Viral Video: అమెరికాలో తుపాకీతో మహిళ హల్‌చల్‌.. వీడియో వైరల్‌

న్యూయార్క్‌ సమీపంలోని నసౌ కౌంటీలో మంగళవారం ఓ మహిళ తుపాకీతో నడిరోడ్డుపై భయాందోళనలు సృష్టించింది. ఎదురుగా ఉన్నవారివైపు తుపాకీ చూపుతూ, గాలిలో కాల్చి హల్‌చల్‌ చేసింది. అనంతరం తన తలపై తుపాకీ ఎక్కుపెట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు చాకచాక్యంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Updated : 17 Aug 2023 08:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకీ పెరుగుతోంది. నిత్యం ఎక్కడో చోట కాల్పులు జరగడం, అమాయక పౌరులు మృతి చెందడమో, గాయాలపాలు కావడమో సర్వసాధారణ అంశంగా మారింది. న్యూయార్క్‌ సమీపంలోని నసౌ కౌంటీలో మంగళవారం ఓ మహిళ తుపాకీతో నడిరోడ్డుపై సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఎదురుగా ఉన్నవారికి తుపాకీ గురిపెడుతూ, గాలిలో కాల్చి హల్‌చల్‌ చేసింది. అనంతరం తన తలపైకే తుపాకీ ఎక్కుపెట్టుకుంది. ఈ క్రమంలో పోలీసులు అత్యంత చాకచాక్యంగా వ్యవహరించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో  నెట్టింట వైరల్‌గా మారింది. పెను ప్రమాదాన్ని తప్పించి సకాలంలో స్పందించిన పోలీసులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

నసౌ కౌంటీలోని నార్త్‌ బెల్మూరులో అక్కడి కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2.20 గంటలకు ఓ మహిళ తుపాకీతో రోడ్డుపై తిరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు వెంటనే మహిళ ఉన్న చోటుకు వెళ్లారు. అప్పటికే నడిరోడ్డుపై భారీగా వాహనాలు ఉన్నవేళ సదరు మహిళ ఒకసారి గాలిలోకి కాల్పులు జరిపింది. ఎదురుగా ఉన్న కార్లవైపు తుపాకీ ఎక్కుపెట్టి రోడ్డు దాటుతూ తన తలకే గురిపెట్టుకుంది. దీంతో పోలీసులు తమ వాహనంతో ఆమెను ఢీకొట్టి కిందపడేలా చేశారు. క్షణాల్లోనే ఆమెను చుట్టుముట్టి తుపాకీని తీసుకుని ఆమెను బంధించారు. దీంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో సదరు మహిళకు స్వల్పగాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, ఆమె విచిత్ర ప్రవర్తన, కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని