మళ్లీ బైడెన్‌-ట్రంప్‌ ఢీ

అగ్రరాజ్య అధ్యక్ష పీఠానికి ఇక సమరం మొదలైనట్లే. అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం జరిగిన ప్రైమరీల్లో విజయాలు సాధించి తమ పార్టీ నామినేషన్లకు అవసరమైన ప్రతినిధులను సొంతం చేసుకున్నారు.

Published : 14 Mar 2024 03:35 IST

ఖరారైన అమెరికాఅధ్యక్ష పోరు
పార్టీ నామినేషన్లు నెగ్గిన ఇరువురు నేతలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్య అధ్యక్ష పీఠానికి ఇక సమరం మొదలైనట్లే. అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మంగళవారం జరిగిన ప్రైమరీల్లో విజయాలు సాధించి తమ పార్టీ నామినేషన్లకు అవసరమైన ప్రతినిధులను సొంతం చేసుకున్నారు. నవంబరు ఐదున జరిగే 2024 అధ్యక్ష పోరులో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధమయ్యారు. 81 ఏళ్ల బైడెన్‌ జార్జియా ప్రెసిడెన్షియల్‌ ప్రైమరీలో విజయం సాధించి, డెమొక్రటిక్‌ పార్టీ అధికారిక నామినేషన్‌కు అవసరమైన 1968 మంది ప్రతినిధులను సొంతం చేసుకున్నారు. బైడెన్‌ అభ్యర్థిత్వాన్ని జులైలో జరిగే జాతీయ కన్వెన్షన్‌లో పార్టీ అధికారికంగా ప్రకటిస్తుంది. మంగళవారం జార్జియా, హవాయి, మిసిసిపీ, వాషింగ్టన్‌ రాష్ట్రాలకు, ఒక టెరిటరీకి ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. 77 ఏళ్ల ట్రంప్‌ కూడా వాషింగ్టన్‌లో నెగ్గి, రిపబ్లికన్‌ అభ్యర్థిత్వానికి అవసరమైన 1215 మంది ప్రతినిధుల మార్కును దాటారు. దీంతో వరుసగా మూడోసారి పార్టీ తరఫున అధ్యక్ష రేసులో నిలిచారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆగస్టులో జరిగే జాతీయ కన్వెన్షన్‌లో పార్టీ ఖరారు చేయనుంది. 1956 తర్వాత వరుసగా రెండు అధ్యక్ష ఎన్నికల్లో ఒకే ప్రత్యర్థుల మధ్య పోరు జరగడం ఇదే తొలిసారి. 1952లో ఐసెన్‌ హోవర్‌, స్టీవెన్సన్‌ మధ్య పోరు జరిగింది. హోవర్‌ నెగ్గారు. 1956లోనూ వీరిద్దరే తలపడ్డారు. అప్పుడు కూడా హోవర్‌నే అద్యక్ష పదవి వరించింది. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో బైడెన్‌, ట్రంప్‌నకు పెద్దగా ప్రతిఘటన ఎదురవ్వలేదు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా నిక్కీ హేలీ, రాన్‌ ది శాంటిస్‌ తదితరులు బరిలోకి దిగినా మధ్యలోనే వైదొలిగారు. బైడెన్‌కు కూడా నామమాత్ర పోటీ ఎదురైంది. వీరిద్దరూ అధ్యక్ష పోరులో నిలుస్తారన్నది అందరూ ఊహించిందే. అయితే దేశవ్యాప్తంగా పలు న్యాయస్థానాల్లో 91 నేరాభియోగాలను ఎదుర్కొంటూ ట్రంప్‌ బరిలోకి దిగుతున్నారు. గతంలో క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్న అభ్యర్థి ఎవరూ అధ్యక్ష బరిలో దిగలేదు. మెజారిటీ ప్రతినిధులను గెలవగానే బైడెన్‌ మాట్లాడుతూ.. మరోసారి తనపై విశ్వాసం ఉంచిన  ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌తో దేశ ప్రజాస్వామ్యానికి పెనుముప్పు ఉందని వ్యాఖ్యానించారు. ట్రంప్‌ కూడా బైడెన్‌పై ధ్వజమెత్తారు. అమెరికా చరిత్రలో అత్యంత చెత్త అధ్యక్షుడు బైడెన్‌ అని, ఆయన్ను ఓడించాలని మద్దతుదారులకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని