సంక్షిప్తంగా
close

Updated : 25/10/2021 04:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంక్షిప్తంగా

రాబోయే త్రైమాసికాల్లో బలమైన వృద్ధి
రికవరీ రాణిస్తోంది: పీహెచ్‌డీసీసీఐ

దిల్లీ: ఆర్థిక రికవరీ రాణిస్తున్న నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో భారత జీడీపీ వృద్ధి రేటు బలంగా నమోదు కాగలదని పరిశ్రమ సంఘం పీహెచ్‌డీసీసీఐ పేర్కొంది. మొత్తం 12 ప్రధాన ఆర్థిక, వ్యాపార సంకేతాలను పరిశీలించగా.. సెప్టెంబరు 2021లో అందులో వృద్ధి బాటలో పయనించినవి తొమ్మిదికి పెరిగాయి. ఆగస్టులో ఇవి ఆరు మాత్రమేనని ఆ సంఘం తెలిపింది. అయితే ఈ సమయంలో అధిక కమొడిటీ ధరలు, ముడి పదార్థాల కొరత వంటి సమస్యలను పరిష్కరిస్తే వినియోగం, ప్రైవేటు పెట్టుబడులకు ఊతం ఇచ్చినట్లు అవుతుందని వివరించింది. జీఎస్‌టీ వసూళ్లు, స్టాక్‌మార్కెట్‌, యూపీఐ లావాదేవీలు, ఎగుమతులు, మారక రేటు, ఫారెక్స్‌ నిల్వలు, సీపీఐ ద్రవ్యోల్బణం, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబరులో రాణించాయి. నిరుద్యోగ రేటు  8.3 శాతం నుంచి 6.9 శాతానికి తగ్గిందని చెప్పుకొచ్చింది. అంతక్రితం ఏడాది తక్కువ ప్రాతిపదిక కారణంగా 2021-22 తొలి త్రైమాసికంలో 20.1 శాతం వృద్ధి నమోదైన సంగతి తెలిసిందే.


శీతాకాల సమావేశాల్లోనే 2 కీలక ఆర్థిక బిల్లులు!

దిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీలు) ప్రైవేటీకరిస్తామని గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రతిపాదిత చట్టానికి సంబంధించిన బిల్లు సహా పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికారిక (పీఎఫ్‌ఆర్‌డీఏ) చట్టం-2013 సవరణలకు సంబంధించిన కీలక ఆర్థిక బిల్లుల్ని శీతాకాల సమావేశాల్లో ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. పీఎస్‌బీల ప్రైవేటీకరణ కోసం బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం-1949కు చేసే సవరణలకు ఆమోదం తెలుపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్‌) ట్రస్టును పీఎఫ్‌ఆర్‌డీఏ నుంచి విడదీసేందుకు వీలుగా చట్టానికి సవరణలు చేయనున్నట్లు సమాచారం.


* వినియోగించిన (యూజ్డ్‌) కార్ల విక్రయానికి అవసరమైన నిరభ్యంతర పత్రం (ఎన్‌ఓసీ) జారీకి తమకు అనుమతి లభించిందని ప్రభుత్వం ప్రాయోజితం  చేస్తున్న సీఎస్‌ఈ ఇ-గవర్నెన్స్‌ ఇండియా (సీఎస్‌సీ ఎస్‌పీవీ) వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఈ సేవను అందించేందుకు జాతీయ నేర రికార్డుల బ్యూరోతో (ఎన్‌సీఆర్‌బీ) భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది.

* వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022-23) తొలి విద్యుత్‌ ఉత్పత్తిని విడుదల చేయడం ద్వారా విద్యుత్‌ వాహన (ఈవీ) విభాగంలోకి అడుగుపెట్టాలనుకుంటున్నట్లు హోండా మోటార్‌సైకిల్‌ ప్రెసిడెంట్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ అత్సుషి ఒగాటా వెల్లడించారు.

* దేశీయ విపణిలో తమ ఉత్పత్తుల్ని మరింత బలోపేతం చేసేందుకు అపోలో టైర్స్‌ సిద్ధమైంది. తమ యూరోపియన్‌ టైర్‌ బ్రాండ్‌ వ్రెడెస్టీన్‌ను ప్రీమియం కార్లు, సూపర్‌బైక్‌ల విభాగానికి అందించడానికి దేశంలో ప్రవేశపెట్టింది. 

* సెప్టెంబరులో మన దేశంలో 16,570 కొత్త కంపెనీలు రిజిస్టర్‌ అయ్యాయని కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం క్రియాశీలక కంపెనీలు 14.14 లక్షలకు పైగా చేరినట్లు పేర్కొంది. సెప్టెంబరు 30 నాటికి దేశంలో నమోదై, తర్వాత మూసివేసిన కంపెనీలు 7,73,070కు చేరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

* యాంగ్లియాన్‌ ఒమేగా గ్రూప్‌ అనుబంధ సంస్థ ఒమేగా సైకీ మొబిలిటీ వేగంగా వృద్ధి చెందుతున్న డ్రోన్‌ విపణిలోకి ప్రవేశించేందుకు రూ.75 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు గ్రూప్‌ ఛైర్మన్‌ ఉదయ్‌ నారంగ్‌ తెలిపారు.

* సెప్టెంబరు త్రైమాసికంలో బలమైన వృద్ధి నమోదు చేసిన పానసోనిక్‌ ఈ పండుగల సీజన్‌లో విక్రయాలు అధికంగా నమోదవుతాయని ఆశాభావంతో ఉంది. అందుకే రూ.300 కోట్లు పెట్టుబడి పెట్టి పీఎల్‌ఐ పథకం కింద కంప్రెషర్లు, హీట్‌ ఎక్స్ఛేంజర్లను ఉత్పత్తి చేస్తామని పానసోనిక్‌ ఇండియా ఛైర్మన్‌, సీఈఓ మనీశ్‌ శర్మ వెల్లడించారు.

* భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ల తదుపరి దశలో భాగంగా డిసెంబరు నాటికి రూ.10,000 కోట్లకు పైగా నిధుల్ని సమీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ అధికారి వెల్లడించారు.

* వీడియోకాన్‌ టెలీకమ్యూనికేషన్స్‌కు చెందిన ఇద్దరు మాజీ ఉద్యోగుల ఆస్తులు, బ్యాంక్‌ ఖాతాల జప్తు విషయంలో వారి వాదనలు వినే అవకాశం కల్పించాలని ఎన్‌సీఎల్‌టీకి అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) సూచించింది.

*  గత సెప్టెంబరు త్రైమాసికంలో తమ మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫామ్‌ కూ వినియోగదార్లు 50 లక్షల మంది కొత్తగా పెరగడంతో మొత్తం సంఖ్య 1.5 కోట్లు అధిగమించిందని సహ వ్యవస్థాపకులు రాధాకృష్ణ వెల్లడించారు. 2022 జూన్‌ తర్వాత ఆగ్నేయాసియాలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

*  ఫిన్‌టెక్‌ ఐటీ సంస్థ క్లియర్‌ (క్లియర్‌ ట్యాక్స్‌) సిరీస్‌ సి ఫండింగ్‌లో భాగంగా 75 మిలియన్‌ డాలర్లు (రూ.562 కోట్లు) సమీకరించినట్లు తెలిపింది. కోరా క్యాపిటల్‌ సహా స్ట్రైప్‌, అలుయా క్యాపిటల్‌, థింక్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రస్తుతం పెట్టుబడులు చొప్పించాయి.

* ముడి పదార్థాల వ్యయాలు బాగా పెరగడంతో ఒక టన్ను ఉక్కు ఉత్పత్తికి జులై-సెప్టెంబరు త్రైమాసికంలో వ్యయం 19 శాతం (రూ.6,600) మేర పెరిగిందని, దీంతో ఉక్కు ఉత్పత్తులపై సర్‌ఛార్జిని విధించడానికి సిద్ధమవుతున్నామని జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ వెల్లడించింది.


Advertisement

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని