50,376 వద్ద నిరోధం!
close

Published : 10/05/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

50,376 వద్ద నిరోధం!

సమీక్ష: సానుకూల అంతర్జాతీయ సంకేతాలు, కంపెనీల పటిష్ఠ ఫలితాల అండతో గతవారం మార్కెట్లు లాభపడ్డాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఆర్‌బీఐ ప్రకటించిన చర్యలు మెప్పించాయి. కొవిడ్‌-19 కేసులు, స్థానిక లాక్‌డౌన్‌లపై భయాలను ఇవి తగ్గించాయి. ఏప్రిల్‌లో జీఎస్‌టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ.1,41,384 కోట్లుగా నమోదయ్యాయి.  తయారీ పీఎంఐ 55.5కు చేరింది. కంపెనీల త్రైమాసిక ఫలితాలతో షేరు/రంగం ఆధారిత కదలికలు మార్కెట్లను నడిపించాయి. బ్యారెల్‌ ముడిచమురు ధర 1.5 శాతం పెరిగి 68.3 డాలర్లకు చేరగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.5కు బలపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో నాస్‌డాక్‌, హాంగ్‌సెంగ్‌ మినహా అన్ని ప్రధాన సూచీలు రాణించాయి. కంపెనీల ఫలితాలు, అంచనాలకు మించిన ఆర్థిక రికవరీ, అమెరికా, చైనా గణాంకాలు ప్రపంచ మార్కెట్లకు సానుకూలతలు తెచ్చిపెట్టాయి. మొత్తం మీద ఈ పరిణామాలతో గత వారం సెన్సెక్స్‌ 0.9 శాతం లాభంతో 49,206 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 1.3 శాతం పెరిగి 14,823 పాయింట్ల దగ్గర స్థిరపడింది.
లోహ, బ్యాంకింగ్‌, విద్యుత్‌ షేర్లు రాణించాయి. మన్నికైన వినిమయ వస్తువులు, స్థిరాస్తి స్క్రిప్‌లు నీరసపడ్డాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐలు) నికరంగా రూ.5,093 కోట్ల షేర్లను విక్రయించగా, డీఐఐలు రూ.2,135 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. కొవిడ్‌ రెండో దశ నేపథ్యంలో ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు నికరంగా రూ.5,936 కోట్లు ఉపసంహరించుకున్నారు.

లాభపడ్డ, నష్టపోయిన షేర్ల నిష్పత్తి 4:3గా నమోదు కావడం..
పెద్ద షేర్లలో కొనుగోళ్లను సూచిస్తోంది.

ఈవారంపై అంచనా: 48000 పాయింట్ల వద్ద మద్దతు తీసుకున్న మార్కెట్‌ వరుసగా రెండో వారం రాణించింది. స్వల్పకాలంలో సెన్సెక్స్‌కు ఇది కీలక స్థాయిగా నిలవనుంది. ఒకవేళ నష్టాలొస్తే.. 48000 స్థాయి తక్షణ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు 50,376 వద్ద తక్షణ నిరోధం, దీన్ని అధిగమిస్తే 51000 పాయింట్ల వద్ద మరో అడ్డంకి ఎదురుకావొచ్చు.
ప్రభావిత అంశాలు: అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలకు అనుగుణంగా దేశీయ సూచీలు కదలాడొచ్చు. కరోనా కేసుల విజృంభణ కొనసాగడం, పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లకు మొగ్గుచూపడం లేదా పొడిగించడం మదుపర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపొచ్చు. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి వల్ల భారత జీడీపీ అంచనాలను అంతర్జాతీయ సంస్థలు తగ్గిస్తున్నాయి. ఇవీ సెంటిమెంట్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉంది. దేశీయంగా చూస్తే.. మార్చి పారిశ్రామికోత్పత్తి, ఏప్రిల్‌ రిటైల్‌, టోకు ద్రవ్యోల్బణ గణాంకాల నుంచి సంకేతాలు పొందొచ్చు. పారిశ్రామికోత్పత్తి మెరుగ్గా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ వారం ఏషియన్‌ పెయింట్స్‌, ఎల్‌ అండ్‌ టీ, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, ఎస్కార్ట్స్‌, అపోలో టైర్స్‌, టాటా పవర్‌, యూపీఎల్‌, లుపిన్‌, సీమెన్స్‌, వోల్టాస్‌, జేఎస్‌పీఎల్‌, వోల్టాస్‌ వంటి దిగ్గజ సంస్థలు ఫలితాలు వెలువరించనున్నాయి. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో షేరు ఆధారిత కదలికలు చోటుచేసుకోవచ్చు. అంతర్జాతీయంగా చూస్తే..  అమెరికా ద్రవ్యోల్బణం, రిటైల్‌ విక్రయాలు, పారిశ్రామికోత్పత్తి, చైనా ఏప్రిల్‌ ద్రవ్యోల్బణం, యూరో ఆర్థిక సెంటిమెంట్‌ సూచీ,    యూరో పారిశ్రామికోత్పత్తి, బ్రిటన్‌ జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. దేశీయంగా కార్పొరేట్‌ ఫలితాలు కీలకం కానున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి కదలికలు, ముడిచమురు ధరలు, ఎఫ్‌ఐఐ పెట్టుబడుల నుంచి కూడా సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడొచ్చు.

తక్షణ మద్దతు స్థాయులు: 48,614, 48,028, 47,200
తక్షణ నిరోధ స్థాయులు: 49,840, 50,376, 51,000
స్వల్పకాలంలో సెన్సెక్స్‌కు 50,376 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు.

- సతీశ్‌ కంతేటి, జెన్‌ మనీ


Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని