కుళ్లుతున్న శవపరీక్షలు   - Nizamabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

ప్రధానాంశాలు

కుళ్లుతున్న శవపరీక్షలు  

ఆరుబయట, వరండాల్లోనే కానిచ్చేస్తున్నారు

నివేదికల పారదర్శకతపై అనుమానాలు

బాధితులకు మరింత బాధ కలిగించేలా వ్యవహారం

న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

శవపరీక్షల తీరు ఎక్కడో ఒక చోట వివాదాస్పదమవుతూనే ఉంది. ఒక వ్యక్తి జీవించి ఉనప్పుడు ఎలా చూసినా.. చనిపోయాక అయ్యో పాపం అనే భావజాలం మనది. కొన్ని ఘటనల్లో శవ పరీక్ష తీరు బాధిత కుటుంబాలను కలచి వేసేలా ఉంటోంది.శవగారాల్లో వసతులపై యంత్రాంగం దృష్టి సారించడంలేదు. జనాభాతోపాటే మరణాల సంఖ్య పెరుగుతోంది. ఆత్మహత్యలు, రోడ్డుప్రమాదాలు, అనుమానాస్పద మృతి కేసులు రెట్టింపవుతున్నాయి. అందుకు అనుగుణంగా గదుల ఆధునికీకరణ చేపట్టడంపై దృష్టి సారించడంలేదు. దశాబ్దాల కిందట నిర్మించిన గదుల్లో చేస్తున్న పరీక్షల నివేదికల్లో నాణ్యత ప్రశ్నార్థకమే. ఉభయ జిల్లాల్లో ఒక వైద్య కళాశాల అనుబంధ ఆస్పత్రిలో తప్పితే ఎక్కడా ప్రమాణాలు పాటించడంలేదు.

అపరిశుభ్రంగా పరీక్ష టేబుల్‌

బోధన్‌ ఘటనే ఉదాహరణ

గదుల కొరతకు బోధన్‌ ఘటనే నిదర్శనం. వెంటవెంటనే మూడు మృతదేహాలు వచ్చాయి. మొదట వచ్చిన దాన్ని పరీక్షల బల్లపై పెట్టారు. మరొకటి అక్కడే కింద వేశారు. మూడో దానికి స్థలం లేకపోవడంతో వరండాలో పెట్టారు. ఇక్కడ 2002లో నిర్మించిన శవగారాన్ని వినియోగిస్తున్నారు. అందులో ఒకటి పరీక్ష గది. మరొకదానిలో ఫ్రీజర్లు ఏర్పాటు చేశారు. ఒకేఒక్క బల్ల ఉండటంతో ఎక్కువ మృతదేహాలు వస్తే తలుపు వద్ద అరుగుపై ఉంచుతున్నారు. దాదాపుగా ఏరియా ఆస్పత్రులు అన్నింట్లో ఇదే పరిస్థితి ఉంది. ఒకేరోజు ఐదారు వస్తే సిబ్బంది అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది.

ప్రమాణాలకు దూరమే

శవ పరీక్షల్లో నిర్దేశిత ప్రమాణాలు పాటించాలి. ఎక్కడా అవి ఆచరణలో కనిపించట్లేదు. ప్రభుత్వాలు సైతం వీటిపై శీతకన్నేశాయి. కుటుంబలో వ్యక్తిని కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న వారికి ఈ వ్యవహారం మరింత బాధ కలిగించేలా ఉంది. ఇప్పటికీ దశాబ్దాల నాటి పరికరాలనే వినియోగిస్తున్నారు. గదుల్లో శుభ్రత ఊసే ఉండదు. ఈ వాతావరణంలో ఒక్కోసారి నివేదికలు తారుమారయ్యే ప్రమాదముంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ నెల 20న బోధన్‌ ఆస్పత్రిలో వరండాలో శవపరీక్ష నిర్వహించారు. దీనిని ఎవరో చరవాణిలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అప్పటికే శవగారంలో రెండు మృతదేహాలుండగా ఒకటి డీకంపోజై ఉంది. మూడో మృతదేహం సైతం మూడు రోజులు నీటిలో ఉన్నది కావడంతో కదల్చలేని పరిస్థితుల్లో వరండాలో చేయాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు.

జరుగుతున్నదేమిటి?

ఎప్పుడో నిర్మించిన గదుల్లో పీఎం నిర్వహిస్తున్నారు. ఒక్కోసారి నీటి సదుపాయం లేక బకెట్లలో తెచ్చి పరీక్షలు చేస్తున్న సందర్భాలున్నాయి.

ఒకేరోజు 3- 5 కేసులు వస్తే డ్యూటీ డాక్టర్లు పరీక్షించలేని పరిస్థితి. పరీక్షలు చేసొచ్చి రోగులను చూడాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెబుతున్నారు. ●● కనీసం పోలీసులు, మృతుడి బంధువులు కూర్చోవడానికి సదుపాయం ఉండదు. ●● మృతదేహాల సంఖ్య పెరుగుతున్నా పీఎం గదులను విస్తరించలేకపోతున్నారు. గదుల్లో అంతా అపరిశుభ్రమే. వాటి సమీపంలోకి కూడా వెళ్లలేని పరిస్థితి. ●● నాలుగో తరగతి ఉద్యోగుల నియామకాలు లేక పీఎం నిర్వహించే సిబ్బంది సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ●● పొద్దుపోయాక తీసుకొచ్చే కేసులకు పరీక్ష నిర్వహించరు. ఒకవేళ కుళ్లిపోయిన శవం వస్తే ఆస్పత్రి ఆవరణ సహా.. పరిసర ఆవాస ప్రజలకు ఇబ్బందికరంగా మారుతోంది. ●● ఫ్రీజర్లను శుభ్రంగా ఉన్న మృతదేహాలను భద్రపరచడానికే వినియోగిస్తున్నారు. ●● జిల్లా కేంద్రంలోని బోధనాస్పత్రిలో మాత్రం ఎంసీఐ అనుమతి కోసం వైద్య విద్యార్థులు నేర్చుకునేలా సదుపాయాలు కల్పించారు.

బాధలో ఉన్న వారికి పీఎం(పోస్టుమార్టం) నిరీక్షణకు గురిచేస్తోందని గుర్తించి, శవ పరీక్షలు ఎక్కువగా జరిగే వైద్య విధాన పరిషత్‌ పరిధిలోని ఏరియా ఆస్పత్రులకు ఫోరెన్సిక్‌ నిపుణులను మంజూరు చేసినా భర్తీ కాలేదు. వైద్య విద్య పీజీలో ఫోరెన్సిక్‌ నిపుణులకు సీట్లు పరిమితంగా ఉండటంతోవారికి వైద్య కళాశాలల్లో డిమాండు ఉంటుంది. వారు ఉంటేనే శవగారాంలో మౌలిక వసతులపై స్పష్టత వస్తుంది. సాధారణ ఎంబీబీఎస్‌, ఇతర స్పెషాలిటీ కోర్సులు చేసిన వైద్యులే పరీక్షలు చేస్తున్నారు. వారికి ప్రమాణాలపై పరిమిత అవగాహన ఉంటుంది.

ఫోరెన్సిక్‌ నిపుణుడి కోసం లేఖ రాశాం

బోధన్‌లో శవ పరీక్షల సంఖ్య పెరుగుతున్నది వాస్తవమే. ఆస్పత్రికి ఫోరెన్సిక్‌ నిపుణుల పోస్టు ఒకటి మంజూరైంది. ఇక్కడి అవసరాల నేపథ్యంలో సదరు పోస్టు భర్తీ చేయాలని ఉన్నతాధికారులను కోరాం. సదుపాయాల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

- డాక్టర్‌ అన్నపూర్ణ, బోధన్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌

 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.