Walnut: నా జీతం మీ స్టార్టప్‌ కంటే ఎక్కువ.. సీఈవోకి మహిళా ఉద్యోగిని సమాధానం

అమెరికాకు చెందిన వాల్‌నట్‌ (Walnut) సీఈవో రోషన్‌ పటేల్‌ (Roshan Patel) ఎదురైన చేదు అనుభవం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. రెండేళ్ల క్రితం జరిగిన ఘటనను ఆయన తాజాగా ట్విటర్‌లో పోస్టు చేశారు.

Published : 27 Apr 2023 17:12 IST

ఇంటర్నెట్‌డెస్క్: సామాజిక మాధ్యమాల్లో చేసిన కొన్ని పోస్టులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. చాలా కాలం వాటిపై చర్చ కూడా జరుగుతుంది. అమెరికాకు (USA) చెందిన సాఫ్ట్‌వేర్‌ సంస్థ వాల్‌నట్‌ (Walnut) సీఈవో రోషన్‌ పటేల్‌కు (Roshan Patel) రెండేళ్ల క్రితం ఎదురైన చేదు అనుభవం తాజాగా ట్విటర్‌లో వైరల్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రోషన్‌ పటేల్‌ 2021లో ఓ స్టార్టప్‌ను ప్రారంభించాలనుకున్నారు. ఇందులో భాగంగా అప్పటికే వాల్‌నట్‌ సంస్థలోని సిబ్బంది కొంత మందిని షార్ట్‌లిస్ట్‌ చేశారు. అందులో ఓ మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను రోషన్‌ ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ చేశారు. ఆమెకు ఈ ఉద్యోగంలో చేరాలని ఉందో.. లేదో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

‘‘నేను ఓ స్టార్టప్‌ను ప్రారంభిస్తున్నాను. ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తక్కువ ధరలో అందించేందుకు వీలుగా ప్రారంభిస్తున్న స్టార్టప్‌ అది. దీని కోసం ప్రతిభావంతులైన ఇంజినీర్లను నియమించుకోవాలని చూస్తున్నాము. మీకు ఆసక్తి ఉందా?’’ అని రోషన్‌ ప్రశ్నించారు. కానీ, ఆ మహిళా ఉద్యోగిని చెప్పిన సమాధానంతో వెంటనే ఆయన ఇంటర్వ్యూను ముగించేశారు. ఇంతకీ ఆమె ఏం చెప్పారంటే.. ‘‘ హాయ్ రోషన్‌.. ఇప్పుడే క్రంచ్‌బేస్‌లో చెక్ చేశాను. నా ప్రస్తుత జీతం మీరు స్టార్టప్‌కు పెడుతున్న ప్రారంభ ఖర్చు కంటే ఎక్కువ.’’ అని బదులిచ్చారు. దీంతో కంగుతున్న రోషన్‌ ఆమెతో చాట్‌ను వెంటనే కట్‌ చేసేశారు. 

తాజాగా వారిద్దరి సంభాషణకు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను రోషన్‌ పటేల్‌ ట్విటర్‌లో పంచుకుంటూ.. ‘ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ఆలోచిస్తూనే ఉన్నా’ అని రాసుకొచ్చారు. దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తున్నాయి. మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వైఖరిని పలువురు మెచ్చుకుంటుండగా.. మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. సీఈవో స్థాయిలో ఉన్న వ్యక్తితో అలా మాట్లాడటం తగదని కామెంట్లు పెడుతున్నారు. అయితే, ఒక్క రోజు వ్యవధిలోనే ఈ పోస్టు వైరల్‌గా మారిపోయింది. ఇప్పటి వరకు 3 మిలియన్ల మంది దీనిని వీక్షించగా.. 24 వేలమంది లైక్స్‌ కొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని