close

ప్ర‌త్యేక క‌థ‌నం

సగం సంపద 1%మంది చేతుల్లో

ఆక్స్‌ఫామ్‌ నివేదిక
దేశంలో ధనవంతులు మరింత కుబేరులవుతున్నారు

సగం సంపద 1%మంది చేతుల్లో

దావోస్‌: దేశంలో సంపన్నులు మరింత కుబేరులవుతున్నారు. 2018లో కేవలం ఒక్కశాతం మంది ధనవంతుల సంపద 39 శాతం(రోజుకు రూ.2200 కోట్లు) పెరిగితే.. అట్టడుగునున్న సగం మంది జనాభా సంపద కేవలం 3 శాతం పెరిగింది. దాదాపు సగానికి పైగా దేశ సంపద ఈ ఒక్కశాతం మంది చేతుల్లోనే ఉంది. ఆక్స్‌ఫామ్‌ అధ్యయనం ఈ విస్తుపోయే వాస్తవాల్ని వెల్లడించింది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్‌) సదస్సుకు ముందు ఆక్స్‌ఫామ్‌ ఈ నివేదికను విడుదల చేసింది. పేదలు తిండికోసం నకనకలాడుతుంటే.. ధనవంతుల సంపద ఇలా విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగించే పరిణామమని ఆక్స్‌ఫామ్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విన్నీ బ్యాన్యిమా అభిప్రాయపడ్డారు. ధనిక, పేదల మధ్య అంతరాన్ని తగ్గించడానికి రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తక్షణ చర్యలు చేపట్టాలని, లేకపోతే ప్రజల్లో ఆందోళనలు పెచ్చుమీరే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

మహిళల శ్రమకు ప్రతిఫలమేదీ?
గృహిణులు చేస్తున్న ఇంటిపనులు, పిల్లల పెంపకానికి ఎలాంటి వేతన చెల్లింపులు లేని విషయాన్ని ఆక్స్‌ఫామ్‌ గుర్తుచేసింది. 

సగం సంపద 1%మంది చేతుల్లో* దేశంలో గృహిణులు చేస్తున్న పని విలువ- జీడీపీలో 3.1%
* పట్టణాల్లో రోజుకు 312 నిముషాలు, గ్రామాల్లో రోజుకు 291 నిముషాలు మహిళలు చెల్లింపుల్లేని పనిచేస్తున్నారు. 
* వీరితో పోల్చుకుంటే పురుషులు పట్టణాల్లో 29 నిముషాలు, గ్రామాల్లో 32 నిముషాలు ఇలా చెల్లింపుల్లేని పనిచేస్తున్నారు. 

* ప్రపంచంలో చెల్లింపుల్లేకుండా ఏటా మహిళలు చేస్తున్న పని విలువ- 10 లక్షల కోట్ల డాలర్లు. ఇది యాపిల్‌ కంపెనీ వార్షిక టర్నోవర్‌ కన్నా 43 రెట్లు ఎక్కువ. 

9 మంది కుబేరుల సంపద- అట్టడుగునున్న 50% మంది జనాభా సంపదతో సమానం.
* 2018లో దేశంలో 18 మంది కొత్తగా కుబేరులయ్యారు. దీంతో వీరి సంఖ్య 119కి చేరింది. వీరిలో 9 మంది మహిళలు.
* 119 మంది అత్యంత సంపన్నుల వద్దనున్న ధనం- రూ.28 లక్షల కోట్లు(44000 కోట్ల డాలర్లు. 2017లో ఇది 32500 కోట్ల డాలర్లే). 2008 తర్వాత ఇంత ఎక్కువగా పెరిగింది 2018లోనే.
* దేశంలో అత్యంత పేదలైన 13.6 కోట్ల మంది(దేశ జనాభాలో 10%) 2004 నుంచి అప్పుల్లో కూరుకుపోతూనే ఉన్నారు. 
* సుసంపన్నులైన 1% మంది తమ సంపదపై అదనంగా చెల్లిస్తున్న పన్నులు 0.5% మాత్రమే.
ప్రపంచంలో...
* ప్రపంచంలో కుబేరుల సంపద 2018లో రోజుకు 12% లేదా 250 కోట్ల డాలర్లు పెరిగింది. 
* పేదల సంపద 11% మేర తగ్గిపోయింది. 
ప్రపంచంలోని 26 మంది కుబేరుల సంపద 380 కోట్ల మంది పేదల ధనంతో సమానం. గత ఏడాది వీరి సంఖ్య 44గా ఉండేది.

సగం సంపద 1%మంది చేతుల్లో

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యం, ప్రజారోగ్యం, పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై వెచ్చించే మొత్తం రూ.2,08,166 కోట్లు. ఈ మొత్తం అపరకుబేరుడైన ముఖేష్‌ అంబానీ సంపద రూ.2.8 లక్షల కోట్ల కన్నా తక్కువ.

* 2018-2022 మధ్య దేశంలో రోజుకు 70 మంది కొత్త కుబేరులు తయారవుతారు. 

సగం సంపద 1%మంది చేతుల్లో

* అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ సంపద 11200 కోట్ల డాలర్లు పెరిగింది. ఆయన ఒక్క శాతం సంపద ఇథియోపియా ఆరోగ్య బడ్జెట్‌తో సమానం.

 

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.