Hong Kong: హాంకాంగ్‌లో కుంభవృష్టి.. మెరుపు వరదతో నీటమునిగిన నగరం

జల ప్రళయం వచ్చిందా అన్నంత స్థాయిలో హాంకాంగ్‌లో వరదలు విరుచుకుపడ్డాయి. ఒక్క గంటలో పడిన వర్షం నగరాన్ని నీట ముంచేసింది. 

Updated : 08 Sep 2023 19:25 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఆర్థిక కేంద్రమైన హాంకాంగ్‌, దక్షిణ చైనాలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. శుక్రవారం ఉదయానికి వీధులు, సబ్‌వేలు నీట మునగడంతో పాఠశాలలను మూసివేశారు. హాంకాంగ్‌ మహానగరం 140 ఏళ్లలో ఈ స్థాయి కుంభవృష్టిని చూడలేదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. పల్లపు ప్రాంతాల ప్రజలను రక్షించడానికి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ వర్షాల కారణంగా ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గత 24 గంటల్లో 83 మంది ఆసుపత్రి పాలయ్యారని అత్యవసర విభాగం అధికారులు వెల్లడించారు. ఈ నగరంలో దాదాపు 75 లక్షల మంది జీవిస్తున్నారు.

ఒక్క గంటలోనే విరుచుకుపడ్డ వరద..

గురువారం రాత్రి 11 గంటల నుంచి 12 లోపు  158.1 మిల్లీమీటర్ల (6.2 అంగుళాల) వర్షం కురిసింది. 1884 తర్వాత ఒక గంటలో కురిసిన అత్యధిక వర్షపాతం ఇదే. క్వోలూన్‌, నగర ఉత్తర ప్రాంతంలో రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి లోపు 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడింది. నగరంలోని కొన్ని చోట్ల గత 24 గంటల్లో 19.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇటీవలే అత్యంత బలమైన టైఫూన్‌ బారిన పడి కోలుకొంటున్న ఈ నగరంపై తాజా వరదలు దెబ్బకొట్టాయి. 

శుక్రవారం వరద కారణంగా నగరంలో చాలా చోట్ల రవాణా సేవలు, వ్యాపారాలు నిలిచిపోయాయి. నగరంలో అతిపెద్ద వర్షపాత హెచ్చరిక అయిన ‘బ్లాక్‌’ను గురువారం సాయంత్రమే జారీ చేశారు. హాంకాంగ్‌ స్టాక్‌ మార్కెట్‌ కూడా ఉదయం ట్రేడింగ్‌ను నిలిపివేసింది. అత్యవసరమైన ఉద్యోగులను మాత్రమే కార్యాలయాలకు పిలిపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన వారు ఇళ్లకే పరిమితం కావాలని పేర్కొంది. వాంగ్‌తాయ్‌ జిల్లాలోని ఓ రైల్వే స్టేషన్‌ నీటమునిగింది. దీంతో రైల్వే శాఖ కూడా సేవలను నిలిపివేసింది. మరోవైపు బస్సులు కూడా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. సాయంత్రం వరకు వరద తీవ్రత తగ్గే అవకాశం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. నగరాన్ని క్వోలూన్‌ ద్వీపకల్పంతో అనుసంధానించే మార్గం కూడా వరదల్లో చిక్కుకొంది. 

దక్షిణ చైనా 71ఏళ్లలో చూడనంత వర్షం..

మరోవైపు దక్షిణ చైనాలోని షెన్‌జెన్‌ నగరంలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. 1952 తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో వందల కొద్దీ విమానాలు రద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో మెరుపు వరదలు వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. చైనాలో దక్షిణ భాగంలో జనసాంద్రత అత్యధికంగా ఉంటుంది.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని