Hiroshima: అణుబాంబుకు ఆహుతై.. అగ్రరాజ్యాల సదస్సుకు వేదికై..!

రెండో ప్రపంచ యుద్ధకాలంలో (World War II) అణ్వాయుధ ప్రయోగంతో విధ్వంసానికి గురైన హిరోషిమా (Hiroshima) నగరం జీ7 దేశాల సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది.

Updated : 19 May 2023 16:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మానవ చరిత్రలో తొలిసారి అణుబాంబు (Nuclear Bomb) తీవ్రతను చవిచూసిన నగరంగా హిరోషిమా చరిత్రలో నిలిచిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం (World War II)లో ఈ అణుబాంబు విధ్వంసానికి వేల మందిని కోల్పోవడంతోపాటు దశాబ్దాల పాటు జపాన్‌ (Japan) పౌరుల మౌనవేదనకు మారుపేరుగా నిలిచిందీ నగరం. లక్షల కుటుంబాల్లో విషాదగాథకు సాక్ష్యంగా నిలిచిన ఆ ప్రదేశమే ఇప్పుడు అగ్రదేశాల సదస్సు (జీ7)కు వేదికయ్యింది. ఈ తరుణంలో 1945లో హిరోషిమాపై అణుబాంబు దాడి జరిగిన విషయాన్ని ఓసారి గుర్తుచేసుకుంటే..!

రెండో ప్రపంచ యుద్ధకాలంలో జపాన్‌లోని హిరోషిమా (Hiroshima) నగరంపై తొలిసారి అణుదాడి చేసింది. 1945ఆగస్టు 6న అమెరికా ఈ దాడి జరిపింది. అనంతరం మరో మూడు రోజులకు (ఆగస్టు 9) నాగసాకి (Nagasaki) నగరంపై రెండో అణుదాడి జరిగింది. అగ్రరాజ్యం ఆగ్రహానికి గురైన హిరోషిమా, నాగసాకిలపై ఈ దాడులతో రెండో ప్రపంచ యుద్ధానికి తెరపడింది! చుట్టూ కొండలు.. మధ్యలో చదునైన ప్రదేశంలో హిరోషిమా నగరం ఉంది. తాము తయారు చేసిన అణ్వాయుధాన్ని పరీక్షించడంతోపాటు భారీ నష్టాన్ని కలిగించడమే అమెరికా లక్ష్యం. అణ్వాయుధాన్ని సరైన ఎత్తులో ప్రయోగిస్తే.. నగరం మొత్తం నాశనం అవుతుందనే ఉద్దేశంతోనే ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

‘లిటిల్‌ బాయ్‌’తో..

అమెరికా తయారు చేసిన ఆ అణ్వాయుధానికి ‘లిటిల్‌ బాయ్‌’ (Little Boy) అని నిక్‌నేమ్‌ పెట్టారు. అమెరికా వాయుసేనకు చెందిన పైలట్‌ పాల్‌ టిబ్బెట్‌ దాని ప్రయోగానికి సిద్ధమయ్యారు. బోయింగ్‌ బీ-29 బాంబర్‌ విమానం ‘ఎనోలా గే’ (Enola Gay)ని నడిపించిన ఆయన.. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8.15 నిమిషాలకు హిరోషిమా నగరంపై ఆ అణుబాంబును జారవిడిచారు. ఈ క్రమంలోనే 15 కిలోటన్నుల టీఎన్‌టీ శక్తిని విడుదల చేస్తూ ‘లిటిల్‌బాయ్‌’ పేలిపోయింది. అక్కడ భూఉపరితల ఉష్ణోగ్రతలు సుమారు నాలుగు వేల డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు అంచనా. ఆ భారీ అణ్వాయుధం దెబ్బకు 70శాతం భవనాలు ధ్వంసమయ్యాయి. వాటి నుంచి వెలువడిన రేడియేషన్ ప్రభావం దశాబ్దాల పాటు ఆ నగరాన్ని వెంటాడింది. దాడి చేసిన 16 గంటల తర్వాత అది అణ్వాయుధమని అమెరికా ప్రకటించింది.

‘ఫ్యాట్‌మ్యాన్‌’ రూపంలో..

హిరోషిమాపై దాడి నుంచి తేరుకోకముందే.. ఆగస్టు 9న నాగసాకి నగరంపై ‘ఫ్యాట్‌మ్యాన్‌’(Fat Man)ను అమెరికా ప్రయోగించింది. ఫ్యాట్‌మ్యాన్‌ అనేది మరో అణుబాంబుకు పెట్టిన పేరు. లిటిల్‌ బాయ్‌ కంటే ఇది మరింత శక్తిమంతమైనది. అయినప్పటికీ కొంత తక్కువ విధ్వంసాన్ని సృష్టించింది. నాగసాకి నగరం చదునుగా కాకుండా, ఎత్తుపల్లాలుగా ఉండటంతో తక్కువ నష్టం వాటిల్లినట్లు చెబుతారు. ఇలా ఈ రెండు నగరాలపై జరిగిన అణుదాడిలో సుమారు మొత్తంగా 1.10 లక్షల నుంచి 2.10లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. హిరోషిమాలో పేలుడు సంభవించిన వెంటనే 80వేల మంది మృత్యువాతపడగా.. రేడియేషన్‌ దాటికి వేల మంది జీవచ్ఛవాలుగా మారారు. ఆ మారణహోమం నుంచి బతికి బయటపడిన వారు కూడా కొన్నేళ్ల తర్వాత క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల బారినపడ్డారు. ఆ దుర్ఘటన జరిగి 77 ఏళ్లు పూర్తైనప్పటికీ.. నాటి చేదు జ్ఞాపకాల నుంచి జపాన్‌ మాత్రం పూర్తిగా బయటపడలేదు.

అమెరికా ఏం చేసింది..?

రెండో ప్రపంచయుద్ధం సమయంలో మాన్‌హటన్‌ ప్రాజెక్టు పేరుతో అణ్వాయుధ సాంకేతికతను అమెరికా రహస్యంగా అభివృద్ధి చేసింది. బాంబు రూపకర్తల్లో ఒకరైన రాబర్ట్‌ ఒపెన్‌హైమెర్‌.. 1945 జులైలో దీనిని పరీక్షించారు. అనంతరం నెల తిరగకముందే.. ఈ ‘లిటిల్‌ బాయ్‌’ను ఆగస్టు 6న హిరోషిమాపై ప్రయోగించారు. మరుసటి బాంబును ఆగస్టు 9న నాగసాకిపై వేశారు. హిరోషిమాలో 70శాతం భవనాలు కూలిపోవడంతో సహాయక చర్యలకు ఆస్కారం లేకుండా పోయింది. ముఖ్యంగా నగరంలోని ఆస్పత్రులతో పాటు 90శాతం మంది వైద్యులు, నర్సులు ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా. 

జపాన్‌ నగరాల్లో తీవ్ర విషాదాన్ని నింపిన ఈ దాడుల అనంతరం అణ్వాయుధాల వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ జరిగింది. ఆ ఘటన తర్వాత ఎన్నో దేశాలు అణ్వాయుధాలను భారీగా సమకూర్చుకొన్నాయి. ఎన్నోసార్లు అణ్వాయుధాల ప్రయోగాస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాయి. అయినప్పటికీ ఇప్పటి వరకు ఏ దేశం కూడా వాటిని ఉపయోగించలేదు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం సందర్భంగా అణ్వాయుధాల ప్రయోగంపై మరోసారి చర్చ జరుగుతోన్న వేళ.. తీవ్ర విషాదాన్ని చవిచూసిన హిరోషిమా నగరం చేదు జ్ఞాపకాలతో అగ్రరాజ్యల సదస్సు (జీ7)కు వేదికగా మారింది. మూడు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని