Hamas: డెయిఫ్‌ ఫొటో సాధించాం.. ఉత్తరగాజాలో హమాస్‌ కమాండ్‌ వ్యవస్థను ధ్వంసం చేశాం: ఇజ్రాయెల్‌

హమాస్‌ అగ్రనేత ఫొటోను ఎట్టకేలకు ఐడీఎఫ్‌ సంపాదించింది. ఉత్తర గాజాలో ఆ సంస్థను కోలుకోలేని విధంగా  దెబ్బతీసినట్లు ప్రకటించింది.

Updated : 07 Jan 2024 11:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హమాస్‌(Hamas)పై దాడులు మొదలు పెట్టిన మూడు నెలల తర్వాత.. ఉత్తర గాజాలో దాని కమాండ్‌ వ్యవస్థ మొత్తాన్ని తుడిచిపెట్టామని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) ప్రకటించింది. హమాస్‌లో అతి ముఖ్యమైన కమాండర్‌ మహమ్మద్‌ డెయిఫ్‌ ఫొటోను సంపాదించింది.

‘‘ఉత్తర గాజా పట్టీలో హమాస్‌ సైనిక వ్యవస్థను మొత్తం ధ్వంసం చేశాం. ఇప్పుడు దానికి కమాండర్లు లేరు. దీంతో చెదురుమదురు దాడులకు మాత్రమే పాల్పడుతోంది. ఇప్పుడు మధ్య గాజా, దక్షిణ గాజాలో దాని వ్యవస్థలను ధ్వంసం చేయడంపై దృష్టి సారించాం. దీనికి కొంత సమయం పట్టవచ్చు’’ అని ఐడీఎఫ్‌ ప్రతినిధి డానియల్‌ హగారీ అన్నారు.

ఇతడే డెయిఫ్‌..

హమాస్‌ మిలటరీ వింగ్‌ కమాండర్‌ మహమ్మద్‌ డెయిఫ్‌ ఫొటోను హగారీ విడుదల చేశారు. గాజా నుంచి స్వాధీనం చేసుకొన్న 7 కోట్ల డిజిటల్‌ ఫైల్స్‌ నుంచి దీనిని గుర్తించామని చెప్పారు. ఇజ్రాయెల్‌ మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో ఇతడు ఉన్నాడు. విడుదల చేసిన ఫొటోలో డెయిఫ్‌ కప్పు పట్టుకొని కనిపించాడు.

ఎవరీ హమాస్‌ మాస్టర్‌మైండ్‌ డెయిఫ్‌..!

గాజా ఆపరేషన్‌లో ఇప్పటి వరకు 176 మంది సైనికులను కోల్పోయినట్లు హగారీ వెల్లడించారు. ఉత్తర గాజా నుంచి రాకెట్‌ కాల్పులు అప్పుడప్పుడు చోటు చేసుకొంటున్నా.. భారీ దాడులు చేసే సత్తా హమాస్‌కు లేదని వివరించారు. సెంట్రల్‌ గాజా ఉగ్రవాదులతో కిక్కిరిసిపోయిందని చెప్పారు. అక్కడ ఖాన్‌ యూనిస్‌ ప్రాంతంలో సొరంగాలతో భూగర్భ నగరమే ఉందన్నారు. ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టడంలో ఎటువంటి షార్ట్‌కట్‌లు ఉండవని వివరించారు.   

అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌లో బెర్రీ కిబుట్జ్‌పై దాడికి పాల్పడిన హమాస్‌ నుస్రెత్‌‌ బెటాలియన్‌ కమాండర్‌ ఇస్మాయిల్‌ సిరాజ్‌, అతడి డిప్యూటీ అహ్మద్‌ వాహబ్‌లను తాజాగా సెంట్రల్‌ గాజాలో మట్టుబెట్టారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ అంతర్గత నిఘా వ్యవస్థ షిన్‌బెట్‌ ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని