White House: ధిక్కరించే సైనికులను చంపేస్తోంది..! రష్యాపై వైట్‌హౌస్‌ ఆరోపణలు

యుద్ధ క్షేత్రంలో ఆదేశాలను పాటించని సొంత సైనికులను రష్యా చంపేస్తోందని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ (White House) ఆరోపించింది.

Published : 27 Oct 2023 14:57 IST

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్య పేరుతో దాడులు మొదలుపెట్టిన రష్యా (Russia Invasion).. గడిచిన 20నెలలుగా భీకర యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. ఉక్రెయిన్‌ (Ukraine Crisis) కూడా దీటుగా స్పందిస్తోంది. ఈ క్రమంలో తమ ఆదేశాలను పాటించని సైనికులను రష్యా చంపేస్తోందని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ (White House) ఆరోపించింది. ఇందుకు సంబంధించిన సమాచారం తమ దగ్గర ఉందని అమెరికా వెల్లడించింది.

‘ఆదేశాలు పాటించేందుకు నిరాకరించిన సైనికులను రష్యా మిలటరీ చంపేస్తున్నట్లు మాకు సమాచారం ఉంది’ అని వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌పై ఫిరంగి దాడుల నుంచి వెనక్కి తగ్గాలని ప్రయత్నిస్తే.. ఆ యునిట్‌ మొత్తాన్ని చంపేస్తామని రష్యన్‌ కమాండర్లు హెచ్చరిస్తున్నారనే సమాచారం కూడా తమవద్ద ఉందన్నారు. సరైన శిక్షణ లేని, ఆయుధాలు లేని, యుద్ధానికి సిద్ధంగాలేని వారిని రష్యా సమీకరించిందని జాక్‌ కిర్బీ పేర్కొన్నారు.

ఆ యుద్ధజ్వాలల నుంచి అమెరికా తప్పించుకోలేదు: ఇరాన్‌ మంత్రి

పేలవ శిక్షణ పొందిన సైనికులను యుద్ధంలోకి పంపించి రష్యా తన వ్యూహాలను అమలు చేస్తోందని జాక్‌ కిర్బీ వెల్లడించారు. ఈ క్రమంలో సైనికులను ఉరితీస్తామని బెదిరించడం అనాగరికమని విమర్శించారు. ఇవన్నీ చూస్తుంటే రష్యా సైనిక నేతల పేలవ పనితీరుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న దాడులను ఖండించిన ఆయన.. కీవ్‌కు అవసరమైన సాయాన్ని అందజేస్తున్నామన్నారు. అమెరికా చేసిన ఈ ఆరోపణలపై అటు రష్యా రక్షణశాఖ, రాయబార కార్యాలయం నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

ఇదే సమయంలో అమెరికాలోని రష్యా రాయబారి అనాటోలి ఆన్‌టోనోవ్‌ టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ.. ఉక్రెయిన్‌కు ఆర్థిక ప్యాకేజీపైనే స్పందించారు. వైట్‌హౌస్‌ వ్యాఖ్యలపై నేరుగా స్పందించనప్పటికీ.. ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ముగించేందుకు బదులు అంతర్జాతీయ స్థాయిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అగ్నికి ఆజ్యం పోయడమేనన్నారు. ఇదిలాఉంటే, ఉక్రెయిన్‌ తూర్పు భాగంలో ఉన్న అవ్‌డివ్‌కా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా దళాలు ప్రయత్నిస్తున్నాయని ఉక్రెయిన్‌ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో రష్యా భారీ సైనిక నష్టాన్ని చవిచూసిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని