పరీక్షలు రద్దు
close

ప్రధానాంశాలు

పరీక్షలు రద్దు

పదో తరగతి.. ఇంటర్మీడియట్‌ కూడా
సుప్రీంకోర్టు చెప్పిన గడువులోగా పరీక్షల ప్రక్రియ సాధ్యం కాదు
అందుకే రద్దు నిర్ణయం
మార్కుల మదింపునకు హైపవర్‌ కమిటీ ఏర్పాటు
మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడి
ఉత్కంఠకు తెర

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ప్రభుత్వం చేసిన ఏర్పాట్లతో తాము సంతృప్తి చెందకపోతే పరీక్షలకు అనుమతించబోమంటూ సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పిన నేపథ్యంలో.. విజయవాడలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పరీక్షల ప్రక్రియ మొత్తాన్ని జులై 31లోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఇంత తక్కువ సమయంలో పరీక్షలు నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాలు ఇవ్వడం సాధ్యం కానందున రద్దు చేస్తున్నామని వెల్లడించారు. పరీక్షల ప్రక్రియ మొత్తం పూర్తి చేసేందుకు 40 రోజులు, పరీక్షల షెడ్యూలు ప్రకటనకు ముందు విద్యార్థులకు 15 రోజుల సమయం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి నిర్ణయలోపం లేదని, అన్ని నిబంధనలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు ప్రయత్నించామని తెలిపారు. విద్యార్థులు నష్టపోవద్దనే పరీక్షల రద్దు నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇంటర్‌ ఫలితాల తర్వాతే గ్రాడ్యుయేషన్‌ ప్రవేశాలు నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించిందని, ఇతర బోర్డులు పరీక్షలను రద్దు చేసినందున రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరగదని భావిస్తున్నామని అన్నారు. ఫలితాల విడుదలపై విధివిధానాలు రూపొందించేందుకు హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. మార్కుల మదింపు ఎలా చేయాలన్నదానిపై పది రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం సూచించినట్లు పేర్కొన్నారు.

మొదటి ఏడాది, ప్రాక్టికల్‌ మార్కుల ఆధారంగా..

రెండో ఏడాది విద్యార్థులకు మొదటి సంవత్సరం మార్కులు, ప్రాక్టికల్‌ మార్కులను ప్రామాణికంగా తీసుకుని మార్కులు కేటాయించే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్‌ పరీక్షలను మే 5 నుంచి నిర్వహించేందుకు మొదట ఇంటర్‌ విద్యామండలి షెడ్యూలు విడుదల చేసింది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరగడంతో పరీక్షలను వాయిదా వేసింది. తర్వాత జులై మొదటివారంలో నిర్వహించాలని భావించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో తాజాగా రద్దుచేశారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు 5,12,959 మంది ఉండగా.. ద్వితీయ సంవత్సరం వారు 5,19,510 మంది ఉన్నారు.

పదిలో గ్రేడ్లు..

పదో తరగతిలో విద్యార్థులకు గ్రేడ్లు ఇవ్వనున్నారు. మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇస్తే ట్రిపుల్‌ఐటీ లాంటి సంస్థల్లో ప్రవేశాలకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాల్సి అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. గతేడాది పరీక్షలను రద్దు చేసినా, విద్యార్థులకు ఎలాంటి మార్కులు, గ్రేడ్లు ఇవ్వలేదు. ఉత్తీర్ణులైనట్లు మాత్రమే పేర్కొంటూ మార్కుల జాబితాను విడుదల చేశారు. పరీక్షలను జూన్‌ 7 నుంచి నిర్వహించేందుకు మొదట షెడ్యూలు ప్రకటించారు. 11 పేపర్లను ఏడుకు కుదించారు. కరోనా కారణంగా పరీక్షలను వాయిదా వేయగా.. ఇప్పుడు రద్దుచేశారు. ఈ ఏడాది 11,752 ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు 6,28,359 మంది ఉన్నారు. వీరిలో బాలురు 3,23,339 మంది, బాలికలు 3,05,020 మంది ఉన్నారు.


ఉత్కంఠ వీడింది..

రీక్షలు ఉంటాయా? రద్దవుతాయా? అనేదానిపై దాదాపు ఒకటిన్నర నెలలుగా తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలా? లేదంటే పై తరగతుల సబ్జెక్టులు చదువుకోవాలో అర్థం కాక కొంత ఒత్తిడికి గురయ్యారు. పదో తరగతి విద్యార్థులు ఇంటర్‌లో చేరడంతో ఇప్పటికే జేఈఈ పాఠ్యాంశాలపై ఆన్‌లైన్‌ తరగతులు కొనసాగుతున్నాయి. రోజువారీ పరీక్షలు ఒక పక్క, పది పరీక్షలు ఎప్పుడు ఉంటాయో అనే ఒత్తిడి మరో పక్క కొనసాగింది. ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది విద్యార్థులు ఎంసెట్‌, జేఈఈ లాంటి పోటీ పరీక్షలు, అకడమిక్‌ పరీక్షలకు రెండింటినీ సమన్వయం చేసుకోవడంలో కొంత ఒత్తిడికి గురయ్యారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని