Hamas: గాజాకు సహాయ ట్రక్కు.. లూటీ చేసిన హమాస్‌

Eenadu icon
By International News Team Updated : 02 Nov 2025 12:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుదీర్ఘ యుద్ధం తర్వాత ఇజ్రాయెల్‌-హమాస్‌ (Israel- Hamas)ల మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అమెరికా జోక్యంతో సంధి కుదిరినప్పటికీ.. వాటిని ఉల్లంఘిస్తూ గాజాపై ఇజ్రాయెల్‌ మెరుపు దాడులు కొనసాగిస్తోంది. దీంతో కాల్పుల విరమణ ఒప్పందంతో ఊపిరి పీల్చుకుంటున్న పాలస్తీనావాసుల్లో మళ్లీ గుబులు మొదలైంది. మరో వైపు గాజా ప్రజల కోసం పంపుతున్న మానవతా సాయాన్ని హమాస్‌ కార్యకర్తలు అడ్డుకుంటున్నారని అమెరికా ఆరోపించింది. అందుకు సంబంధించిన డ్రోన్‌ (US military drone) దృశ్యాలను యూఎస్‌ (US) సెంట్రల్ కమాండ్ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. 

శనివారం దక్షిణ గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించిన సహాయ ట్రక్కును హమాస్‌ కార్యకర్తలు అడ్డుకున్న దృశ్యాలు  ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. డ్రైవర్‌పై దాడి చేసి.. దానిని లూటీ (Hamas loots Gaza aid truck) చేసినట్లు అమెరికా వెల్లడించింది. అంతర్జాతీయ భాగస్వాముల నుంచి గాజా ప్రజలకు అందే మానవతా సాయాన్ని కూడా హమాస్‌ అడ్డుకుంటుండడంపై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకలితో అలమటించిపోతున్న గాజా ప్రజలకు చేరాల్సిన సాయాన్ని అందకుండా చేసి.. హమాస్‌ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. గాజాలో శాంతి నెలకొల్పడానికి ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలకు అంతర్జాతీయంగా వస్తున్న మద్దతును ఇటువంటి ఘటనలు బలహీనపరుస్తున్నాయని అన్నారు. ప్రస్తుతం దాదాపు 40 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు గాజా ప్రజలకు మానవతా సహాయాన్ని అందిస్తున్నాయన్నారు. 

అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్, ఇజ్రాయెల్‌ మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్‌ గాజాపై దాడులు కొనసాగిస్తోంది. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్‌ కాల్పులు జరిపినందుకే ఈ ఆదేశాలిచ్చామని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వెల్లడించారు. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా బందీల మృతదేహాలను హమాస్‌ సంస్థ ఇజ్రాయెల్‌కు అప్పగిస్తోంది.


Tags :
Published : 02 Nov 2025 10:41 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని