమాపణ చెప్పడానికీ, పదవి నుంచి దిగిపోవడానికీ ఆయన నిరాకరిస్తున్నారు. 15 ఏళ్లుగా ఇజ్రాయెల్‌ను పాలిస్తున్న ఆయన యుద్ధం తర్వాత విచారణ జరిపిస్తామని చెబుతున్నారు. ఈ యుద్ధం ఇజ్రాయెల్‌ను చాలా ఏళ్లపాటు దెబ్బతీయడం ఖాయమని చరిత్రకారుడు టామ్‌ సెగెవ్‌ వ్యాఖ్యానించారు. అక్టోబరు 7న జరిగిన దాడి, బందీలను విడిపించలేకపోవడం ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా చేస్తోందని అభిప్రాయపడ్డారు.

గాజాకు మరింత కష్టకాలం

అక్టోబరు 7 కంటే ముందు కూడా గాజా పరిస్థితి దారుణంగానే ఉంది. ఇజ్రాయెల్‌, ఈజిప్టు ఆంక్షల ఫలితంగా అది గుర్తింపులేనిదిగా మారింది. ప్రస్తుత యుద్ధం కారణంగా గాజాలోని 1 శాతం ప్రజలు ఇజ్రాయెల్‌ దాడుల్లో మరణించారు. 80శాతం మంది నిరాశ్రయులయ్యారు. లక్షల మంది టెంట్లలోనే జీవనం సాగిస్తున్నారు. శాటిలైట్‌ చిత్రాలనుబట్టి చూస్తే గాజాలోని 50శాతం భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాజాలోని మొత్తం 23 లక్షల మందిలో నాలుగో వంతు మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 36 ఆసుపత్రుల్లో 15 మాత్రమే పాక్షికంగా పని చేస్తున్నాయి. పిల్లలు పాఠశాలలకు నెలలుగా దూరమయ్యారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం గాజా నివాసానికి అనుకూలంగా లేదనే చెప్పాలి.

పశ్చిమాసియా మొత్తానికీ..

ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం పశ్చిమాసియా మొత్తానికీ క్రమంగా అంటుకుంటోంది. అమెరికా కూటమికి, ఇరాన్‌ మద్దతిచ్చే మిలిటెంట్‌ గ్రూపులకు మధ్య పోరాటంగా మారుతోంది. యుద్ధం ప్రారంభం కాగానే ఇరాన్‌ మద్దతిచ్చే హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌పై దాడులను ప్రారంభించింది. ప్రతిగా లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ దాడులకు దిగింది. ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్‌, హెజ్‌బొల్లా మధ్య పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభం కాలేదు. కానీ అది ఏ క్షణమైనా విస్తరించే ప్రమాదముంది. హౌతీ రెబల్స్‌ యెమెన్‌ నుంచి సరకు రవాణా నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇరాక్‌, సిరియాల్లోనూ ఇరాన్‌ మద్దతున్న మిలిటెంట్‌ గ్రూపులు అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నాయి. అమెరికా, బ్రిటన్‌ దళాలు హౌతీలపై దాడులు చేశాయి.

పాలస్తీనీయులను ఇజ్రాయెల్‌ విస్మరించజాలదు

పాలస్తీనాతో శాంతి అంశాన్ని తన పదవీకాలంలో నెతన్యాహు ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పాలస్తీనాను ఆయన అంగీకరించలేదు. వెస్ట్‌బ్యాంకు, గాజా పాలకుల మధ్య విభేదాలను ప్రోత్సహించడానికే ఆయన ప్రాధాన్యమిచ్చారు. అంతే కాదు.. పాలస్తీనాను ఏకాకిని చేయడానికి ఇతర అరబ్‌ దేశాలతో సత్సంబంధాల కోసం ప్రయత్నించారు. పాలస్తీనా స్వాతంత్రానికి అడ్డు తగిలారు. అక్టోబరు 7కు ముందు కూడా ఆయన సౌదీ అరేబియాతో బంధానికి ప్రయత్నించారు. హమాస్‌ దాడి, వెస్ట్‌బ్యాంకులో ఘర్షణలు మళ్లీ ఇజ్రాయెల్‌, పాలస్తీనా అంశాన్ని తెరపైకి తెచ్చాయి. ఇప్పుడు ప్రపంచమంతా అదే పెద్ద వార్తయింది. అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ నాలుగుసార్లు పశ్చిమాసియాలో పర్యటించారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సౌదీ అరేబియా కూడా పాలస్తీనాకు దేశం హోదా ఇస్తేనే ఇజ్రాయెల్‌తో సంబంధాలను నెరపుతామని మెలిక పెట్టింది. ఇవన్నీ పాలస్తీనా అంశాన్ని, అక్కడి ప్రజలను విస్మరించడానికి వీల్లేని విధంగా మార్చేశాయి.


యుద్ధానంతర ప్రణాళికేదీ లేదు!

రోజురోజుకూ యుద్ధం విస్తరిస్తుందే తప్ప అంతం కనిపించడం లేదు. మరణాలూ భారీగా పెరుగుతున్నాయి. ఆ తర్వాత ఏంటనేదీ ప్రపంచానికి అర్థం కావడం లేదు. గాజాలో హమాస్‌కు పాత్ర లేదని ఇజ్రాయెల్‌ అంటోంది. కానీ అది ఊహాజనితమేనని, తాము లేకుండా గాజా ఎలా ఉంటుందని స్పష్టంచేస్తోంది. అమెరికాతోపాటు అంతర్జాతీయ సమాజం రెండు దేశాల సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాయి. గాజానూ పాలస్తీనా అథారిటీ పాలించేలా చేయాలనుకుంటోంది. కానీ పాలస్తీనాకు గుర్తింపు ఇచ్చేందుకు ఇజ్రాయెల్‌ ససేమిరా అంటోంది. గాజాలో సుదీర్ఘకాలం సైన్యాన్ని మోహరించాలని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. అమెరికాకు అది ఇష్టం లేదు. ఇక గాజా పునర్నిర్మాణానికి ఏళ్లు పట్టడం ఖాయం. దీనికి ఎవరు సహాయం చేస్తారనేది తెలియదు. అసలు గాజాలోకి రవాణా ఎలా అనేది మరింత చిక్కు ప్రశ్న. ఇళ్లన్నీ ధ్వంసం కావడంతో ప్రజలకు మళ్లీ ఎప్పుడు అవి దక్కుతాయో తెలియదు. సరిగ్గా 100 రోజుల క్రితం వారికి ఇళ్లు, కార్లు ఉన్నాయి. ఇప్పుడు అవేమీ లేవు. వారంతా టెంట్లలో నివశిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని