Hamas: హమాస్‌ సొరంగాలను నీటితో నింపేందుకు ఏర్పాట్లు..!

గాజాపై దాడుల తీవ్రతను ఇజ్రాయెల్‌ మరింత పెంచింది. హమాస్‌ సొరంగాల్లో కృత్రిమ వరదను సృష్టించేందుకు ప్రయత్నాలను కూడా ప్రారంభించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

Published : 05 Dec 2023 14:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇజ్రాయెల్‌ దళాలకు గాజాలో పెద్ద తలనొప్పిగా మారిన హమాస్‌ సొరంగాలను నీటితో నింపేసేందుకు యత్నాలు మొదలయ్యాయి. ఈ ఎత్తు ఫలిస్తే.. సొరంగాల్లో నక్కిన హమాస్‌ దళాలు మొత్తం ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు రావాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఇజ్రాయెల్‌ అంచనావేస్తోంది. తాజాగా ఈ వ్యూహంలో భాగంగా ఐడీఎఫ్‌ దళాలు భారీ నీటి పంపులను సొరంగాల వద్దకు చేరుస్తున్నాయి. ఈ విషయాన్ని అమెరికా పత్రిక వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనంలో పేర్కొంది.

కాస్త తేరుకున్న చెన్నై.. ఎయిర్‌పోర్టులో రాకపోకల పునరుద్ధరణ

నవంబర్‌ మధ్య నాటికి కనీసం ఐదు భారీ పంపులను అల్‌-షతి శరణార్థి శిబిరానికి ఒక కిలోమీటర్‌ దూరంలోకి చేర్చాయి. ఈ పంపులతో గంటకు వేల క్యూబిక్‌ మీటర్ల నీటిని సొరంగాల్లోకి పంపించొచ్చు. ఈ రకంగా కొన్ని వారాల్లోనే సొరంగాలను పూర్తిగా నింపేసే అవకాశం ఉంది. కాకపోతే బందీల విడుదల పూర్తికాక ముందే ఈ వ్యూహాన్ని ఇజ్రాయెల్‌ అమలు చేస్తుందా అనేది స్పష్టంగా తెలియడంలేదు. ఇప్పటి వరకు ఇజ్రాయెల్‌ దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే బందీలను సొరంగాల్లోనే సురక్షితంగా ఉంచామని గతంలో హమాస్‌ ప్రకటించింది. మరోవైపు అమెరికా అధికారులు కూడా ఇజ్రాయెల్‌ ఈ సొరంగాలను నిరుపయోగంగా మార్చాలని చూస్తోందని.. దీనికి అనేక మార్గాలను పరిశీలిస్తోందని వెల్లడించారు.

ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయెల్‌ దృష్టి..

హమాస్‌ కార్యకలాపాలకు కీలకమైన ఖాన్‌ యూనిస్‌ పట్టణ సమీపానికి ఇజ్రాయెల్‌ బలగాలు చేరుకున్నాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ మీడియా ధ్రువీకరించింది. ఈ నగరంలోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఐడీఎఫ్‌ దళాలు వెల్లడించాయి. భారీ ట్యాంకులు, సాయుధ వాహనాలు, బుల్‌డోజర్లను సోమవారం ఖాన్‌ యూనిస్‌ వద్దకు తరలించారు. తాజా పోరాటం పాలస్తీనా వాసులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఐరాస సంస్థ గాజా విభాగం అధిపతి థామస్‌ వైట్‌ ఈ పరిస్థితిపై స్పందించారు. ‘‘మరో విడత వలసలు మొదలయ్యాయి. ఇప్పటికే నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సమయం గడిచేకొద్దీ మరింతగా దిగజారుతున్నాయి’’ అని పేర్కొన్నారు.

హమాస్‌లో ఖాన్‌యూనిస్‌ పట్టణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ సంస్థ కీలక నాయకులైన యాహ్యా సిన్‌వార్‌, మహమ్మద్‌ డెయిఫ్‌ ఇక్కడి శరణార్థి శిబిరాల్లోనే పుట్టారు. వీరు ఈ నగరం  కేంద్రంగానే కార్యకలాపాలు నిర్వహించి హమాస్‌లో వేగంగా ఎదిగారు. తాజాగా ఈ నగరంపై ఇజ్రాయెల్‌ దృష్టి సారించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని