close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ప్రజాభిప్రాయానికి భిన్నంగావెళ్లొద్దు

లోపాల్ని ఎత్తిచూపినప్పుడు ప్రభుత్వం సరిదిద్దుకోవాలి
అయినా తప్పులు చేస్తుంటే ప్రజలు ప్రశ్నించాలి
సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట గోపాలగౌడ
వడ్డే శోభనాద్రీశ్వరరావు రాసిన ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం’ పుస్తకావిష్కరణ

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ వ్యవస్థ అంటే నియంతృత్వ పాలన కాదని.. ఎవరైనా రాజ్యాంగం ప్రకారం చట్టబద్ధంగా పాలించాల్సిందేనని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట గోపాలగౌడ అన్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రభుత్వాలు నడుచుకోవటం ఎంతమాత్రమూ సరికాదన్నారు.
ప్రభుత్వ విధానాల్లోని లోపాల్ని ఎత్తిచూపినప్పుడు వాటిని సరిదిద్దుకునే ఔదార్యం పాలకులకు ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇలాగే తప్పులు చేస్తే ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డాం’ పుస్తకావిష్కరణ కార్యక్రమం గురువారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. జస్టిస్‌ గోపాలగౌడ బెంగళూరు నుంచి ఆన్‌లైన్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ‘అనేక పంటలు పండే 33 వేల ఎకరాల భూముల్ని రాజధాని కోసం రైతుల నుంచి తీసుకున్నారు. వాటిలో సచివాలయం, హైకోర్టు సహా అనేక ప్రభుత్వ కార్యాలయ భవనాలు గత సర్కారు హయాంలోనే నిర్మాణమయ్యాయి. అలాంటి చోట నుంచి రాజధానిని తరలించేందుకు వీలు కల్పించే ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు రాజ్యాంగ సమ్మతంగా, చట్టబద్ధంగా లేవంటూ వడ్డే ఆయన పుస్తకంలో వివరంగా రాశారు. ఈ అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున ప్రస్తుతానికి దీనిపై ఏమీ మాట్లాడను. అమరావతి నుంచి రాజధాని తరలింపు నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రగతికి గొడ్డలిపెట్టు కాగలదని.. ప్రస్తుత సర్కారు వ్యవహార శైలీ, గత ముఖ్యమంత్రి తప్పిదాలు, మరో పార్టీ కపట నాటకాలు, మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల్ని గవర్నర్‌ ఆమోదించటం వంటి అంశాలన్నింటినీ పుస్తకంలో చక్కగా వివరించారు. దీన్ని చదివి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవాలి’ అని అన్నారు. పుస్తక రచయిత వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు చెల్లవన్నారు. జగన్‌ అండ్‌ కో విశాఖపట్నంలో ఉన్న తమ భూముల విలువను పెంచుకునేందుకే రాజధానిని అక్కడికి తరలిస్తున్నారన్నారు. ఇళ్లపట్టాల పేరిట.. ఏ రాష్ట్రంలో జరగని అవినీతి, భూ కుంభకోణం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోందని విమర్శించారు. టి.లక్ష్మీనారాయణ, వెలగపూడి గోపాలకృష్ణ ప్రసాద్‌ తదితరులు మాట్లాడారు.

జగన్‌ మోసగాడు అని రాస్తారు
ప్రతి ఇంట్లో తన ఫొటో ఉండాలని జగన్‌ చెబుతున్నారు. ఫొటో ఉంటుంది..దాని కింద జగన్‌ మోసగాడు అని రాసి ఉంటుంది. మూడు రాజధానులపై ఒక్కరోజులోనే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని, అసెంబ్లీలో ఆమోదించేశారు. ఇది ప్రజాస్వామ్యమా? రాయలసీమకు హైకోర్టులో ఒక ముక్కను ఇచ్చి రాజధాని అంటున్నారు. మేం పిచ్చోళ్లమా? మోదీకి, అమిత్‌షాకు చెప్పకుండా జగన్‌ ఒక్క నిర్ణయం కూడా తీసుకోవట్లేదు. అమరావతి 29 గ్రామాల ప్రజల సమస్య కాదు. అయిదు కోట్ల ప్రజల ఆత్మగౌరవ సమస్య.

-కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

రెండు, మూడేళ్లలో తిరుగుబాటు తథ్యం
రెండు మూడేళ్లలో వైకాపా ప్రభుత్వంపై జనం తిరగబడటం తథ్యం. మూడు రాజధానుల అంశం వైకాపాను కబళించేస్తుంది. అమరావతే రాజధాని అని 120 కేంద్ర సంస్థలు ఇక్కడ భూములు కొన్నాయి. ఎంతో మంది పెట్టుబడులు పెట్టారు.

- పి.మధు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి

న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు
తమకు అధికారం ఉన్నందున ఏమైనా చేయొచ్చని.. న్యాయస్థానాలు ఎలా అడ్డుపడతాయని ప్రభుత్వ, పాలకపక్ష నేతలు న్యాయస్థానాలపై విపరీతమైన దాడి చేస్తున్నారు. పాలన, శాసన వ్యవస్థలు చేసే ఏ కార్యక్రమాన్నయినా న్యాయస్థానాలు సమీక్షించొచ్చు. కనీస ఇంగితజ్ఞానం లేకుండా రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నప్పుడు కోర్టులు మౌనంగా ఉండవు.

- సుంకర రాజేంద్రప్రసాద్‌, సీనియర్‌ న్యాయవాది

జగన్‌తో భాజపా ఆడిస్తున్న నాటకమిది
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని అంశాల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అడగటం లేదు. వాటన్నీంటినీ మరుగున పడేసేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. పార్లమెంటులో చట్ట సవరణ చేయకుండా హైకోర్టు తరలింపు సాధ్యం కాదని భాజపా, వైకాపాలకు తెలిసినా ప్రజల్ని మోసం చేస్తున్నారు. రామ్‌మాధవ్‌ లాంటి నాయకులే రెండు రకాలుగా ప్రకటనలు చేస్తున్నారు. ఇదంతా భాజపా జగన్‌తో ఆడిస్తున్న నాటకం.

- టి.లక్ష్మీనారాయణ, సామాజికవేత్త

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.