Russia- Ukraine Conflict: అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధమే: జెలెన్‌స్కీ

Russia- Ukraine Conflict:  అమెరికా, జర్మనీ సహా అనేక దేశాలు తమకు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు.

Updated : 29 Jan 2024 09:51 IST

బెర్లిన్‌: రష్యాతో జరుగుతున్న ఘర్షణ (Russia- Ukraine Conflict) మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) హెచ్చరించారు. అమెరికా సహా అనేక దేశాలు తమకు మద్దతుగా నిలుస్తున్న నేపథ్యంలో ఏమైనా జరగొచ్చని వ్యాఖ్యానించారు. ఈ విషయం జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌కు కూడా తెలుసని పేర్కొన్నారు. ఒకవేళ నాటో కూటమిలోని సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే.. అది మరో ప్రపంచ యుద్ధానికి నాందిగానే భావించాల్సి ఉంటుందన్నారు. జర్మనీ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు.

బెర్లిన్‌ నుంచి టారస్‌ క్రూజ్‌ క్షిపణులు అందకపోవటంపై తాను పెద్దగా నిరాశ చెందలేదని జెలెన్‌స్కీ (Zelensky) అన్నారు. రష్యాతో యుద్ధం విషయంలో ఐరోపా దేశాలకు ఉన్న బలహీనతలను అర్థం చేసుకోగలనన్నారు. ఉక్రెయిన్ ఆక్రమణకు రష్యా సిద్ధమైన సమయంలో జర్మనీ తన వంతు పాత్ర పోషించలేదని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్‌ కోసం ఇతర ఐరోపా దేశాలతో కలిసి ఇప్పుడు అది పెద్ద ఎత్తున నిధులను సమీకరించే ప్రయత్నం చేయాలని కోరారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధిస్తే ఉక్రెయిన్‌కు మద్దతిస్తారా అని ప్రశ్నించగా.. అగ్రరాజ్య విదేశాంగ విధానం ఒక వ్యక్తిపై ఆధారపడి ఉండదని వివరించారు. మరోవైపు ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థిక సాయం తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రష్యాతో పోరాటం కొనసాగుతున్న సమయంలో ఇలాంటి చర్యలు ప్రతికూల సంకేతాలు పంపుతాయని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని