Kenya: మృతదేహాలను అద్దెకు తెచ్చుకున్నారట : ఆందోళనకారులపై పోలీసుల ఆరోపణ

కెన్యాలో ఇటీవల చోటుచేసుకున్న ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల (Kenya Protests) నేపథ్యంలో తమ అధికారులను దోషులుగా చిత్రీకరించేందుకు ఆందోళనకారులు మృతదేహాలను అద్దెకు తెచ్చుకున్నారని (Hiring Dead bodies) పోలీసు ఆరోపించారు.

Published : 08 Aug 2023 18:33 IST

నైరోబీ: కెన్యాలో ఇటీవల చోటుచేసుకున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు (Kenya Protests).. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన విషయం తెలిసిందే. భద్రతా దళాలు, ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వాస్తవంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉందని హక్కుల సంఘాలు చెబుతుండగా.. పోలీసులు (Kenya Police) మాత్రం వారి వాదనను వ్యతిరేకిస్తున్నారు. పోలీసు అధికారులను దోషులుగా చిత్రీకరించేందుకు ఆందోళనకారులు మృతదేహాలను అద్దెకు తెచ్చుకున్నారని (Hiring Dead bodies) ఆరోపించారు.

‘పోలీసుల ప్రతిష్ఠను దిగజార్చేందుకు ఆందోళనకారులు మృతదేహాలను అద్దెకు తెచ్చుకొని వాటిని మీడియా ముందు ఊరేగించారు’ అని కెన్యా జాతీయ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ జఫెట్‌ కూమే ఆరోపించారు. తమపై అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో (ICC) కేసులు నమోదు చేస్తామని వస్తోన్న బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను అణచివేస్తామని స్పష్టం చేశారు. అయితే, మృతదేహాలను అద్దెకు తెచ్చుకున్నారన్న ఆరోపణలకు సంబంధించి ఎటువంటి ఆధారాలను మాత్రం పోలీస్‌ బాస్‌ చూపించలేదు.

పురుగులున్న చీకటి గదిలో..ఇమ్రాన్‌ ఖాన్‌!

భారీగా పెరిగిన జీవన వ్యయంతో అల్లాడిపోతున్న కెన్యాలో ఇటీవల పన్నులు పెంచుతూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండు చేస్తూ ప్రతిపక్ష కూటమి జులై నెలలో ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో అనేకమంది మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులపై వ్యక్తిగతంగా అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో ఫిర్యాదు చేస్తామని హక్కుల సంఘాలు వెల్లడించడంపై పోలీసులు స్పందించారు.

ఇదిలాఉంటే, కెన్యాలో జరిగిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో 11 మంది చనిపోయినట్లు కెన్యాలోని అమ్నెస్టీ ఇంటర్నేషనల్‌తోపాటు అక్కడి న్యాయ, వైద్య సంఘాలు వెల్లడించాయి. పోలీసుల నుంచి తప్పించుకుపోవడం లేదా లొంగిపోయే క్రమంలో జరిపిన కాల్పుల్లో మరణించారని తెలిపాయి. అటు ఇండిపెండెంట్‌ మెడికో-లీగల్‌ యూనిట్‌ (ఐఎంఎల్‌యూ) మాత్రం 35మంది చనిపోయారని పేర్కొంది. విపక్ష కూటమి మాత్రం 50మంది వరకు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని