గుండెజబ్బుల ముప్పును పెంచే వాహన ధ్వనులు

వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది.

Published : 29 Apr 2024 05:40 IST

దిల్లీ: వాహనాల రణగొణ ధ్వనులు గుండె జబ్బుల ముప్పును పెంచుతాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. ఇందులో గుండెపోటు ముప్పు కూడా ఉందని వెల్లడైంది. వ్యాధులకు సంబంధించిన డేటాను సమీక్షించిన పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రకం ధ్వని కాలుష్యాన్ని కూడా గుండెజబ్బుల ముప్పు అంశంగా పరిగణించి, నివారణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు కోరుతున్నారు. వీరి అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ..

  • ప్రతి 10 డెసిబల్స్‌ మేర పెరిగే ట్రాఫిక్‌ ధ్వని వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, మధుమేహం ముప్పు 3.2 శాతం మేర పెరుగుతుంది.
  • ముఖ్యంగా రాత్రివేళ ట్రాఫిక్‌ శబ్దాలు నిద్రకు ఆటంకాలు కలిగిస్తాయి. నిద్రా సమయాన్ని తగ్గించేస్తాయి. దీనివల్ల రక్తనాళాల్లో ఒత్తిడి హార్మోన్ల స్థాయి పెరగొచ్చు. ఫలితంగా ఇన్‌ఫ్లమేషన్‌, అధికరక్తపోటు, గుండె జబ్బులకు ఆస్కారం పెరుగుతుంది.

ఇలా తగ్గించుకోవచ్చు..

  • రోడ్లు, రైలు, విమాన ట్రాఫిక్‌ ద్వారా చోటుచేసుకునే శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి పరిశోధకులు పలు వ్యూహాలను సూచించారు.
  • జనాభా సాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్ల వెంబడి ‘నాయిస్‌ బ్యారియర్ల’ను ఏర్పాటు చేయాలి. దీనివల్ల 10 డెసిబల్స్‌ వరకూ ధ్వని స్థాయి తగ్గుతుంది.
  • ధ్వనిని తగ్గించే ప్రత్యేక తారుతో రోడ్లను నిర్మించడం వల్ల శబ్ద కాలుష్యం 3-6 డెసిబల్స్‌ వరకూ తగ్గొచ్చు.
  • వాహనాల వేగాన్ని పరిమితం చేయాలి. తక్కువ శబ్దాన్ని కలిగించే టైర్ల వినియోగాన్ని ప్రోత్సహించాలి.  
  • సైకిళ్లపై ప్రయాణాలకు ప్రాధాన్యమివ్వాలి. వాహనాల పూలింగ్‌, ప్రజారవాణా వినియోగానికి పెద్దపీట వేయాలి.
  •  రైళ్లతో ఉత్పన్నమయ్యే ధ్వని కాలుష్యాన్ని తగ్గించడానికి ఎప్పటికప్పుడు రైల్వేల్లో నిర్వహణ పనులు చేపట్టాలి. బ్రేక్‌ వ్యవస్థను కాలానుగుణంగా మెరుగుపరచాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని