ఇజ్రాయెల్‌కు భారీ షాక్‌

హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అతి పెద్ద దెబ్బ తగిలింది. మధ్య గాజాలో సోమవారం జరిగిన ఘటనలో ఒకేసారి 21 మంది సైనికులు చనిపోయారు.

Published : 24 Jan 2024 03:23 IST

మధ్యగాజాలో గ్రనేడ్‌తో దాడిచేసిన మిలిటెంట్లు
పేలుళ్లు జరిగి 21 మంది సైనికుల సజీవ సమాధి

జెరూసలెం: హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అతి పెద్ద దెబ్బ తగిలింది. మధ్య గాజాలో సోమవారం జరిగిన ఘటనలో ఒకేసారి 21 మంది సైనికులు చనిపోయారు. సరిహద్దుకు 600 మీటర్ల దూరంలోని కిస్సుఫింలో రెండు భవనాలను పేల్చేందుకు ఇజ్రాయెల్‌ సైనికులు పేలుడు పదార్థాలను అమర్చుతున్నారు. అదే సమయంలో సమీపంలోనే ఉన్న మిలిటెంట్లు యుద్ధ ట్యాంకుపైకి రాకెట్‌ ప్రొపెల్డ్‌ గ్రనేడ్‌ను (ఆర్‌పీజీ) ప్రయోగించారు. పక్కనే ఉన్న మందుగుండు సామగ్రి పేలి రెండు భవనాలు కుప్పకూలాయి. వాటి కింద 21 మంది సైనికులు సజీవ సమాధి అయ్యారు. యుద్ధం ప్రారంభమయ్యాక ఇజ్రాయెల్‌ సైనికులు అంత మంది ఒకేసారి మరణించడం ఇదే తొలిసారి. సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ దాడి జరిగిందని ఇజ్రాయెల్‌ రక్షణ దళాల (ఐడీఎఫ్‌) అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ మంగళవారం తెలిపారు. ఆ సమయంలో చాలా మంది సైనికులు అక్కడే ఉన్నారని చెప్పారు. రెండో ఆర్‌పీజీ భవనాలను తాకిందని వివరించారు. మృత దేహాలను వెలికితీయడానికి సైనిక దళాలు పని చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత దుర్ఘటనతో యుద్ధం నిలిపివేయాలంటూ బెంజమిన్‌ నెతన్యాహు ప్రభుత్వంపై బాధితుల కుటుంబాల నుంచి మరింత ఒత్తిడి పెరగనుందని తెలుస్తోంది.

తమ సైనిక సిబ్బంది మరణాలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నెతన్యాహు.. హమాస్‌పై సంపూర్ణ విజయం సాధించేవరకూ పోరాడతామని మరోసారి స్పష్టం చేశారు. బందీలను విడిపించుకుంటామని చెప్పారు. ఇది తమకు అత్యంత కఠిన సమయమని తెలిపారు.

గాజాలో 50 మంది మృతి

ఈ దాడికి కొన్ని గంటల ముందు గాజాలోని ఖాన్‌ యూనిస్‌లో ఇజ్రాయెల్‌ సైన్యం జరిపిన దాడిలో 50 మంది పాలస్తీనా వాసులు మృతి చెందారు. గాజాలో రెండో అతి పెద్ద నగరమైన ఖాన్‌ యూనిస్‌ను తమ బలగాలు చుట్టుముట్టినట్లు తాజాగా ఇజ్రాయెల్‌ ప్రకటించింది. కొంతకాలంగా ఖాన్‌ యూనిస్‌లో తీవ్ర పోరు కొనసాగుతోంది. హమాస్‌ అగ్ర నేతలు ఈ నగరం కింద సొరంగాల్లో దాక్కున్నట్లు ఇజ్రాయెల్‌ అధికారులు చెబుతున్నారు. పైగా ఇది హమాస్‌ అగ్ర నేత యాహ్యా సిన్వర్‌ స్వస్థలం. ప్రస్తుతం అతడి ఆచూకీ తెలియాల్సి ఉంది. గాజాలో సోమవారం ఇంటర్నెట్‌ వ్యవస్థ కుప్పకూలింది. ఇలా జరగడం ఇది పదోసారి.


రెండు నెలల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ అంగీకారం?

శాశ్వతంగా కావాలంటున్న హమాస్‌

జెరూసలెం: యుద్ధంలో రెండు నెలల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌ అంగీకరించిందని ఈజిప్టు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఈ కాలంలో బందీలను విడుదల చేసుకుందామని ఆ దేశం ప్రతిపాదించినట్లు వెల్లడించారు. టాప్‌ హమాస్‌ నాయకులూ గాజా విడిచి వెళ్లేందుకు అనుమతిస్తామని పేర్కొన్నట్లు వివరించారు. అయితే హమాస్‌ ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తోందని ఆ అధికారి తెలిపారు. శాశ్వత కాల్పుల విరమణను, గాజా నుంచి సైన్యాన్ని ఉపసంహరించాలని కోరుతోందని పేర్కొన్నారు.


హూతీలపై మరోసారి దాడులు

వాషింగ్టన్‌: యెమెన్‌లోని 8 హూతీ స్థావరాలపై సోమవారం రాత్రి అమెరికా, బ్రిటన్‌ సంయుక్త దళాలు బాంబు దాడులు చేశాయి. హూతీ క్షిపణుల గోదాములపై యుద్ధ నౌకలు, జలాంతర్గాములు తోమహాక్‌ క్షిపణులను ప్రయోగించాయని అధికారులు వెల్లడించారు. యుద్ధ విమానాలు, డ్రోన్లు, లాంచర్లతోనూ దాడులు చేశామని వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని