ఇదేం వాతావరణం.. లక్ష సంవత్సరాల్లో ఇంత వేడి లేదు..!

లక్ష సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో ఈ ఏడాది ప్రపంచ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భవిష్యత్తు మరింత ఘోరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.  

Updated : 28 Jul 2023 19:44 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది అసాధారణ వాతావరణ పరిస్థితులు.. రికార్డులను బద్దలు కొడుతున్నాయి. కొన్ని చోట్ల ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని చోట్ల ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా జులై చరిత్రకెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2019లో నమోదైన రికార్డు ఉష్ణోగ్రతలను కూడా ఇప్పుడు మించిపోనున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐరోపా సమాఖ్యకు చెందిన కోపర్నికస్‌ క్లైమెట్‌ ఛేంజ్‌ సర్వీస్‌, ప్రపంచ వాతావరణ సంస్థ గురువారం పబ్లిష్‌ చేసిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించాయి.

ప్రకృతి పరిరక్షణ...అందరి బాధ్యత

లక్ష సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా వేడి వాతావరణం గత మూడు వారాల్లో నమోదైంది. ప్రపంచవ్యాప్తంగా గాలి ఉష్ణోగ్రతలను సేకరించి ఈ రికార్డులను తయారు చేశారు. ఈ ఏడాది జులై తొలి 23 రోజుల్లో సగటున 16.95 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రత నమోదైంది. ఇది 2019 జులైలో నమోదైన 16.93 రికార్డు కంటే ఎక్కువ. దాదాపు 1940 నుంచి ఈ డేటాను సేకరిస్తున్నారు. కానీ, కోపర్నికస్‌ సంస్థలోని చాలా మంది శాస్త్రవేత్తలు మాత్రం గత 1,20,000 ఏళ్లలోనే ఈ మాసాన్ని వేడి నెలగా చెబుతున్నారు. పురాతన ఉష్ణోగ్రతలను చెట్ల మానులోని వలయాలను, కోరల్‌ రీఫ్స్‌, సముద్ర గర్భం నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా లెక్కిస్తారు. ‘‘ఇవి మానవ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు’’ అని కోపర్నికస్‌ సంస్థ డిప్యూటి డైరెక్టర్‌ సమంత బర్గెస్‌ పేర్కొన్నారు.

ఈ సారి ఉత్తరార్ధ గోళంలో వేసవి ఎన్నడూ లేనంత స్థాయిలో ఉంది. దీంతో ఈ రికార్డులు బద్దలు కావడానికి ఇవి కారణం అయ్యాయి. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీల సెల్సియస్‌ దాటేసింది. వేడి కారణంగా మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగింది.

2023 భగభగ.. సముద్ర ఉపరితలం కూడా మరుగుతోంది..

ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో సగటు కంటే అధిక ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. జూన్‌లో కూడా ఎండలు మండిపోయాయి. చరిత్రలోనే అత్యధిక సగటు ఉష్ణోగ్రత ఈ నెల 6వ తేదీన నమోదైంది. నాడు ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.08 డిగ్రీల సెల్సియస్‌ (62.74 డిగ్రీల ఫారన్‌హీట్‌). ఇది చరిత్రలోనే అత్యధికం. వాస్తవానికి జులై 3 తర్వాత ఉష్ణోగ్రత రికార్డు బద్దలుకొడుతూ నమోదవుతోంది. ఈ ఏడాది మే నెలలో సముద్ర ఉపరితలంపై వేడి కూడా అసాధరణ స్థాయిలో నమోదైంది. వాస్తవానికి భవిష్యత్తులో ఈ ఉష్ణోగ్రతలను మించి నమోదయ్యే ప్రమాదం ఉందని బ్రౌన్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త కిమ్‌ కాబ్‌ పేర్కొన్నారు. రానున్న దశాబ్దంతో పోల్చుకొంటే ఇది కొంత చల్లటి సంవత్సరంగా చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావచ్చని తెలిపారు.

భూమి విధ్వంసక స్థితికి చేరుకొందని ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెర్రస్‌ పేర్కొన్నారు. 2023 జులై నెల ఉష్ణోగ్రతలు అన్ని రికార్డులను తుడిచి పెట్టేయనున్నాయన్నారు. వాతావరణ మార్పులు భయపెడుతున్నాయని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్‌ శకం ముగిసిందని.. గ్లోబల్‌ బాయిలింగ్‌ శకం మొదలైందని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని