Dong Jun: చైనా నూతన రక్షణ మంత్రిగా డాంగ్‌ జున్‌.. నాలుగు నెలలైనా జాడలేని షాంగ్‌ఫూ!

చైనా తన నూతన రక్షణశాఖ మంత్రిగా డాంగ్ జున్‌ను నియమించింది. ఇంతకుముందు ఈ పదవిలో ఉన్న లీ షాంగ్‌ఫూ ఆగస్టు నుంచి కనిపించకుండా పోయారు.

Published : 29 Dec 2023 22:32 IST

బీజింగ్: చైనా తన నూతన రక్షణశాఖ మంత్రి (China Defence Minister)గా నౌకాదళ మాజీ కమాండర్ జనరల్‌ డాంగ్ జున్‌ (Dong Jun)ను నియమించింది. జాతీయ పీపుల్స్‌ కాంగ్రెస్‌ స్టాండింగ్‌ కమిటీ (NPC) దీనికి ఆమోదం తెలిపినట్లు అధికారిక మీడియా వెల్లడించింది. ఈ పదవిలో ఉన్న జనరల్‌ లీ షాంగ్‌ఫూ (Li Shangfu)ను అక్టోబరులో తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు నెలల తర్వాత డాంగ్‌ జున్‌కు రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించింది. చైనాను ప్రబలమైన ప్రపంచ శక్తిగా మార్చడంలో భాగంగా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Jinping) తన సైన్యాన్ని అభివృద్ధి చేస్తోన్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

జిన్‌పింగ్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న డాంగ్.. గతేడాది అక్టోబర్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (CPC)కి ఎన్నికయ్యారు. గతంలో చైనా నౌకాదళానికి కమాండర్‌గా ఉన్న ఆయన.. సెప్టెంబరు 2021లో జనరల్ హోదాకు పదోన్నతి పొందారు. అంతకుముందు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ ఏడాది మార్చిలో జనరల్‌ లీ షాంగ్‌ఫూ.. చైనా రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆగస్టు చివర్లో అదృశ్యమైన ఆయన ఆచూకీ ఇప్పటివరకూ తెలియకపోవడం గమనార్హం. అక్టోబరు 24న షాంగ్‌ఫూ విషయంలో చైనా ప్రభుత్వం తొలిసారి స్పందించింది. ఆయనను పదవి నుంచి తొలగించినట్లు  తెలిపింది. అయితే.. ఉద్వాసనకు కారణమేంటన్నది వెల్లడించలేదు.

జిన్‌పింగ్ కేబినెట్‌లో మరో మంత్రి మిస్సింగ్..?

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ అధికార పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పారిశ్రామికవేత్తలు మొదలు మంత్రుల వరకు చాలా మంది అకస్మాత్తుగా అదృశ్యమవుతున్నారు. ఈ ఏడాది మేలో అప్పటి చైనా విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ ఇలానే అదృశ్యమయ్యారు. తర్వాత కొన్ని రోజులకు ఆయనను తప్పించి.. విదేశాంగ బాధ్యతలను అంతకుముందు నిర్వహించిన వాంగ్‌ యీకి అప్పగించారు. ఆ తర్వాత పీపుల్స్‌ లిబరేషన్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌కు చెందిన ఇద్దరు కమాండర్ల జాడ లేదు. ఈ రాకెట్ ఫోర్స్‌.. అణు, బాలిస్టిక్‌ క్షిపణుల ఆయుధాగారాన్ని పర్యవేక్షిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని