Israel: దేశం దాటి వచ్చినా.. ఉలిక్కిపాటే! ఉక్రెయిన్‌ శరణార్థుల ఆవేదన

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో వేల మంది ఇజ్రాయెల్‌కు తరలివెళ్లారు. కాగా ప్రస్తుతం అక్కడ కూడా యుద్ధం కొనసాగుతుండటంతో మరోసారి బాంబుల మోత నడుమే జీవనం సాగిస్తున్నారు.

Updated : 21 Nov 2023 15:00 IST

జెరూసలెం: ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దండయాత్ర (Russia Invasion) లక్షల మందిని నిరాశ్రయుల్ని చేసింది. రష్యా సేనలు-ఉక్రెయిన్‌ బలగాల మధ్య భీకర పోరుతో ఉక్రెయిన్‌లోని అనేక నగరాలు సర్వనాశనమయ్యాయి. బాంబుల మోతతో దద్దరిల్లిన సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున ప్రజలు.. తీవ్ర గాయాల నడుమే పొరుగు దేశాలకు తరలిపోయారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ నుంచి ఇజ్రాయెల్‌కు శరణుకోరుతూ వచ్చిన వేల మందికి మరో యుద్ధం ముప్పుగా మారింది. ప్రస్తుతం ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య కాల్పుల మోత (Israel-Hamas Conflict) మునుపటి చేదు జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తున్నాయని ఉక్రెయిన్‌ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉక్రెయిన్‌ నుంచి వేల మంది..

ఫిబ్రవరి 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలుపెట్టింది. ఆ సమయంలో దాదాపు 45వేల మంది ఉక్రెయిన్‌ పౌరులు ఇజ్రాయెల్‌కు శరణార్థులుగా వచ్చినట్లు అక్కడి సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ పేర్కొంది. ఇలా ఇజ్రాయెల్‌కు వచ్చిన వారిలో ఎక్కువగా గాజాకు కొన్ని కి.మీ దూరంలోనే ఉన్న ఆష్కెలాన్‌ నగరంలో నివసిస్తున్నారు. వారు మునుపటి గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇదే సమయంలో హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన మెరుపుదాడి వారిలో మరోసారి కలవరం రేపింది. అనంతరం గాజాపై ఇజ్రాయెల్‌ జరుపుతోన్న ప్రతిదాడులతో వారుంటున్న ప్రాంతమంతా దద్దరిల్లుతుండటం నిత్యకృత్యంగా మారింది.

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంతో ఉక్రెయిన్‌పై ఎవరూ దృష్టి పెట్టట్లేదు: జెలెన్‌స్కీ

ఉక్రెయిన్‌ నుంచి తమకు ఈ భీకర శబ్దాలు మేరియుపోల్‌ మారణహోమాన్ని గుర్తుచేస్తున్నాయంటూ ఉక్రెయిన్‌కు చెందిన టట్యానా ప్రిమా అనే 38 ఏళ్ల మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మేరియుపోల్‌ భీకర దాడిలో తమ కుటుంబం రోడ్డున పడిందని.. తన భర్త చేయి కోల్పోయాడని అన్నారు. చివరకు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇజ్రాయెల్‌కు వచ్చామన్నారు. రష్యా దారుణాల నుంచి కోలుకుంటున్న తరుణంలోనే మళ్లీ ఇక్కడ మరో ముప్పును చూస్తున్నామన్నారు. తమ బిడ్డలకు సురక్షిత ఆశ్రయం కల్పించలేకపోతున్నామనే భయం తమని వెంటాడుతోందన్నారు. ఈ క్రమంలో కొందరు ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లిపోగా.. మరికొందరు మాత్రం మరోసారి స్థలం మారేందుకు నిరాకరిస్తున్నారని ప్రిమా పేర్కొన్నారు. ప్రతికూల పరిస్థితులకు అలవాటుపడే మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పారు.

బాంబులు, సైరన్ల మోత..

గాజాకు అతి సమీపంలో ఉన్న ఆష్కెలాన్‌ నగర వాసులపై ఇజ్రాయెల్‌-హమాస్‌ల యుద్ధం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఓవైపు రాకెట్లు, బాంబుల శబ్దాలు, మరోవైపు సైరెన్ల మోతతో తీర నగరం మారుమోగుతోంది. ఇప్పటివరకు అనేక రాకెట్లను ఐరన్‌ డోమ్‌ నిరోధిస్తున్నప్పటికీ.. సుమారు 80 రాకెట్లు ఆ ప్రాంతంలో పడినట్లు సమాచారం. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు గుమికూడకుండా స్థానిక అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇలా సంక్షోభం వేళ తమ సన్నిహితులను కలుసుకోవడం ఇబ్బందికరంగా మారిందని స్థానికులతోపాటు ఉక్రెయిన్‌వాసులు వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని