close

ప్ర‌త్యేక క‌థ‌నం

అడవుల్లో నివాసం ఆదివాసీల హక్కు

వారిని తరలించడం తగదు 
కేంద్రానికి ఐక్యరాజ్య సమితి నిపుణుల సూచన 
ఈనాడు - దిల్లీ

టవీ భూములతో విడదీయరాని అనుబంధం ఏర్పరుచుకున్న  90 లక్షలమంది గిరిజనులను అక్కడి నుంచి తరలించే ప్రక్రియను నిలిపేయాలని ఐక్యరాజ్య సమితి నిపుణులు భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి మానవహక్కుల విభాగం గురువారం ప్రకటన విడుదల చేసింది. రక్షిత అటవీప్రాంతాలను ఆక్రమించడం వల్ల అడవులు అంతరించిపోతున్నాయంటూ వన్యప్రాణి సంరక్షణ సంస్థలు వేసిన కేసులో ఫిబ్రవరి 13వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వం ఆదివాసీలను ఖాళీచేయించేందుకు ఉపక్రమించిన విషయాన్ని గుర్తుచేసింది. ‘‘ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం... ఆదివాసీలు అడవుల్లో అక్రమంగా నివసిస్తున్నారని చెప్పడమే. అది పూర్తిగా తప్పు. వాస్తవంగా స్థానిక ప్రజలే అక్కడి భూములు, అడవులకు యజమానులు’’ అని ఐక్య రాజ్యసమితి మానవ హక్కుల విభాగంలో స్థానిక ప్రజల హక్కుల ప్రత్యేక పర్యవేక్షకురాలు విక్టోరియా టౌలీ పేర్కొన్నారు. ఆ భూములు ఆదివాసీలవే అయినా దశాబ్దాల తరబడి వాటిని రక్షించుకోవడంలో కీలక భూమిక పోషిస్తున్న దేశీయ ప్రజలు, స్థానిక సంఘాలపై కబ్జాదారులుగా ముద్రవేస్తున్నారు’’అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.. 2006 అటవీహక్కుల చట్టం కింద గిరిజనులను ఖాళీచేయించాలన్న ఉత్తర్వులపై సుప్రీంకోర్టు 2019 ఫిబ్రవరి 28వ తేదీన స్టే విధించి, ఆదివాసీల అటవీహక్కులను ఏ ప్రాతిపదికన ఖరారు చేయాలనుకుంటున్నారో జులై 12వ తేదీలోపు చెప్పాలని రాష్ట్రాలను కోరినట్లు గుర్తుచేశారు. ఈ ఉత్తర్వుల మేరకు నాలుగు నెలలపాటు గిరిజనుల తరలింపును వాయిదా వేసినప్పటికీ లక్షలాది మంది గిరిజనుల పరిస్థితి ఇప్పటికీ ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపారు. వారిని ఖాళీచేయిస్తే నివాస ప్రాంతాలకు దూరమవడమే కాకుండా జీవనోపాధి, సంస్కృతినీ కోల్పోతారని ఆమె అభిప్రాయపడ్డారు. ఆదివాసీలను అటవీ భూముల నుంచి బలవంతంగా తరలించే ప్రక్రియపై మారటోరియం విధించాలని 2016లో తాను సిఫార్సు చేసినట్లు గుర్తుచేశారు. బాధితులకు కనీసం తలదాచుకొనేందుకు వసతి కూడా చూపించకుండా ఖాళీ చేయించడం  మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. పులుల సంరక్షణ పేరుతో ఇప్పటికే అటవీప్రాంతాల నుంచి ఖాళీ చేయించడం వల్ల అనేక మంది నివాసాలు కోల్పోయారన్నారు. పులుల సంరక్షణ ప్రాంతాల్లో  స్థానిక ప్రజలు నివసించడంవల్లే పులుల సంఖ్య పెరిగిందన్న విషయాన్ని గుర్తుంచాలన్నారు. తరతరాలుగా భారతీయ ఆదివాసీలు వన్యప్రాణులతో కలిసి జీవించడంతోపాటు వాటిని అటవీ సంపదగా భావించి సంరక్షిస్తున్నారని తెలిపారు. వన్యప్రాణులు, అటవీప్రాంతాలను సంరక్షించాలనుకొనేవారు ఆదివాసీలను ఖాళీచేయించడానికి బదులు వారి అటవీ హక్కులను గుర్తించాలన్నారు. అటవీహక్కుల చట్టం స్ఫూర్తిని నిలబెట్టాలని తాము భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అటవీ హక్కుల కోసం గిరిజనులు పెట్టుకున్న దరఖాస్తులపై పారదర్శకమైన, స్వతంత్ర విచారణ జరగాలన్నారు. తద్వారా వారి జీవనానికి భరోసా ఇవ్వాలని సూచించారు. ఎక్కడైనా తరలించక తప్పని పరిస్థితి ఉంటే వారికి తగిన పరిహారం ఇచ్చి పునరావాసం కల్పించాలని డిమాండ్‌ చేశారు. అటవీచట్టం-1927కి తలపెట్టిన సవరణలను అమల్లోకి తీసుకొస్తే మరింత ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు.

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.