Japan: న్యూఇయర్‌ విషాదం: ఒకే రోజు 155 భూకంపాలు.. 24కు చేరిన మృతుల సంఖ్య

జపాన్‌లో భూకంపం విలయం సృష్టించింది. అగ్నిప్రమాదం జరిగి ఒకే వీధిలో 200 భవనాలు కాలిపోయాయి. ఇప్పటి వరకు  24 మంది మరణించినట్లు స్థానిక పత్రికలు పేర్కొంటున్నాయి.

Updated : 02 Jan 2024 13:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: జపాన్‌ భూకంపంలో కీలక విషయాలు మెల్లగా వెల్లడవుతున్నాయి. ఒక్క సోమవారమే ఈ దేశంలో తీవ్రమైన 155 ప్రకంపనలు వచ్చినట్లు గుర్తించారు. రిక్టర్‌ స్కేల్‌పై వీటి తీవ్రత 3-7.6 మధ్యలో నమోదైంది. మంగళవారం కూడా ఇక్కడ ఆరు సార్లు భూమి కంపించింది. మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ఉదయం 13 వరకు ఉన్న ఈ సంఖ్య ప్రస్తుతం 24కు చేరిందని జపాన్‌ టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. భవనాలు కూలడం, అగ్నిప్రమాదాల కారణంగానే అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఇక నీగట, టొయామ, ఫుకూయ్‌, గిఫూ నగరాల్లో క్షతగాత్రులను గుర్తించారు. 45 వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. అటు భూకంపం కారణంగా నిన్న జారీ చేసిన సునామీ హెచ్చరికల తీవ్రతను తాజాగా తగ్గించారు.

భూకంపంతో అసైచి వీధిలో 200 కట్టడాలు దగ్ధం..

పర్యాటక ప్రదేశమైన వాజిమా నగరంలోని అసైచి వీధిలో భూకంపం కారణంగా భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రాంతం కేవలం 280 చదరపు మీటర్లలోనే ఉండటంతో అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. మంటల ధాటికి 200 భవనాలు కాలిపోయాయి. ఈ విషయాన్ని జపాన్‌ పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టర్‌ ఎన్‌హెచ్‌కే వెల్లడించింది. ఈ నగరంలోనే ఇప్పటివరకు 14 మరణాలు నమోదయ్యాయి. కొన్ని భవనాలు ఇప్పటికీ మంటల్లోనే ఉన్నాయి. ఈ నగరంలో 6 తీవ్రతతో భూకంపం సంభవించింది. నగరానికి వచ్చే ప్రధాన రహదారులన్నీ బీటలు వారి.. వాహనాలు కదలడం అసాధ్యంగా మారాయి.

  • ఇక సుజు ప్రాంతంలో 50కి పైగా భవనాలు కూలిపోయాయని అధికారులు ధ్రువీకరించారు. వీటిల్లో ఓ ప్రార్థనా మందిరం కూడా ఉంది. ఇక్కడి పోర్టును సునామీ అలలు తాకడంతో చాలా పడవలు బోల్తాపడ్డాయి.
  • షికా ప్రాంతంలో సోమవారం అత్యధికంగా 7 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఇక్కడ టోగి వైద్యశాల భవనం ధ్వంసమైంది. చాలా ఇళ్లు కూలిపోయాయి. 
  • హిమి ప్రాంతంలో అత్యధికంగా కర్రలతో నిర్మించిన ఇళ్లు ఉంటాయి. తాజాగా వచ్చిన భూకంపంలో ఇవి చాలా వరకు దెబ్బతిన్నాయి. 

దక్షిణ కొరియాలో ఘోరం.. ప్రతిపక్ష నేతపై కత్తి దాడి!

జపాన్‌లో మంగళవారం కూడా భూప్రకంపనలు ఆగకపోవడం సహాయక చర్యలకు పెద్ద అడ్డంకిగా మారింది. అసలు ప్రాణనష్టం ఎంతో తెలుసుకోవడం ఇప్పుడు జపాన్‌ ముందున్న ప్రధాన సమస్య. వేల సంఖ్యలో జపాన్‌ సెల్ఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌, ఫైర్‌ ఫైటర్లు, పోలీసులను భూకంప ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. దారుణంగా దెబ్బతిన్న ప్రధాన రహదారుల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న ఏకైక ఎయిర్‌పోర్టులోని రన్‌వే భారీ పగుళ్లు ఏర్పడటంతో మూసివేయాల్సి వచ్చింది. ఇప్పుడు కాలంతో పోటీపడుతూ గాలింపు, సహాయక చర్యలు చేస్తున్నామని జపాన్‌ ప్రధాని కిషిద స్వయంగా వెల్లడించారు. ముఖ్యంగా భూకంప ప్రభావిత నోటో ద్వీపకల్పానికి సహాయక బృందాలు చేరడం ప్రధాన సమస్యగా మారిందని ఆయన వెల్లడించారు.

తొలి 72 గంటలే ఎందుకు కీలకం..?

సాధారణంగా భూకంపం (Earthquake) నేరుగా మనిషి ప్రాణం తీయదు. కేవలం కూలిన భవనాలతోనే ప్రాణనష్టం ఉంటుంది. గత చరిత్రను పరిశీలిస్తే భూకంపాలు వచ్చిన సమయంలో 90శాతం మందిని తొలి మూడు రోజుల్లోనే రక్షించగలిగినట్లు గణాంకాలు చెబుతున్నాయని యూనివర్శిటీ కాలేజి లండన్‌కు చెందిన డిజాస్టర్‌ అండ్‌ హెల్త్‌ విభాగ ప్రొఫెసర్‌ ఇలాన్‌ కెల్మన్‌ చెబుతున్నారు. దీనికి తోడు వాతావరణం, సహాయక బృందాలు ఎంత వేగంగా చేరుకొన్నాయి, పరికరాలు ఎంత తొందరగా అందుబాటులోకి వచ్చాయి అనేది కీలకం. భూకంపం వచ్చిన తొలి 24 గంటల్లో స్థానికులు.. చేతులు, చిన్న చిన్న పరికరాలతో చేపట్టే సహాయక చర్యలు అత్యంత కీలకం. వీరే అత్యధిక మందిని కాపాడుతుంటారు. సోమవారం జపాన్‌లో భూకంపం వచ్చి 24 గంటలు ఇప్పటికే గడిచిపోయాయి. మంగళవారం కూడా ప్రకంపనలు కొనసాగుతుండటంతో కూలిన భవనాల శిథిలాల వద్ద సహాయక చర్యలు చేపట్టడం సవాళ్లతో కూడుకొన్నపని. 

మరోవైపు అర్ధంతరంగా నిలిపివేసిన నాలుగు బుల్లెట్‌ రైళ్ల సేవలను జపాన్‌ పునరుద్ధరించింది. వీటి కారణంగా దాదాపు 1400 మంది చిక్కుకుపోయారు. ఈ రైళ్లు టొయమా స్టేషన్‌, కంజావా స్టేషన్ల మధ్య చిక్కుకున్నాయి.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని