Modi to Egypt: 11వ శతాబ్దం నాటి మసీదును సందర్శించనున్న ప్రధాని మోదీ!

ఈజిప్టులో పర్యటించనున్న ప్రధాని మోదీ.. అక్కడి 11వ శతాబ్దపు మసీదును సందర్శిస్తారని విదేశాంగశాఖ వెల్లడించింది.

Updated : 19 Jun 2023 20:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటనకు సిద్ధమయ్యారు. అమెరికా పర్యటన అనంతరం అక్కడి నుంచి ఈజిప్టు (Egypt) చేరుకోనున్నారు. ఈ సందర్భంగా స్థానికంగా 11వ శతాబ్దానికి చెందిన ఓ పురాతన ‘అల్‌- హకీం- మసీదు’ను సందర్శించనున్నారు. దావూదీ బోహ్రా వర్గం (Dawoodi Bohra community) వారు పునరుద్ధరించారు. మసీదు సందర్శన అనంతరం హెలియోపొలిస్‌లోని యుద్ధ స్మారకానికి వెళ్తారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈజిప్టు తరఫున పోరాడి అమరులైన భారత సైన్యానికి అక్కడ ప్రధాని మోదీ నివాళులర్పించనున్నట్లు భారత విదేశాంగ వెల్లడించింది.

విదేశీ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ జూన్‌ 24 వరకు అమెరికాలో పర్యటిస్తారు. అనంతరం ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్లనున్నారు. 1997 తర్వాత భారత ప్రధాని ఆ దేశానికి ద్వైపాక్షిక పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. వీరి భేటీకి ముందు ఇరు దేశాల కీలక మంత్రుల బృందాలు చర్చలు జరుపుతారు. అనంతరం ప్రవాస భారతీయులతోనూ ప్రధాని మోదీ సమావేశమవుతారని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా వెల్లడించారు. మోదీతోపాటు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌లు కూడా ఈజిప్టు పర్యటనలో మోదీ వెంట ఉంటారని తెలిపారు.

ఇదిలా ఉండగా.. నాలుగు నెలల క్రితం ముంబయిలో దావూదీ బోహ్రా మతపెద్దలతో ప్రధాని మోదీ సమావేశమైన విషయం తెలిసిందే. అక్కడి అల్‌ జామియా తుస్‌ సైఫియా అరబిక్‌ అకాడమీ క్యాంపస్‌ను ప్రారంభించిన మోదీ.. ఆ వర్గం ప్రజలతో తనకున్న సన్నిహిత సంబంధాలను గుర్తుచేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని