Russia: ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా.. ఒక్కరాత్రే 110 క్షిపణులతో దాడి!

ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తోన్న రష్యా (Russia invasion).. ఒక్కరోజే వందకు పైగా క్షిపణులు, పదుల సంఖ్యలో డ్రోన్లతో మరోసారి విరుచుకుపడింది.

Published : 29 Dec 2023 17:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై దండయాత్ర చేపట్టిన రష్యా (Russia invasion).. 22 నెలలుగా దాడులను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా దాడుల ఉద్ధృతి పెంచింది. ఒక్కరోజే వందకు పైగా క్షిపణులు, పదుల సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఏడుగురు పౌరులు మరణించినట్లు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. దాదాపు రెండేళ్లుగా జరుగుతోన్న యుద్ధంలో (Ukraine Crisis) ఇదే అతిపెద్ద దాడి అని అన్నారు.

శీతాకాలం ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఉపరితల దాడులను రష్యా (Russia) తగ్గించింది. దీంతో వైమానిక దాడులకు ప్రాధాన్యం ఇస్తున్న పుతిన్‌ సేనలు.. ఉక్రెయిన్‌పై మరోసారి దాడులు ముమ్మరం చేశాయి. రాజధాని కీవ్‌తో సహా ఆరు నగరాలపై దాడులు చేశాయి. రష్యా దాడులను తాము సమర్థంగా ఎదుర్కొన్నట్లు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. రష్యా జరిపిన భారీ క్షిపణి దాడుల్లో పలు ఆసుపత్రులు, అపార్టుమెంట్‌లు, పాఠశాలలు దెబ్బతిన్నట్లు తెలిపింది. అనేక మందికి గాయాలు కావడంతోపాటు శిథిలాల కింద కొంత మంది ఉండొచ్చని అంచనా వేసింది.

పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 40 మంది మృతి

మరోవైపు, ఫిబ్రవరి 2022లో రష్యా దురాక్రమణ మొదలు పెట్టినప్పటి నుంచి ఉక్రెయిన్‌పై అనేకసార్లు భారీ వైమానిక దాడులకు దిగింది. వాటిల్లో తాజా దాడి అతి పెద్దదని ఉక్రెయిన్‌ ఎయిర్‌ఫోర్స్‌ కమాండర్‌ మైకోలా ఓలెష్‌చక్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌ వైమానిక సైన్యం ప్రకారం, నవంబర్‌ 2022న రష్యా భారీ దాడి చేసింది. ఆ సమయంలో ఒకేసారి 96 క్షిపణులను ప్రయోగించింది. ఈ ఏడాది మార్చి 9న కూడా 81 క్షిపణులతో ఉక్రెయిన్‌ నగరాలపై విరుచుకుపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని