Khawaja Asif: భారత్‌ కీలుబొమ్మగా అఫ్గాన్‌: పాక్‌ రక్షణ మంత్రి ఆరోపణలు

Eenadu icon
By International News Team Updated : 29 Oct 2025 08:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ (Pakistan Defence Minister Khawaja Asif) భారత్‌ లక్ష్యంగా చేసుకొని మరోసారి నోరుపారేసుకున్నారు. అఫ్గానిస్థాన్‌ భారత్‌ చేతిలో కీలుబొమ్మగా మారిందంటూ ఆరోపించారు. ఈసందర్భంగా ఇస్లామాబాద్‌పై దాడి జరిగితే.. దానికి 50 రెట్ల తీవ్రతతో ప్రతిదాడి తప్పదంటూ హెచ్చరికలు చేశారు.

ఓ వార్తా సంస్థకు సంబంధించిన షోలో ఆయన మాట్లాడుతూ కాబూల్‌ నాయకత్వంపై విరుచుకుపడ్డారు. కాబూల్‌లోని ప్రజలను దిల్లీ నియంత్రిస్తోందన్నారు. భారత్‌ చేతిలో అఫ్గాన్‌ (Afghanistan) కీలుబొమ్మగా మారిందంటూ ఆరోపణలు చేశారు. భారత్‌ తన ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ఆ దేశాన్ని ఉపయోగించుకుంటుందని వ్యాఖ్యానించారు. కాబూల్‌తో ఓ ఒప్పందానికి దగ్గరగా వెళ్లినప్పుడల్లా.. కొందరు జోక్యం వల్ల అది ఉపసంహరణకు గురవుతుందన్నారు. సరిహద్దుల్లో శాంతి కోసం చర్చలకు పిలుపునిచ్చిన అఫ్గాన్‌ ప్రతినిధి బృందాన్ని ఆయన ప్రశంసించారు. అయితే, భారత ప్రభావంతో దాని పురోగతి దెబ్బతిందని ఆరోపించారు. ఈసందర్భంగా  సరిహద్దుల్లో ఘర్షణల నేపథ్యంలో అఫ్గాన్‌ బెదిరింపులపై ఆసిఫ్‌ స్పందించారు. తమ దేశంలో ఉగ్రవాదానికి ఆ దేశమే కారణమన్నారు. అఫ్గాన్‌తో చర్చలు విఫలమైతే.. అది ఆ దేశంతో పూర్తి యుద్ధానికి దారితీయొచ్చని ఆయన హెచ్చరించారు.  కాబూల్‌ను భారత్‌ ఓ సాధనంగా ఉపయోగించుకుంటుందన్నారు.  

పాక్‌- అఫ్గాన్‌ శాంతి చర్చలు విఫలం..

పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌ (Pakistan-Afghanistan) సరిహద్దుల్లో ఇటీవల ఇరుదేశాల మధ్య ఘర్షణలు నెలకొన్న సంగతి తెలిసిందే. వీటికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా తుర్కియేలో ఇరుదేశాల మధ్య పలు దశల్లో చర్చలు జరిగాయి. అయితే, తాజాగా అవి విఫలమయ్యాయి. చర్చల నేపథ్యంలో పలు అంశాలపై ఇరుదేశాల మధ్య అంగీకారం లభించిందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, సరిహద్దుల్లో దాడులకు కారణమైన ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు తాలిబన్‌ ప్రభుత్వం నిరాకరించిన నేపథ్యంలో ఇవి విఫలమయ్యాయని వెల్లడించాయి. పాక్‌ సమాచార మంత్రి అత్తావుల్లా తరార్ కూడా ఇలాంటి ఆరోపణలే చేశారు. పాక్‌- అఫ్గాన్‌ చర్చల్లో ప్రతిష్ఠంభన నెలకొందంటూ ఇరుదేశాల ప్రభుత్వ మీడియాల్లో పేర్కొన్న కొన్ని గంటల్లో ఇవి విఫలమయ్యాయి. చర్చలు విఫలమైన నేపథ్యంలో పాక్‌కు తాలిబన్‌ ప్రభుత్వం గట్టి హెచ్చరికలు చేసింది. భవిష్యత్తులో తమ భూభాగంపై ఎలాంటి దాడి జరిగినా.. ఇస్లామాబాద్‌  లక్ష్యంగా తమ ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటాయని పేర్కొంది.

Tags :
Published : 29 Oct 2025 08:37 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని