హమాస్‌పై యుద్ధంలో ఇజ్రాయెల్‌ ఉన్నతాధికారుల్లో విభేదాలు!

గాజాలోని హమాస్‌ మిలిటెంట్లపై యుద్ధం వంద రోజులు దాటిపోయినా బందీలుగా ఉన్న తమ దేశీయులను విడిపించుకోవడంలో సఫలం కాలేకపోవడంపై ఇజ్రాయెల్‌ ఉన్నతాధికారుల్లో అంతర్మథనం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Updated : 20 Jan 2024 06:41 IST

కాల్పుల విరమణ ఒప్పందం వైపు కొందరి మొగ్గు

జెరూసలేం: గాజాలోని హమాస్‌ మిలిటెంట్లపై యుద్ధం వంద రోజులు దాటిపోయినా బందీలుగా ఉన్న తమ దేశీయులను విడిపించుకోవడంలో సఫలం కాలేకపోవడంపై ఇజ్రాయెల్‌ ఉన్నతాధికారుల్లో అంతర్మథనం జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాము అనుసరిస్తున్న వ్యూహాలు సరైనవేనా అనే సందేహాలూ వారిలో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలంటూ తాము చేసిన సూచనను ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ తిరస్కరించడంపై మిత్ర దేశం అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.  హమాస్‌ మిలిటెంట్లతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం ద్వారానే వారి వద్ద బందీలుగా ఉన్న తమ పౌరులను విడిపించుకోగలమని ఇజ్రాయెల్‌ మాజీ సైనికాధిపతి గాడి ఐసెన్‌కోట్‌ అభిప్రాయపడ్డారు. ఇతరత్రా ఏ పద్ధతిలోనైనా బందీలను విడిపించుకోగలమని చెప్పడం భ్రమలు కల్పించడమేనని స్పష్టం చేశారు.

ఇజ్రాయెల్‌ వార్‌ కేబినెట్‌లోని నలుగురు సభ్యుల్లో ఒకరైన ఐసెన్‌కోట్‌ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటువంటి బహిరంగ ప్రకటన చేయడం ఇదే తొలిసారి. అక్టోబర్‌ 7న హమాస్‌ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృతి చెందారు. మరో 250 మందిని బందీలుగా మిలిటెంట్లు పట్టుకుపోయారు. వారిలో 130 మందికిపైగా ఇప్పటికీ హమాస్‌ చెరలోనే ఉన్నారని ఇజ్రాయెల్‌ అధికారులు చెబుతున్నారు. అయితే, వారంతా జీవించే ఉన్నారా అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. గాజా మొత్తం దాదాపు ధ్వంసమైంది. 25వేల మందికిపైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ ఇజ్రాయెల్‌ ఇంకా యుద్ధం కొనసాగించడంపై స్వదేశంలోని విపక్షంతో పాటు మిత్ర దేశమైన అమెరికా నుంచీ అసంతృప్తి వ్యక్తమవుతోంది. వార్‌ కేబినెట్‌లో కొనసాగడంలోని ఔచిత్యాన్ని తాను నిత్యం ప్రశ్నించుకుంటున్నానని ఐసెన్‌కోట్‌ తెలపడం గమనార్హం. తామింకా వ్యూహాత్మక విజయాలను సాధించలేదని, హమాస్‌ మిలిటెంట్లను పూర్తిగా నిర్మూలించలేదని ఆయన పేర్కొన్నారు.

స్వతంత్ర పాలస్తీనాకు నెతన్యాహూ నో

గాజాపై ఇజ్రాయెల్‌ దాడి తీవ్రతను తగ్గించి, యుద్ధానంతరం ప్రత్యేక పాలస్తీనా ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గురువారం సూచించినా, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు దాన్ని తిరస్కరించారు. దీంతో బైడెన్‌ సర్కారు నెతన్యాహు ప్రభుత్వాన్ని గట్టిగా మందలించింది. స్వతంత్ర పాలస్తీనా తమపై దాడులకు స్థావరంగా మారుతుందని నెతన్యాహు భావిస్తున్నారు. 

గాజాలో యూనివర్సిటీ భవనంపై దాడి.. ఇజ్రాయెల్‌ వివరణ కోరిన అమెరికా

రఫా: హమాస్‌ స్థావరాలను నాశనం చేయడమే లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ దళాలు దక్షిణ గాజాలోని అల్‌-ఇస్రా విశ్వవిద్యాలయ భవనంపై దాడి చేశాయి. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ దాడిపై ఇజ్రాయెల్‌ను అమెరికా వివరణ కోరినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, అమెరికా హోంశాఖ అధికార ప్రతినిధి డేవిడ్‌ మిల్లర్‌ దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. ఖాన్‌ యూనిస్‌ పట్టణంలో ఉన్న యూనివర్సిటీ భవనాన్ని హమాస్‌ మిలిటెంట్ల స్థావరంగా ఉపయోగిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ అనుమానిస్తోంది. అయితే, గతేడాది చివర్లో ఈ భవనాన్ని ఐడీఎఫ్‌ అధీనంలోకి తీసుకుని, కమాండ్‌ సెంటర్‌గా ఉపయోగించుకున్నట్లు పాలస్తీనా ఉన్నత విద్యావిభాగం ఆరోపించింది. ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో భవనం పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చినట్లు వెల్లడించింది.

రష్యా, చైనా నౌకలపై దాడులు చేయం: హౌతీ రెబల్స్‌

ఎర్ర సముద్రంలో ఉద్రిక్తతల వేళ హౌతీ రెబల్స్‌ కీలక ప్రకటన చేశారు. చైనా, రష్యా దేశాలకు చెందిన వాణిజ్య నౌకలపై దాడులు చేయబోమని, అవి సురక్షితంగా ప్రయాణించేందుకు సహకరిస్తామని వెల్లడించారు. ‘గాజాలో మారణహోమాన్ని ఆపేందుకు ఆర్థికంగా ఇజ్రాయెల్‌ను కుంగదీయడమే మా అంతిమ లక్ష్యం’ అని హౌతీ సీనియర్‌ నాయకుడు మహమ్మద్‌ అల్‌-బుఖైతీ వెల్లడించారు. ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీలు దాడులను నిలిపివేయకుంటే ప్రతీకార చర్యలు కొనసాగుతూనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టం చేశారు. అయితే, ఈ హెచ్చరికలను హౌతీ రెబెల్స్‌ నాయకుడు అబ్దెల్‌ మాలెక్‌ అల్‌-హౌతీ తోసిపుచ్చారు. ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ మీదుగా ప్రయాణించే నౌకలపై తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని ఓ వీడియో సందేశంలో ప్రకటించారు.


ఉద్రిక్తతల తగ్గింపునకు ఇరాన్‌, పాక్‌ నిర్ణయం

ఇస్లామాబాద్‌: ఇరు దేశాల భూభాగాల్లోని ఉగ్ర స్థావరాలపై పరస్పరం దాడులు చేసుకోవడంతో తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించుకొని, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోవాలని పాకిస్థాన్‌, ఇరాన్‌ శుక్రవారం నిర్ణయించాయి. ఉగ్రవాద నిరోధక చర్యల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు వివిధ అంశాలపై కలిసి పనిచేయాలనే అభిప్రాయానికి వచ్చాయి. ఈ మేరకు రెండు దేశాలు సంప్రదింపులను ప్రారంభించాయి. దీనికి సంబంధించి పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి జలీల్‌ అబ్బాస్‌, ఇరాన్‌ విదేశాంగ మంత్రి హుస్సేన్‌ ఆమిర్‌ అబ్దుల్లాహియాన్‌ టెలిఫోన్‌ ద్వారా తమ అభిప్రాయాలను పరస్పరం వ్యక్తం చేసుకున్నారని ఇస్లామాబాద్‌ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇరు దేశాలు తమ ప్రాదేశిక సమగ్రతలను, సార్వభౌమాధికారాలను గౌరవించుకోవడంతో పరస్పర విశ్వాసాన్ని, సహకార స్ఫూర్తిని పెంపొందించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని