USA: ట్రూడో అనుకున్నదొకటి.. అయ్యిందొకటి: నిజ్జర్‌ ఊసెత్తని అమెరికా..!

భారత్‌-అమెరికా విదేశాంగ మంత్రుల భేటీ జరిగింది. ఈ సందర్భంగా వీరు మీడియాతో మాట్లాడే సమయంలో నిజ్జర్‌ పేరు ప్రస్తావించేందుకు కూడా అమెరికా మంత్రి బ్లింకెన్‌ ఇష్టపడలేదు. మరోవైపు త్వరలోనే జరగనున్న 2+2 భేటీకి రంగం సిద్ధం చేస్తున్నారు.  

Updated : 29 Sep 2023 17:22 IST

ఇంటర్నెట్‌డెస్క: నిజ్జర్‌ హత్య విషయంలో ఓ పక్క అమెరికా మద్దతు మాకే అని కెనడా (Canada) చెబుతున్నా.. ఆ విషయంపై బహిరంగంగా మాట్లాడేందుకు వాషింగ్టన్ ఇష్టపడటంలేదు. తాజాగా భారత (India) విదేశాంగ మంత్రి జైశంకర్‌.. అమెరికా (USA) విదేశంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక అంశాలపై చర్చించారు. కెనడాతో దౌత్యవివాదం తలెత్తిన తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశం ఇదే కావడంతో ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ భేటీపై జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. ‘‘నా మిత్రుడు, అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ కావడం సంతోషంగా ఉంది.  విస్తృత స్థాయి అంశాలు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించాం. త్వరలో జరగబోయే 2+2 భేటీకి సంబంధించిన అంశాలపై చర్చించాం’’ అని ఎక్స్‌ (ట్విటర్‌)లో పేర్కొన్నారు. అమెరికా విదేశాంగశాఖ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.

మరోవైపు ఈ సమావేశంపై అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ మాట్లాడుతూ ‘‘జీ20కి భారత్‌ నేతృత్వంలో లభించిన ఫలితాలు, ఇండియా-మిడిల్‌ఈస్ట్‌-యూరోప్‌ కారిడార్‌, అత్యున్నత శ్రేణి మౌలిక వసతులపై పెట్టబడులు వంటి అంశాలను మాట్లాడుకొన్నారు. భవిష్యత్తులో జరగబోయే 2+2 భేటీ కోసం ఇరు దేశాల మధ్య ముఖ్యంగా రక్షణ, స్పేస్‌, క్లీన్‌ ఎనర్జీ  రంగాల్లో సమన్వయం కొనసాగడం అవసరమని బలంగా విశ్వసిస్తున్నారు’’ అని వెల్లడించారు. ఇరు దేశాల మంత్రుల భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడింది. 2+2 భేటీ తేదీలను మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా ఏటా ఈ సమావేశం నవంబర్‌ తొలి అర్ధ భాగంలో జరుగుతుంది. ఈ సమావేశాల్లో ఇరు దేశాల విదేశాంగ, రక్షణశాఖ మంత్రులు పాల్గొంటారు.

నిజ్జర్‌పై నోరు మెదపని బ్లింకెన్‌..!

భారత్-అమెరికా విదేశాంగ మంత్రులు.. నిజ్జర్‌ హ్యవహారంపై గుంభనంగా వ్యవహరించారు. ఈ విషయం చర్చకు వచ్చిందా.. రాలేదా అనే విషయం కూడా వెల్లడించలేదు. దీనిపై అడిగిన ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ నిరాకరించారు. ‘‘నా మిత్రుడు, సహచరుడు జైశంకర్‌ను విదేశాంగశాఖ ప్రధాన కార్యాలయానికి ఆహ్వానించడం సంతోషంగా ఉంది. జీ20, ఐరాస జనరల్‌ అసెంబ్లీ వంటి చాలా అంశాలపై చర్చలు జరిగాయి’’ అని వెల్లడించారు. స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ట్రీటీ రూమ్‌లో జరిగిన ఫొటో సెషన్‌లో ఇరు దేశాల మంత్రులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జైశంకర్‌ మాట్లాడుతూ.. జీ20 సదస్సుకు సహకరించినందుకు అమెరికాకు ధన్యవాదాలు తెలిపారు. నిజ్జర్‌ హత్యపై అమెరికన్లు తమతోనే ఉన్నారని కెనడా ప్రధాని ట్రూడో ఓ పక్క ప్రకటించారు. కానీ, ఈ భేటీపై ప్రకటన సమయంలో ఆ ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. 

నిజ్జర్‌ విషయంలో అమెరికన్లు మాతోనే : జస్టిన్‌ ట్రూడో

అంతకు మందు జైశంకర్‌ అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్‌ సలీవాన్‌తో శ్వేత సౌధంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల బంధాన్ని ముందుకు తీసుకెళ్లడంపై చర్చించినట్లు జైశంకర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ఈ భేటీ అనంతరం అమెరికాలోని థింక్‌ ట్యాంక్‌ బృందాల సభ్యులతో, అమెరికా ట్రేడ్‌ ప్రతినిధి కేథరిన్‌ తాయ్‌తో భేటీ అయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని