Pentagon: హిరోషిమా కంటే 24 రెట్ల శక్తిమంతమైన అణుబాంబు!

హిరోషిమాపై ప్రయోగించిన బాంబుతో పోలిస్తే 24 రెట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేసే యోచనలో ఉన్నట్లు పెంటగాన్‌ (Pentagon) వెల్లడించింది.

Updated : 31 Oct 2023 18:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండో ప్రపంచ యుద్ధం (World War II) సమయంలో జపాన్‌లోని హిరోషిమా నగరంపై ప్రయోగించిన శక్తిమంతమైన అణుబాంబు వేల మందిని పొట్టనపెట్టుకోవడమే కాకుండా ఆ ప్రాంతాన్ని దశాబ్దాలపాటు కోలుకోనీయకుండా చేసింది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన దాడిగా ఇది నిలిచింది. ఈ క్రమంలో అంతకంటే మరింత బలమైన అణుబాంబును (Nuclear Bomb) తయారు చేసేందుకు అమెరికా సిద్ధమైంది. హిరోషిమాపై ప్రయోగించిన బాంబుతో పోలిస్తే 24 రెట్లు శక్తిమంతమైన అణుబాంబును తయారు చేసే యోచనలో ఉన్నట్లు పెంటగాన్‌ (Pentagon) ప్రకటించింది.

బీ61 కొత్త వేరియంట్‌ న్యూక్లియర్‌ గ్రావిటీ బాంబును తయారు చేయనున్నట్లు అమెరికా రక్షణశాఖ వెల్లడించింది. బీ61-13 పేరుతో దీన్ని రూపొందించనుంది. నేషనల్‌ న్యూక్లియర్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (NNSA) సహకారంతో ఈ  అణ్వాయుధాన్ని తయారు చేయనున్నట్లు పేర్కొంది. దీన్ని తయారు చేయాలనే నిర్ణయం ఒక్కసారిగా తీసుకోలేదని.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా మారుతున్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా దీని తయారీ అవసరమైందని తెలిపింది. ఇందుకు సంబంధించిన ఆమోదం, కేటాయింపు అంశం చట్టసభ ముందు పెండింగులో ఉన్నట్లు సమాచారం.

Hiroshima: అణుబాంబుకు ఆహుతై.. అగ్రరాజ్యాల సదస్సుకు వేదికై..!

నిరంతరం మారుతున్న ప్రపంచంలో అమెరికా మరింత శక్తిమంతంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు అమెరికా రక్షణశాఖ వెల్లడించింది. ఈ అణుబాంబుతో తమ దేశాన్ని సవాలు చేయాలనుకునే వారికి కష్టతరమే అవుతుందని పేర్కొంది. ఒకవైపు రష్యా దూకుడు, మరోవైపు 2030 నాటికి అణ్వాయుధాల సామర్థ్యాన్ని వెయ్యికిపైగా పెంచేందుకు చైనా సిద్ధమవుతోందనే వార్తల నేపథ్యంలో అమెరికా నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై (1945 ఆగస్టులో) ప్రయోగించిన బాంబు సుమారు 15 కిలో టన్నుల శక్తిని విడుదల చేయగా.. నాగసాకిపై విడిచిన బాంబు సామర్థ్యం 25 కిలోటన్నులు. కానీ, ప్రస్తుతం అమెరికా తయారు చేయనున్న ఈ బీ61-13 అణుబాంబు మాత్రం 360 కిలోటన్నుల శక్తిని ఉత్పత్తి చేయనున్నట్లు అంచనా. అంటే హిరోషిమాపై ప్రయోగించిన దానికంటే 24 రెట్లు ఎక్కువ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని