USA: హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం

గాజా (Gaza) పోరులో ఇజ్రాయెల్‌కు మద్దతుగా జో బైడెన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనలతో అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలు దద్దరిల్లుతున్నాయి. 

Published : 29 Apr 2024 10:40 IST

వాషింగ్టన్: గాజా (Gaza)పై దాడులకు వ్యతిరేకంగా కొద్దిరోజులుగా అమెరికా వ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అవి మరింత తీవ్రరూపం దాల్చుతున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో ప్రముఖ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం (Harvard University)లో పాలస్తీనా జెండా కలకలం సృష్టించింది.

పాలస్తీనియన్లపై దాడులు కొనసాగిస్తున్న ఇజ్రాయెల్‌ (Israel)తో ఆర్థిక సంబంధాలను అమెరికా తెంచుకోవాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే హార్వర్డ్‌లోని ప్రఖ్యాత జాన్‌ హార్వర్డ్ విగ్రహంపై పాలస్తీనా జెండాను ఎగరవేశారు. వాస్తవంగా దానిపై అమెరికా జెండా ఉంటుంది. లేకపోతే ఎవరైనా విదేశీ ప్రతినిధుల వచ్చినప్పుడు వారి దేశ జెండాలను ఉంచుతారు. కానీ నిరసనకారులు అమెరికా జెండాను పక్కనపెట్టి.. పాలస్తీనాకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆ దేశ జెండాను ఎగరవేశారు. హార్వర్డ్ ప్రతినిధి జొనాథన్‌ ఎల్‌ స్వెయిన్‌ ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఇది విశ్వవిద్యాలయ నిబంధనలకు విరుద్ధమని వెల్లడించారు. ఈ ఘటన కారకులపై క్షమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

రంగంలోకి బైడెన్‌.. గాజాలోకి మరింత సాయానికి ఇజ్రాయెల్‌ అనుమతి

తొలుత న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో మొదలైన ఈ ఆందోళనలు అగ్రరాజ్యమంతా విస్తరించాయి. దాంతో వందలమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుత నిరసనల హక్కును తాము గౌరవిస్తామని జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. అయితే విద్వేషపూరిత ప్రసంగాలను మాత్రం తీవ్రంగా ఖండిస్తామన్నారు. ఇదిలా ఉంటే.. ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో చోటుచేసుకున్న నిరసనల్లో భారత సంతతికి చెందిన విద్యార్థిని అరెస్టయిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని