close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

భక్తుల కొంగుబంగారం పబ్బతి అంజన్న

నేటి నుంచి మద్దిమడుగులో దీక్ష మాల విరమణ ఉత్సవాలు

వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలి రానున్న భక్తులు

న్యూస్‌టుడే, అమ్రాబాద్‌

మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయం

భక్తుల కొంగు బంగారంగా నల్లమలలో వెలసిన పబ్బతి అంజన్న ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పదర మండలం మద్దిమడుగులో ఈ సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హనుమాన్‌ భక్తులు దీక్ష మాల విరమణ కోసం వేలాదిగా తరలి రానున్నారు. అయిదు రోజుల పాటు సాగే ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మాల విరమణ, ప్రత్యేక పూజలు, హోమాల నిర్వహణ కోసం తగిన సదుపాయాలు కల్పించారు. భక్తులు పెద్దఎత్తున తరలి వస్తుండటంతో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నీటి సదుపాయం, వసతి కల్పిస్తున్నారు. మాల ధరించిన భక్తులు 41 రోజుల పాటు నియమ, నిష్ఠలతో దీక్షలు కొనసాగించి, ఈ ఉత్సవాల్లో మాల విరమణ చేస్తారు.

దినదిన ప్రవర్ధమానం..: నల్లమల లోతట్టులో వెలసిన మద్దిమడుగు ఆంజనేయ స్వామి ఆలయం దినదిన ప్రవర్ధమానంగా వెలగొందుతోంది. కనీసం కాలినడక దారి లేని కాలం నుంచి కూడా స్వామి వారు భక్తుల నీరాజనాలు అందుకొంటున్నారు. ప్రస్తుతం రవాణా సదుపాయాలు మెరుగు పడటం, ఆలయం వరకు బీటీ రోడ్డు ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాలు, బస్సులు, కాలినడకన వేలాదిగా తరలివస్తున్నారు. భక్తుల సంఖ్యకు తగ్గట్టు ఆలయ అధికారులు సదుపాయాలు కూడా మెరుగు పరుస్తున్నారు. భక్తుల విరాళాలతోనే ఆలయంలో గ్రానైట్‌ బండలు, గరుడ, ఉష్ట్ర వాహనాలు, కోట మైసమ్మ ఆలయ పునః నిర్మాణం, ఆలయం ఎదుట ధ్వజ స్తంభానికి ఇత్తడి తొడుగు, భక్తులకు విశ్రాంతి గదులు సమకూర్చారు. స్నానవాటిక చుట్టూ టైల్స్‌ బిగించి బురద లేకుండా చేశారు. ఏడంతస్థుల రాజగోపురం, ఆలయం చుట్టు ప్రహరీతో పాటు సీసీరోడ్డు ఏర్పాటు చేశారు.

ఉత్సవాలు ఇలా..: తొలిరోజు 8వ తేదీ ఆదివారం నిత్యార్చన, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వాచనం, పంచగవ్యం, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, ఉష్ట్ర వాహన సేవ ఉంటుంది. 9న సోమవారం ఉదయం విఘ్నేశ్వరపూజ, పంచగవ్యం, వాస్తుపూజ హోమం, రుద్రహోమం, సహస్రనామార్చన, బలిహరణం, మన్యుసూక్త హోమం, రాత్రి అశ్వవాహన సేవ, 10వ తేదీ విఘ్నేశ్వర పూజ, గవ్యాంతర పూజలు, రుద్రహోమం, నిత్యోపాసన, హనుమద్‌ వ్రతం, రాత్రికి శివపార్వతుల కల్యాణం, గజ వాహన సేవ నిర్వహించనున్నారు. 11న విఘ్నేశ్వర పూజ, రుద్రహోమం, నిత్యోపాసన, మహానివేదన, రాత్రికి సీతారాముల కల్యాణం, గరుఢ వాహన సేవ, 12న గురువారం గవ్యాంతర పూజలు, మన్యు సూక్తములతో ఆంజనేయస్వామికి 108 కలశాలతో మహా కుంభాభిషేకం, హనుమద్‌ గాయత్రీ మహాయజ్ఞం, పూర్ణాహుతి, అవబృదం తదితర కార్యక్రమాలు ఉంటాయి. ఆలయ ప్రధాన అర్చకులు వీరయ్యశాస్త్రి ఆధ్వర్యంలో ఈ క్రతువులు కొనసాగుతాయి. ఈవో రామశర్మ, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.