Putin: ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధమే.. జీ20 భేటీలో పుతిన్‌ వ్యాఖ్యలు

Putin: ఉక్రెయిన్‌లో సైనిక చర్యను ముగించేందుకు శాంతి చర్చలకు తాము సిద్ధమేనని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులు విషాదకరమేనన్నారు.

Updated : 23 Nov 2023 13:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌ (Ukraine)తో శాంతి చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ (Putin) అన్నారు. యుద్ధం పరిష్కారం కోసం చర్చలను తామెప్పుడూ వ్యతిరేకించలేదని తెలిపారు. భారత్‌ అధ్యక్షతన జరిగిన జీ20 (G20) దేశాధినేతల వర్చువల్ సదస్సులో పుతిన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘అవును. సైనిక చర్య ఎప్పటికీ విషాదకరమే. దీన్ని ఎలా ఆపాలన్న దానిపై మనం కచ్చితంగా ఆలోచనలు చేయాలి. ఉక్రెయిన్‌తో శాంతి చర్చలను రష్యా ఎప్పుడూ తిరస్కరించలేదు’’ అని ప్రపంచ నేతలతో పుతిన్‌ అన్నారు. ఈ భేటీలో పుతిన్‌ దాదాపు 17 నిమిషాలు ప్రసంగించారు. అయితే, పుతిన్‌ మాట్లాడే సమయంలో చైనా, అమెరికా ప్రతినిధులు వర్చువల్ సమావేశంలో లేనట్లు తెలుస్తోంది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం ప్రాంతీయ ఘర్షణగా మారకూడదు

భారత ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సాయంత్రం ఈ సదస్సు జరిగింది. దీనిలో పలువురు జీ20 దేశాధినేతలు పాల్గొనగా.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మాత్రం ఈ భేటీకి దూరంగానే ఉన్నారు. ఆయన స్థానంలో చైనా ప్రధాని లి కియాంగ్‌ హాజరయ్యారు. ఉగ్రవాదంతో పాటు ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరుతో పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై దేశాధినేతలు చర్చించారు.

సైనిక చర్య పేరుతో 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా.. ఏడాదిన్నరకు పైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. అటు కీవ్‌ దళాలు కూడా మాస్కో దాడులను గట్టిగానే ప్రతిఘటిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం అక్కడ మళ్లీ శీతాకాలం వచ్చేసింది. దీంతో రష్యా దాడులను ఎదుర్కోవడం కాస్త క్లిష్టంగా ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఇటీవల అన్నారు.

గత శీతాకాలంలో విద్యుత్‌ గ్రిడ్‌లు, నీటి సరఫరా వ్యవస్థల వంటి మౌలిక సదుపాయాలపై రష్యా భారీఎత్తున వైమానిక, శతఘ్ని దాడులు జరిపింది. ఫలితంగా ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు అంధకారంలో మిగిలిపోయాయి. ఎముకలు కొరికే చలిలో అటు హీటర్లు పనిచేయక, ఇటు నీటి కటకటతో ప్రజలు నరకయాతన పడ్డారు. అయితే, ఈసారి రష్యా దాడులను దీటుగా ఎదుర్కొనేందుకు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలను మోహరించాలని కీవ్‌ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని