Israel Hamas: గాజాలో భీకర దాడి.. ఒకే కుటుంబానికి చెందిన 76 మంది మృతి..!

గాజా సిటీలోని ఓ భవనంపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 76 మంది మృతి చెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.

Updated : 23 Dec 2023 22:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ ఉగ్రవాదులే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ భీకర దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడుల్లో అమాయక పౌరులూ మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే గాజాలో వేర్వేరు చోట్ల రెండు ఇళ్లపై జరిపిన వైమానిక దాడుల్లో 90 మంది పాలస్తీనీయన్లు మృతి చెందినట్లు సహాయక చర్యల అధికారులు వెల్లడించారు. ఒక దాడిలో ఒకే కుటుంబానికి చెందిన 76 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మరోవైపు.. గత వారం గాజాలో వందలాదిమంది అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. హమాస్‌, ఇస్లామిక్‌ జిహాద్‌ సంబంధాలు ఉన్నట్లు భావిస్తోన్న వారిలో 200 మందిని తదుపరి విచారణ కోసం ఇజ్రాయెల్‌కు తరలించినట్లు తెలిపింది. (Israel Hamas Conflict)

రఫాపైనే ఇజ్రాయెల్‌ గురి

‘గాజా సిటీలోని ఓ భవనంపై శుక్రవారం జరిగిన వైమానిక దాడి.. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో అత్యంత ప్రాణాంతకమైన దాడుల్లో ఒకటి. ఇందులో అల్‌-ముఘ్రాబీ కుటుంబానికి చెందిన 76 మంది మృతి చెందారు. మరణించినవారిలో ఐరాస అభివృద్ధి కార్యక్రమం (UNDP) అధికారి ఇస్సామ్ అల్-ముఘ్రాబీ, అతడి భార్య, ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు’ అని గాజా పౌర రక్షణ విభాగం ప్రతినిధి మహమూద్ బస్సాల్ తెలిపారు. యూఎన్‌డీపీ సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఐరాస సంస్థలు, గాజా పౌరులను ఇజ్రాయెల్‌ తన లక్ష్యంగా చేసుకోకూడదని సూచించింది. ఈ యుద్ధాన్ని ముగించాల్సిందేనని యూఎన్‌డీపీ చీఫ్‌ అచిమ్‌ స్టెయినర్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని