Pakistan Jail: పురుగులున్న చీకటి గదిలో.. ఇమ్రాన్‌ ఖాన్‌!

తోషాఖానా కేసులో అరెస్టై జైలుకెళ్లిన పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ (Imran Khan)కు జైల్లో ప్రత్యేకంగా ఎటువంటి సదుపాయాలు కల్పించలేదు.

Updated : 08 Aug 2023 19:14 IST

ఇస్లామాబాద్‌: తోషాఖానా కేసులో అరెస్టైన పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ను (Imran Khan) అక్కడి అటక్‌ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే, ఆయనకు జైల్లో (Attock Jail) ప్రత్యేకంగా ఎటువంటి సదుపాయాలు కల్పించలేదని తెలుస్తోంది. చిన్న చీకటి గదిలో ఇమ్రాన్‌ను ఉంచారని.. అందులోనూ చీమలు, ఈగలు ఉన్నట్లు సమాచారం. బాత్‌రూమ్‌ కూడా అందులోనే ఉందని.. ఎవరినీ కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఇమ్రాన్‌ వర్గీయులు ఆరోపించారు. అయితే, లోపల ఇలా ఉన్నా.. జైలు బయట మాత్రం భారీ భద్రత కల్పించడం గమనార్హం.

‘ఓ చిన్న చీకటి గదిలో ఉంచారు. టీవీ, వార్తాపత్రిక కూడా లేదు. అందులోనే వాష్‌రూమ్‌ ఉంది. ఈగలు, చీమల బెడద ఎక్కువగా ఉంది. నన్నో ఉగ్రవాదిగా చూస్తున్నారు! ఎవరినీ కలిసేందుకు అనుమతించడం లేదు. అయినప్పటికీ.. నా మిగతా జీవితం మొత్తం జైల్లోనే ఉండేందుకు సిద్ధం’ అని ఇమ్రాన్‌ ఖాన్‌ చెప్పినట్లు ఆయన తరఫున న్యాయవాది వెల్లడించారు.

తోషాఖానా కేసులో.. ఇమ్రాన్‌కు జైలు.. అరెస్టు

పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్సులో ఉన్న అటక్‌ జైల్లో (Attock Jail) శిక్ష అనుభవిస్తోన్న ఇమ్రాన్‌ ఖాన్‌ను ఆయన తరఫు న్యాయవాది నయీమ్‌ హైదర్‌ పంతోజీ కలిశారు. కోర్టు తీర్పును సవాలు చేసేందుకు అవసరమైన పత్రాలపై సంతకాలు చేయించుకునేందుకు వెళ్లిన ఆయన.. ఇమ్రాన్‌ దాదాపు గంటన్నర పాటు మాట్లాడారు. ఆ సందర్భంగా జైల్లో కల్పిస్తోన్న సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఇమ్రాన్‌ చెప్పినట్లు మీడియాతో వెల్లడించారు. అరెస్టు చేసే సమయంలోనూ పోలీసులు వారెంటు చూపించలేదని, తన భార్య గది తలుపులను పగలగొట్టేందుకు ప్రయత్నించారని ఇమ్రాన్‌ ఆరోపించినట్లు చెప్పారు.

మరోవైపు అటక్‌ జైల్లో ఉన్న తమ అధినేత ఇమ్రాన్‌ఖాన్‌ను అదియాలా జైలుకు మార్చాలని.. ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ (PTI) పార్టీ సభ్యులు ఇస్లామాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సంపన్న కుటుంబంలో జన్మించిన ఆయన.. ఉన్నత చదువు, సామాజిక, రాజకీయ హోదాతో మెరుగైన జీవన విధానానికి అలవాటు పడ్డారని అన్నారు. పాక్‌ జాతీయ క్రికెట్‌ జట్టుకూ కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన.. ప్రత్యేక సదుపాయాలకు అర్హుడని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు ఆగస్టు 9న (బుధవారం) పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీని రద్దుచేసేందుకు ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ సిద్ధమైన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని