Israel-Hamas: భీకరంగా భూతల పోరు.. హమాస్‌ కీలక కమాండర్లు హతం..!

Israel-Hamas: హమాస్‌ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ఉత్తర గాజాలోకి అడుగుపెట్టిన ఇజ్రాయెల్‌ దళాలు.. భూతల పోరును మరింత తీవ్రం చేశాయి. ఈ క్రమంలోనే పలువురు హమాస్‌ కీలక కమాండర్లను చంపినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది.

Updated : 10 Nov 2023 16:41 IST

ఖాన్‌ యూనిస్‌: భూతల పోరులో కీలక దశకు చేరుకున్నామని ప్రకటించిన ఇజ్రాయెల్‌ (Israel) దళాలు.. గాజా (Gaza) నగరంలో తీవ్ర పోరు సాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉత్తర గాజాలో తమ గ్రౌండ్‌ ఫోర్సెస్‌.. అనేక మంది హమాస్‌ (Hamas) ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (IDF) వెల్లడించింది. ఇందులో ఆ ముఠాకు చెందిన నఖ్బా విభాగంలో కీలక కమాండర్లు కూడా హతమైనట్లు తెలిపింది.

అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన నరమేధంలో ఈ నఖ్బా దళాలు కీలకంగా పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో భూతల దాడుల్లో ఈ విభాగంపై ఐడీఎఫ్‌ నిఘా పెట్టింది. షిన్‌బెట్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ఇచ్చిన నిఘా సమాచారంతో జబాలియా ప్రాంతంలో ఐడీఎఫ్‌ దళాలు భీకర దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో నఖ్బా కీలక కమాండర్లు అహ్మద్‌ మౌసా, అమర్‌ అల్హంది హతమైనట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌ ఆర్మీ పోస్ట్‌, జికిమ్‌ బేస్‌పై దాడికి మౌసా నాయకత్వం వహించినట్లు ఐడీఎఫ్‌ తెలిపింది.

కాల్పుల విరమణ అంటే హమాస్‌కు లొంగిపోవడమే: ఇజ్రాయెల్‌

మరోవైపు, ఉత్తర గాజాలో చాలా దూరం చొచ్చుకొచ్చిన ఐడీఎఫ్‌ దళాలు.. అతి పెద్ద అల్‌ షిఫా ఆసుపత్రి సమీపంలోకి చేరుకున్నాయి. ఈ ఆసుపత్రి కింద.. హమాస్‌ ప్రధాన కమాండ్‌ సెంటర్‌ ఉందని, దానిని గుర్తించామని ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. ప్రస్తుతం అక్కడ హమాస్‌ దళాలతో తీవ్ర పోరు జరుగుతోందని తెలిపింది. ఈ పోరులో పలువురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు తెలిపింది. మరోవైపు, ఈ ఆసుపత్రిపై ఇజ్రాయెల్‌ జరిపిన బాంబు దాడిలో 13 మంది మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది.

యుద్ధం విస్తరణ అనివార్యమే: ఇరాన్‌

ఇదిలా ఉండగా.. గాజాలో ఇజ్రాయెల్‌ దాడులను ఇరాన్‌ మరోసారి తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల కారణంగా గాజాలో పౌరుల మరణాలు పెరుగుతున్నాయని, ఈ పరిస్థితులను చూస్తుంటే.. యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం ఖాయంగానే కన్పిస్తోందని ఇరాన్‌ విదేశాంగ మంత్రి హోస్సేన్‌ అమిరబ్దుల్లా హెచ్చరించారు. ‘‘గాజాలో పౌరుల నివాసాలపై ఇజ్రాయెల్‌ తమ దాడులను నానాటికీ విస్తరిస్తోంది. అటు అమెరికా దౌత్య ప్రయత్నాలు చేస్తూనే.. తమ నౌకాదళాన్ని తూర్పు మధ్యదరా సముద్రంలో మోహరిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరించడం అనివార్యంగా కన్పిస్తోంది’’ అని ఇరాన్‌ మంత్రి వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు