Taliban: మహిళల బ్యూటీ సెలూన్లపై నిషేధం.. కొత్త ఆంక్షలు విధించిన తాలిబన్లు

తాలిబన్ల పాలనలో అఫ్గానిస్థాన్‌లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహిళల బ్యూటీ సెలూన్‌లపై నిషేధం విధించారు.

Published : 04 Jul 2023 12:00 IST

కాబుల్‌: అఫ్గానిస్థాన్‌ (Afghanistan)లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మహిళల హక్కులను కాలరాస్తూ.. కొత్త నిబంధనలను తాలిబన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాబూల్‌లోని మహిళల బ్యూటీ సెలూన్‌ (Beauty Salon)లపై నిషేధం విధించింది. ఇక నుంచి మహిళలు బ్యూటీ సెలూన్లు నడపకూడదని తాలిబన్‌ మంత్రి మహ్మద్ అకిఫ్ మహజర్ ప్రకటించారు. ఈ మేరకు కాబుల్‌ (Kabul)మున్సిపాలిటీకి ఆదేశాలు జారీ చేశారు.

దీనిపై మేకప్‌ ఆర్టిస్టులు ఆందోళన చెందుతున్నారు. ‘‘దేశంలో చాలా వరకు మగవారికి ఉద్యోగాలు లేవు. కుటుంబ పోషణ భారంగా మారడంతో మహిళలు బయటకు రావాల్సి వస్తోంది. ఇప్పుడు సెలూన్లపై నిషేధం విధిస్తే మేం ఏమి చేయాలి?’’ అని మేకప్‌ ఆర్టిస్టు రైహాన్ ముబారిజ్ ప్రశ్నించారు. ‘‘ఇంట్లో ఉన్న మగవారు పనిచేయడానికి బయటకు వెళ్లడం లేదు. ఈ కొత్త ఆంక్షలను ప్రవేశపెట్టి మేమంతా చనిపోవాలని ప్రభుత్వం కోరుకుంటోంది’’అని మరొక మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు దేశాన్ని నాశనం చేసేవిధంగా ఉండకూడదని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అఫ్గాన్‌లో అధికారాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు.. వారి పాలనలో మహిళల హక్కులను హరిస్తున్నారంటూ అంతర్జాతీయ సంస్థలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాలికలు, మహిళలపై ఎన్నో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. బాలికల చదువుపై పరిమితులు విధించింది. సినిమాలు చూడవద్దని.. ఒంటరిగా బయట తిరగవద్దనే ఆంక్షలు అమలు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని