Joe Biden: వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్‌

Joe Biden: అమెరికా ఎప్పుడూ వలసదారులను ఆహ్వానిస్తుందని అధ్యక్షుడు బైడెన్‌ అన్నారు. వారే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. 

Published : 02 May 2024 10:15 IST

Joe Biden | వాషింగ్టన్‌: అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడడంలో విదేశాల నుంచి వస్తున్న వలసదారులది ముఖ్య పాత్ర అని అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden ) అన్నారు. వలసవిధానాన్ని ప్రోత్సహించని దేశాల్లో వృద్ధి నెమ్మదిగా సాగుతోందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు.

చైనా, జపాన్‌, భారత్‌ వంటి దేశాలు వలసదారులను ఆహ్వానించే విషయంలో వెనకబడ్డాయని బైడెన్‌ (Joe Biden) అభిప్రాయపడ్డారు. అందుకే ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. అమెరికా ఎప్పుడూ విదేశీయులను సాదరంగా ఆహ్వానిస్తుందని చెప్పారు. ఆసియా అమెరికన్లు సహా అక్కడ స్థిరపడ్డ విదేశీ కమ్యూనిటీలు ఏర్పాటు చేసిన విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

2024లో వార్షిక ప్రాతిపదికన అనేక దేశాల వృద్ధి కుంటుపడుతుందని ‘అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)’ గత నెల విడుదల చేసిన ఓ నివేదికలో అంచనా వేసింది. జపాన్‌ 0.9 శాతం, భారత్‌ 6.8 శాతం చొప్పున వృద్ధిని నమోదు చేస్తాయని తెలిపింది. అమెరికా మాత్రం 2023లో 2.5 శాతం వృద్ధిని నమోదు చేయగా.. 2024లో అది 2.7 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది. విదేశాల నుంచి వస్తున్న వలసదారుల వల్ల దేశ శ్రామిక శక్తి పెరగడమే అందుకు దోహదం చేస్తున్నట్లు పలువురు ఆర్థికవేత్తలు విశ్లేషించారు.

రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన డొనాల్డ్‌ ట్రంప్‌ను వలసదారుల వ్యతిరేకిగా బైడెన్‌ అభివర్ణించారు. చైనా, రష్యాలను ఎదుర్కోవడానికి జపాన్‌, భారత్‌ వంటి దేశాలతో బంధాన్ని మరింత బలపర్చేందుకు తాను కృషి చేస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని