జీవ వైవిధ్యానికి గొడ్డలిపెట్టు కానున్న వాతావరణ మార్పులు

ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది.

Published : 28 Apr 2024 06:12 IST

దిల్లీ: ఈ శతాబ్దం మధ్యనాటికి జీవవైవిధ్యంలో క్షీణతకు వాతావరణ మార్పులే ప్రధాన కారణమవుతాయని తాజా అధ్యయనం పేర్కొంది. భూ వినియోగతీరులో మార్పులు, జీవవైవిధ్యంపై వాటి ప్రభావాలను విశ్లేషించిన అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం.. ప్రపంచవ్యాప్తంగా జీవవైవిధ్యం 2-11 శాతం మేర తగ్గి ఉండొచ్చని పేర్కొంది. తమ పరిశోధన కోసం అన్ని ప్రాంతాలనూ పరిగణనలోకి తీసుకున్నామని వారు తెలిపారు. ఇతర విధానాలపై వచ్చిన విమర్శలనూ విశ్లేషించామని చెప్పారు. భూ వినియోగ తీరు, వాతావరణ మార్పుల ఉమ్మడి ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అని ప్రాంతాల్లోనూ జీవ వైవిధ్యానికి నష్టం వాటిల్లుతుందని వివరించారు. ఆ ప్రాంతంలోని కర్బన ఉద్గారాలు ఏ స్థాయిలో ఉన్నాయన్నదానితో సంబంధం లేకుండా ఇది సాగుతుందని తెలిపారు. ‘‘భూ వినియోగ తీరులో మార్పుల వల్లే జీవ వైవిధ్యంలో క్షీణతకు ప్రధాన కారణమని గత అనుభవాలు చెబుతున్నాయి. అయితే ఈ శతాబ్దం మధ్య నాటికి వాతావరణ మార్పులే ఇందుకు ముఖ్య కారణమవుతాయని మా పరిశీలనలో వెల్లడైంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న డేవిడ్‌ లెక్‌లెరె చెప్పారు. రానున్న దశాబ్దాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే విధానాల్లో అన్ని అంశాలకూ ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని