Nani: ‘బిగ్‌బాస్‌’ చేసిన సంవత్సరం.. నిందలు ఎదుర్కొవాల్సి వచ్చింది - nani interview about tuck jagadeesh
close
Published : 09/09/2021 20:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nani: ‘బిగ్‌బాస్‌’ చేసిన సంవత్సరం.. నిందలు ఎదుర్కొవాల్సి వచ్చింది

తెలుగు ప్రేక్షకులకి.. పండగ సినిమాలకీ విడదీయరాని బంధముంది. పండగొచ్చిందంటే చాలు ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్‌లో వచ్చి వాలిపోతుంటారు. కొత్త చిత్రాల్ని మనసారా ఆస్వాదించి, ఆశీర్వదించి వెళ్తుంటారు. ఈసారి ఆ పండగ సినీ వినోదాన్ని ‘టక్‌ జగదీష్‌’తో నేరుగా సినీప్రియుల ఇంటికే తీసుకొస్తున్నారు కథానాయకుడు నాని. శివ నిర్వాణ తెరకెక్కించిన కుటుంబ కథా చిత్రమిది. వినాయక చవితి సందర్భంగా శుక్రవారం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు నాని. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

ఈ పండక్కి... టక్‌ జగదీష్‌

‘‘చిన్నప్పుడు పండగ వేళ థియేటర్లలో సినిమా చూసిన రోజుల్ని.. ఇప్పుడు పండగ వేళ ఓటీటీలో సినిమా వస్తున్న రోజుల్ని చూస్తుంటే ప్రపంచం చాలా మారిపోయిందనిపిస్తోంది. కానీ, ఇప్పటికీ పండగంటే అదే ఉత్సాహం, జోష్‌ కనిపిస్తోంది. నేను నటుడిగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి పండగ రిలీజ్‌ నాకు ఒక్కటీ దొరకలేదు. ఓ పండగని లక్ష్యం చేసుకొని.. ఆరోజే సినిమా తీసుకురావాలని నిర్మాతని ఒత్తిడి చేయడం నాకు నచ్చదు. బాక్సాఫీస్‌ ముందుకు ఎప్పుడొచ్చినా మామూలు రోజుల్లోనే వచ్చా. బ్లాక్‌బస్టర్‌లు అందుకున్నాను. గతేడాది ఉగాది పండక్కి ‘వి’ సినిమాతో వచ్చే అవకాశం దొరికింది. ఈలోపు కరోనా పరిస్థితుల వల్ల మా ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. అంతకు ముందు ‘గ్యాంగ్‌లీడర్‌’ను వినాయక చవితికి తీసుకురావాలనుకున్నాం. అదే సమయంలో ‘సాహో’ వస్తుండటంతో మా చిత్రం వాయిదా వేసుకున్నాం. ఎట్టకేలకు ఈ ఏడాది థియేటర్లో కుదరకున్నా.. ఓటీటీ వేదికగా ‘టక్‌.. జగదీష్‌’ చిత్రంతో ఓ పండగ బరిలో నిలిచే అవకాశం దొరికింది. చాలా సంతోషంగా ఉంది’’.

ఎక్కడున్నా.. కచ్చితంగా కథ వినాల్సిందే..

‘‘వినాయక చవితి వచ్చిందంటే చాలు.. మా ఇంట్లో చాలా సందడిగా ఉంటుంది. నేనే స్వయంగా అమీర్‌పేటకు వెళ్లి మట్టి గణపతిని, పూజా సామగ్రిని తీసుకొచ్చేవాడ్ని. అమ్మ వినాయక వ్రతకల్పం చదువుతుంటే.. నేను, అక్క కలిసి గణేశుడిపై పూలు వేసేవాళ్లం. పండగ రోజు ఈ కథ విని, అక్షింతలు వేసుకోకపోతే నీలాపనిందలు పాలవుతామని చిన్నప్పుడు అమ్మ చెప్పింది. ఆ భయం నా మనసులో నాటుకుపోయింది. అందుకే ప్రతి పండక్కి కచ్చితంగా కథ విని, అక్షింతలు వేసుకుంటూ వస్తున్నా. పెద్దయ్యాక ఈ నమ్మకాలు కాస్త తగ్గుతాయి కదా. అలా తగ్గి, అనుకోకుండా ఓ ఏడాది కుదరక వదిలేశా. అదెప్పుడో కాదు.. ‘బిగ్‌బాస్‌’ చేసిన సంవత్సరమే. ఆ ఏడాది చాలా నిందలు ఎదుర్కొవాల్సి వచ్చింది (నవ్వుతూ). అప్పుడనిపించింది.. ‘అమ్మ చెప్పింది నిజమే.. ఇక నుంచి కచ్చితంగా కథ విని, అక్షింతలు వేసుకోవాల్సిందేన’ని నిర్ణయించుకున్నా. అప్పటి నుంచి నేను అమెరికాలో ఉన్నా.. మంచు పర్వతాల్లో ఉన్నా పండగ రోజు ఏదోలా కథ విని, అక్షింతలు వేసేసుకునే వాడ్ని. లేదంటే టెన్షన్‌ వచ్చేసేది (నవ్వుతూ). ఇప్పుడిప్పుడే మా అబ్బాయి జున్నుకి అన్నీ తెలుస్తున్నాయి. వాడు పూజల్ని బాగా ఇష్టపడతాడు. నిజానికి పిల్లలెవరైనా పూజలంటే పారిపోతారు. వాడు మాత్రం ముందుకొచ్చి కూర్చుంటాడు. ఇంకో విషయం ఏంటేంటే.. వాడు నా సినిమాలు చూసి చాలా సిగ్గుపడిపోతుంటాడు. ఒకవేళ ఆ చిత్రంలో నేనెవరైనా హీరోయిన్‌తో కనిపిస్తే మాత్రం వాడికి నచ్చదు. వాళ్లమ్మతోనే ఉండాలనేది వాడి ఫీలింగ్‌ (నవ్వుతూ).

‘మీట్‌ క్యూట్‌’తో అలా మొదలైంది..

‘‘దీప్తి అక్క నా ఫ్యాన్‌ అంతే. ఇండస్ట్రీలోకి రావాలన్న ఆలోచన తనకెప్పుడూ లేదు. అయితే రైటింగ్‌ అంటే తనకి చాలా ఇష్టం. అప్పుడప్పుడు తన ఆలోచనల్ని పేపర్‌పై పెడుతుంటుంది. అలా రాసినవి నాకు పంపిస్తుంటుంది. ఓరోజు నాకు ఫోన్‌ చేసి ఒక స్క్రిప్ట్‌ రాయాలనుకుంటున్నా.. ఏం చేయాలి అంది. సరే ఆన్‌లైన్‌లో హాలీవుడ్‌ స్క్రిప్ట్స్‌ ఉంటాయి.. వాటిని చూడు ఓ అవగాహన వస్తుందని చెప్పా. అలా వాటిని చూసి స్క్రిప్ట్‌ రైటింగ్‌ నేర్చుకుని.. ఓ ఆంథాలజీ రాసింది. అది చదివి, ఎలా ఉందో చెప్పమని నాకు పంపింది. కానీ, నేను పట్టించుకోలేదు. మనం మన ఇంట్లో అక్కల్ని, చెల్లెళ్లని, తమ్ముళ్లని తక్కువ అంచనా వేస్తాం కదా.. నేనూ అలాగే లైట్‌ తీసుకున్నా. ఓరోజు మా కజిన్స్‌ ఫోన్‌ చేసి.. ‘దీప్తీ స్క్రిప్ట్‌ చదివావా? ఎంత బాగా రాసిందో.. అదిరిపోయింద’న్నారు. సర్లే అంతగా ఏం రాసిందోనని నేనూ చదివా. చాలా అందంగా.. ఓ గొప్పగా కథ రాసినట్లనిపించింది. వెంటనే ఇదే విషయాన్ని ఫోన్‌ చేసి తనకి చెప్పా. చాలా హ్యాపీగా ఫీలైంది. ఆ స్క్రిప్ట్‌ నీకేమన్నా పనికొస్తే వాడుకోమంది. ఇంత మంచి కథ రాశావు.. నువ్వే దీన్ని తెరకెక్కించాలని చెప్పా. నాకేం తెలియదు.. నా వల్ల కాదంది. లేదు.. నీకు మంచి టీమ్‌ని ఇస్తా, నువ్వు ఏం రాశావో అది వాళ్లకి చెప్పు చాలు.. ఓ వారంలో నీకు మొత్తం అర్థమైపోతుందని చెప్పా. అలా ‘మీట్‌ క్యూట్‌’ని పట్టాలెక్కించాం. నాకు తెలిసి అది విడుదలయ్యాక.. తన వెనక చాలా ఆఫర్లుంటాయి. నాకైనా ఛాన్స్‌ ఇస్తుందో.. లేదో చూడాలి (నవ్వుతూ).

ఆమిర్‌ ఖాన్‌ అడిగారు.. కానీ!

‘‘బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వచ్చాయి కానీ, ఆసక్తిరేకెత్తించే కథ దొరకలేదు. రెండు నెలల క్రితం ‘లాల్‌సింగ్‌ చద్దా’ సినిమా కోసం ఆమిర్‌ ఖాన్‌ ఫోన్‌ చేశారు. డేట్స్‌ కుదరలేదు. ప్రస్తుతం తెలుగులోనే వరుస సినిమాలతో బిజీగా ఉన్నా. భవిష్యత్తులో ఏదైనా మంచి కథ కుదిరితే.. ఓ ఆర్నెల్లు గ్యాప్‌ తీసుకుని అటు వైపు ప్రయత్నించాలి. నిజానికి నాకు తెలుగులో ఉన్నంత కంఫర్ట్‌ హిందీలో ఉండదు. అదే ఆ భాషపై మంచి పట్టుంటే అది వేరేలా ఉంటుంది. ఎంచుకున్న కథకీ వందశాతం న్యాయం చేయగలుగుతాం. భాష రాలేదంటే.. యాభై శాతమే న్యాయం చేయగలుగుతాం’’.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని