CoronaVaccine: సైడ్‌ ఎఫెక్ట్స్‌ స్వల్పమే!

తాజా వార్తలు

Updated : 28/04/2021 15:34 IST

CoronaVaccine: సైడ్‌ ఎఫెక్ట్స్‌ స్వల్పమే!

ఒకటి, రెండు రోజుల్లోనే పూర్తి నయం
తాజా అధ్యయనంలో వెల్లడి

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్న వేళ.. కొందరిలో వ్యాక్సిన్‌పై భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ల కలిగే దుష్ప్రభావాలు (సైడ్‌ ఎఫెక్ట్స్‌) స్వల్పమేనని బ్రిటన్‌ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. వ్యాక్సిన్‌ తీసుకున్న నలుగురిలో ఒకరికి మాత్రమే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపిస్తుండగా.. అవికూడా ఒకటి లేదా రెండు రోజుల్లోనే తగ్గిపోతున్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన పరిశోధనా పత్రం ‘ది లాన్సెట్‌’ జర్నల్‌లో ప్రచురితమైంది.

నలుగురిలో ఒకరికి మాత్రమే స్వల్ప దుష్ర్పభావాలు..

వ్యాక్సిన్‌ తీసుకున్న నలుగురిలో ఒకరిలో మాత్రమే జ్వరం, తలనొప్పి, అలసట, వికారం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని లండన్‌ పరిశోధకులు గుర్తించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న 24గంటల్లోనే ఇవి కాస్త ఎక్కువగా అనిపించినప్పటికీ.. ఒకట్రెండు రోజుల్లోనే పూర్తిగా నయం అవుతున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఇక ఇంజక్షన్‌ ఇచ్చిన చోట నొప్పి సాధారణంగా కలిగే విషయమేనని తెలిపారు. అయినా దాదాపు 80శాతం సాధారణ ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకునేందుకే మొగ్గు చూపుతున్నట్లు బ్రిటన్‌ పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లు సురక్షితమేనని తాజా అధ్యయనం మరోసారి స్పష్టం చేస్తోందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన కింగ్స్‌ కాలేజీ లండన్‌ నిపుణుడు డాక్టర్‌ క్రిస్టినా మెన్నీ స్పష్టంచేశారు.

భారీగా తగ్గిన ఇన్‌ఫెక్షన్‌ రేటు

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత 12 నుంచి 21రోజుల్లోనే ఇన్‌ఫెక్షన్‌ రేటు భారీగా తగ్గినట్లు తాజా అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా ఫైజర్‌ వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్న వారిలో 58శాతం, ఆస్ట్రాజెనెకా తీసుకున్న వారిలో 39శాతం ఇన్‌ఫెక్షన్‌ రేటు తగ్గినట్లు వెల్లడైంది. ఇక మొదటి డోసు తీసుకున్న 21 రోజుల తర్వాత ఇన్‌ఫెక్షన్‌ తగ్గుదల (ఫైజర్‌ 69శాతం, ఆస్ట్రాజెనెకా 60శాతం) గణనీయంగా కనిపించిందని అధ్యయనం పేర్కొంది.

ఇక కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల దుష్ర్పభావాలు కలుగుతాయనే ఆందోళన కొందరిలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌లు తీసుకున్న అనంతరం వాటి ప్రభావాలను అంచనా వేసేందుకు కింగ్స్‌ కాలేజీ లండన్‌ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా బ్రిటన్‌లో ZOE COVID యాప్‌ ద్వారా ఫైజర్‌, ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లు తీసుకున్న 6,27,383 మంది ఇచ్చిన సమాచారాన్ని విశ్లేషించారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో గుర్తించిన సైడ్‌ ఎఫెక్ట్స్‌తో పోలిస్తే ప్రస్తుతం వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో స్వల్పంగానే దుష్ర్పభావాలు కనిపించినట్లు గుర్తించారు. ఫైజర్‌ ప్రయోగాల సమయంలో టీకా తీసుకున్న వారిలో 77శాతం మంది ఇంజక్షన్‌ ఇచ్చిన చోట నొప్పి ఉన్నట్లు పేర్కొనగా..తాజా అధ్యయనంలో మాత్రం కేవలం 30శాతం మంది మాత్రమే ఆ సమస్య వచ్చినట్లు వెల్లడించారు.

అధ్యయనంలో మరిన్ని అంశాలు..

* టీకా తీసుకున్న వారిలో 25.4శాతం మందిలో (ఇంజక్షన్‌ తీసుకున్న చోటు కాకుండా) ఒకటి లేదా రెండు సైడ్‌ ఎఫెక్టులు కనిపించాయి. ఇక ఇంజక్షన్‌ తీసుకున్న చోట నొప్పి ఉన్నట్లు 66.2శాతం మంది వెల్లడించారు.

* ఫైజర్‌ టీకా మొదటి డోసు తీసుకున్న వారిలో 13.5శాతం మంది సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయని తెలపగా.. రెండో డోసు తర్వాత 22శాతం మంది కొంత అస్వస్థత ఉన్నట్లు వెల్లడించారు. అదే ఆస్ట్రాజెనెకా టీకా తీసుకున్న వారిలో 33.7శాతం మంది స్వల్ప సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయని తెలిపారు.

* వ్యాక్సిన్‌ తీసుకున్న ఎక్కువ మందిలో తలనొప్పి ఉన్నట్లు పేర్కొనగా.. అతి ఎక్కువ కనిపించిన రెండో లక్షణం అలసటగా పరిశోధకులు గుర్తించారు. అయితే, రెండు వ్యాక్సిన్‌లు తీసుకున్న వారందరిలోనూ ఇంజక్షన్‌ తీసుకున్న భుజం నొప్పి కనిపించినట్లు పరిశోధకులు వెల్లడించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని